
తిరుపతి ప్రసూతి ఆస్పత్రిలో కలకలం
నిరసన తెలుపుతున్న మహిళతో బంధువులు
తిరుపతి(వైద్యవిభాగం): తిరుపతి ప్రసూతి ఆస్పత్రి వద్ద ఆదివారం ఉదయం శిశువు మాయం కలకలం రేపింది. మధ్యాహ్నం వరకు ఉత్కంఠ రేపిన ఈ ఘటన చివరికి ఆమె గర్భమే దాల్చలేదని వైద్యులు తేల్చడంతో తెరపడింది. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట మండలం మంగనెల్లూరు గ్రామానికి చెందిన సురేష్ భార్య శశికళ (23) శనివారం రాత్రి తిరుపతి ప్రసూతి ఆస్పత్రికి వచ్చింది. ఓపీ తీసుకుంది.‘ఆ రాత్రి ఎవరో మగ డాక్టర్ వచ్చి డెలివరీ రూమ్‌కు తీసుకెళ్లి.. ప్రసవ సమయంలో బిడ్డను మాయం చేశారు’..అని ఆమె బంధువులు ఆదివారం ఉదయం ఆరోపించారు. శశికళకు ఏడేళ్ల తర్వాత గర్భం వచ్చిందని భావించడంతో గూడూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చూపించి నెలవారీ వైద్యం పొందారు. అక్కడ కొన్ని పరీక్షలు కూడా చేశారు. ఆమెకు బంధువుల సమక్షంలో సీమంతం కూడా పూర్తయింది. ఈ తరుణంలో తిరుపతిలోని ఆస్పత్రికి గత నెల ఓపీకి వచ్చింది. మళ్లీ ఈ నెల 2, 5వ తేదీల్లో ఓపీకి వచ్చింది. ఆ సమయంలో వైద్యులు కొన్ని మందులు ఇచ్ఛి. కొన్ని పరీక్షలు చేసుకొమ్మని సూచించారు. ‘ డెలివరీకి ఈ నెల 16వ తేదీన రావాలని వైద్యులు చెప్పారని.. నొప్పులు రావడంతో ముందు రోజే వచ్చినా చేర్చుకోలేదు’..అని ఆమె బంధువులు ఆరోపించారు. తీరా ఆదివారం ఉదయం ఇలా జరిగిందంటూ ఆస్పత్రి ముందు నిరసనకు దిగారు.
ఆస్పత్రిలో చేరనే లేదు: మూడు సార్లు ప్రసూతి ఆస్పత్రి ఓపీకి వచ్చిన శశికళ వైద్యులు సూచించిన పరీక్షలు చేసుకోలేదని ఆస్పత్రి ఆర్ఎంఓ డాక్టర్ సీతారామరాజు తెలిపారు. గత నాలుగు రోజులుగా ఆస్పత్రి చుట్టూ తిరుగుతూ ఈ నెల 16వ తేదీన రాత్రి మళ్లీ ఓపీ తీసుకుందన్నారు. ఆదివారం ఉదయం ఆరు గంటలకు బాధిత మహిళతోపాటు బంధువులు ఆస్పత్రి మెట్లపై గుమిగూడి డ్యూటీలో ఉన్న మగ డాక్టర్ శిశువును మాయం చేశారని ఆరోపించారన్నారు. నిజానికి మగ డాక్టర్ ఆ రాత్రి డ్యూటీలో లేరని గుర్తు చేశారు. అసలు ఆస్పత్రిలో అడ్మిషన్ తీసుకోలేదని.. దానికి సంబంధించిన రికార్డులను పోలీసులకు అప్పగించామని చెప్పారు.
ఆమెకు గర్భమే లేదు: శశికళ గర్భమే దాల్చలేదని అలిపిరి సీఐ దేవేంద్రకుమార్ ప్రకటించారు. ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిపై ఆరోపణలు చేయడంతో నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆమెకు పరీక్షలు చేయించామని చెప్పారు. గత రాత్రి ప్రసవించినట్లు ఎలాంటి ఆధారాలు లేవని వైద్యులు తేల్చి చెప్పినట్లు తెలిపారు. ఎన్నో సమస్యలతో కడుపు ఉబ్బినట్లు కూడా కన్పించవచ్చని నిర్ధరించారు. మొదట పరీక్షించిన వైద్యులు గర్భం కాదని నిర్ధరించి ఉంటే ఇంతవరకు వచ్చేది కాదని సీఐ అభిప్రాయపడ్డారు.