Published : 18/01/2021 03:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పాల ఏకరుల సమస్యల పరిష్కారానికి కృషి

ఆత్మీయ సమ్మేళనంలో పెద్దిరెడ్డి

సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి పెద్దిరెడ్డి

మదనపల్లె పట్టణం: పాల ఏకరుల సమస్యలు పరిష్కరించడంతో పాటు సామాజిక భవనాల నిర్మాణానికి తన వంతు కృషి చేస్తానని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. మదనపల్లె జడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో ఆదివారం పాల ఏకరుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ముందుగా రెడ్డీస్‌ కాలనీలో ఏర్పాటు చేసిన పాల ఏకరుల కార్పొరేషన్‌ క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించారు. అక్కడ్నుంచి యువకులు ద్విచక్ర వాహనాల ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. వైకాపాకు పాల ఏకరులు అండగా ఉన్నారని గుర్తుచేశారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా వినియోగించుకొని వారి సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారని ఆరోపించారు. వైకాపా అధికారంలోకి వచ్చాక బీసీలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చి 56 కులాలకు కార్పొరేషన్లను ఏర్పాటు చేయడంతో పాటు ఛైర్మన్లను నియమించినట్లు పేర్కొన్నారు.

బీసీలకు అనేక పథకాలు..

ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి బీసీల సంక్షేమానికి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని, ఏ ప్రభుత్వమూ ఇంత పెద్దస్థాయిలో పథకాలను అమలు చేయలేదన్నారు. రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని బీసీ సామాజిక వర్గానికి చెందిన ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి కార్పొరేషన్లు ఏర్పాటు చేశారన్నారు. పాల ఏకరుల సంఘం రాష్ట్ర ఛైర్మన్‌ మురళి మాట్లాడుతూ.. తమ సామాజికవర్గానికి చెందిన ఉప కులాలను బీసీ జాబితాలో చేర్చాలని మంత్రుల దృష్టికి తెచ్చారు. రాజకీయంగా ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప, మదనపల్లె, తంబళ్లపల్లె, పీలేరు, చిత్తూరు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు నవాజ్‌బాషా, ద్వారకనాథరెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, ఆరణి శ్రీనివాసులు, నాయకులు ఆంజినేయులు, కిరణ్మయి, శేషాచలపతి, తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని