
భవిష్యత్తుకు భరోసా
● శ్రేణులతో తెదేపా అధినేత మమేకం
● తమ్ముళ్లలో ఉత్తేజం
కార్యకర్తల వినతులను చంద్రబాబుకు చెబుతున్న అమరనాథరెడ్డి
ఈనాడు డిజిటల్, చిత్తూరు- న్యూస్టుడే, శాంతిపురం: కుప్పం నియోజకవర్గంలో తెదేపా అధినేత చంద్రబాబునాయుడు పర్యటన శనివారంతో ముగిసింది. కుప్పం గ్రామీణ, రామకుప్పం, శాంతిపురం మండలాల్లో రెండు రోజుల పాటు కార్యకర్తలతో సమావేశమైన ఆయన.. మార్గమధ్యలో ప్రజలతో మమేకమయ్యారు. చివరి రోజు శనివారం కుప్పం మున్సిపాలిటీ, ఐటీడీపీ కార్యకర్తలతో సమావేశమై శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. అధినేత పర్యటన తెలుగు తమ్ముళ్లకు నూతనోత్సాహాన్ని ఇచ్చింది. ప్రజా పోరాటానికి సిద్ధం కావాలంటూ ఇచ్చిన పిలుపునకు కార్యకర్తల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభించింది. రామకుప్పంలో వచ్చిన ప్రజలు, కార్యకర్తలను చూసి.. ఇటువంటి స్పందనను గతంలో తానెప్పుడూ ఈ మండలంలో చూడలేదని తెలిపారు. పర్యటన శ్రేణులను పరిషత్ ఎన్నికలకు సమాయత్తం చేసింది. ఇదే సమయంలో నాయకత్వంపై కూడా స్పష్టత ఇచ్చారు. తమ అధ్యక్షుడి మూడు రోజుల పర్యటన లక్ష్యం నెరవేరిందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
సమర్థ నాయకత్వాన్ని అందిస్తా: మూడు రోజుల పాటు ఆయన మండలాల వారీగా కార్యకర్తలతో సమీక్ష సమావేశాలు నిర్వహించారు. పంచాయతీ ఎన్నికల ఫలితాలపై ఆరా తీసి.. ఈ పరిస్థితికి కారణమేంటి? ఇందుకు ఏం చేస్తే బాగుంటుందో కూడా మీరే చెప్పాలంటూ శ్రేణులకు సూచించారు. ఓటర్లకు తెదేపా అంటే అభిమానమున్నప్పటికీ.. కొందరు నాయకుల తీరు, అధికార పార్టీ ప్రలోభాలతోనే ఫలితాలు ఇలా వచ్చాయని కార్యకర్తలు చంద్రబాబుకు తెలిపారు. నాయకత్వాన్ని మార్చాలని ఆయన్ని కోరారు. తమకు అన్నీ తెలుసనే భావనతో సీనియర్లు ఉన్నారని.. ఇది తగదని అధినేత వారికి చురకలు అంటించారు. ఇదే సమయంలో వారి సేవలకు తగిన గౌరవం ఉంటుందని చెబుతూనే.. పార్టీకి కొత్త రక్తాన్ని ఎక్కిస్తానని హామీ ఇచ్చినట్టు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. నియోజకవర్గంలో సమర్థ నాయకత్వాన్ని అందిస్తానని తెదేపా అధినేత స్పష్టం చేశారు.
పంచాయతీల వారీగా సమీక్ష: కార్యకర్తల సమావేశం ముగిసిన తర్వాత.. చంద్రబాబునాయుడు పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, విజయం సాధించిన వారితో మాట్లాడారు. షెడ్యూల్ ప్రకారం ఈ సమావేశం లేనప్పటికీ.. క్షేత్రస్థాయి పరిస్థితులు తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. గురువారం గుడుపల్లె, కుప్పం గ్రామీణ మండలాలకు సంబంధించి రాత్రి 11 గంటలకు, శుక్రవారం శాంతిపురం, రామకుప్పం మండలాల అభ్యర్థులతో రాత్రి 10 గంటల తర్వాత సమావేశాలు నిర్వహించారు. ఎన్నడూ లేనంతగా కార్యకర్తలకు చంద్రబాబు మరింత దగ్గరయ్యారని.. భవిష్యత్తును చూసుకుంటాననే భరోసా ఇవ్వడంతో శ్రేణుల్లో ఉత్సాహం వచ్చిందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
శాంతిపురంలో కార్యకర్తల అభిప్రాయాలను తెలుసుకొంటున్న మాజీ సీఎం