Updated : 28/02/2021 05:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

తితిదే ఉద్యోగులకు కరోనా వ్యాక్సిన్‌

● తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి


సమావేశంలో మాట్లాడుతున్న వైవీ సుబ్బారెడ్డి

ఈనాడు-తిరుపతి, తిరుమల, న్యూస్‌టుడే: బర్డ్‌ ఆసుపత్రి పాత ఓపీ భవనంలో నూతనంగా నిర్మించనున్న ఎస్వీ చిన్నపిల్లల వైద్యశాల భవన నిర్మాణానికి ప్రాథమికంగా రూ.9 కోట్లు విడుదల చేయాలని తీర్మానించినట్లు తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. శనివారం అన్నమయ్య భవనంలో తితిదే ధర్మకర్తల మండలి సమావేశం ఛైర్మన్‌ అధ్యక్షతన జరిగింది. సమావేశంలో తితిదే ఈవో జవహర్‌రెడ్డి, తితిదే ఎక్స్‌ అఫిషియో సభ్యురాలు వాణీమోహన్‌తోపాటు బోర్డు సభ్యులు నేరుగా, వర్చువల్‌ విధానంలో పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తితిదే ఛైర్మన్‌ బోర్డు నిర్ణయాలను వెల్లడించారు. తితిదే ఉద్యోగుల ఆరోగ్యరక్షణకు కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేయించాలని నిర్ణయించినట్టు తెలిపారు. తద్వారా ఉద్యోగులకు ఆరోగ్యభద్రత ఉంటుందన్నారు. శ్రీవారి దర్శనానికి నడిచి వచ్చే భక్తుల కోసం శ్రీనివాసమంగాపురం, శ్రీవారి మెట్టు వద్ద తితిదే అన్నప్రసాద కేంద్రాల్ని ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. తితిదే ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఉన్న ఆరు వేదపాఠశాలలకు శ్రీ వేంకటేశ్వర వేదవిజ్ఞానపీఠం పేరును ఖరారు చేశామన్నారు. సమావేశంలో పాలకమండలి సభ్యులు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, శివకుమార్‌, గోవిందహరి, డీపీ అనంత, శ్రీరాములు, ఎం.రాములు, ప్రత్యేక ఆహ్వానితులు కరుణాకర్‌రెడ్డి, తితిదే ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

గరుడ వారధికి రూ.50 కోట్లు

తితిదే పాలక మండలి సమావేశంలో బడ్జెట్‌కు ఆమోదం తెలిపారు. ఇందులో తితిదే పరిధిలోని ఆసుపత్రులకు రూ.141 కోట్లు, విద్యా సంస్థలకు రూ.153.50 కోట్లు, విజిలెన్స్‌, భద్రతకు సంబంధించి వివిధ అవసరాల నిమిత్తం రూ.146 కోట్లు కేటాయించారు. హెచ్‌డీపీపీ ఇతర అనుబంధ ప్రాజెక్టులకు రూ.109.55 కోట్లు ఇవ్వనున్నారు. ఆరోగ్యం/పారిశుద్ధ్య అవసరాలకు రూ.110 కోట్లు, నిర్వహణ ఖర్చుల కింద రూ.60 కోట్లు, ఇంజినీరింగ్‌ పనులు చేపట్టేందుకు వచ్చే ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌లో రూ.300 కోట్లు, తిరుపతిలో నిర్మిస్తున్న గరుడ వారధి పనుల కోసం రూ.50 కోట్లు కేటాయించారు.

కానుకలు, ప్రసాదాల ద్వారా....

బ్యాంకుల నుంచి వచ్చే వడ్డీతోపాటు శ్రీవారికి వచ్చే కానుకలు, ప్రసాదాల విక్రయం ద్వారా ఆదాయం వస్తుందని తితిదే అధికారులు అంచనా వేస్తున్నారు. కానుకల ద్వారా సుమారు రూ.1110 కోట్లు, ప్రసాదాల విక్రయం ద్వారా రూ.375 కోట్లు, కల్యాణ కట్ట ద్వారా రూ.131 కోట్లు, వసతి గదులు, కల్యాణ మండపాల అద్దె ద్వారా రూ.93 కోట్లు వస్తాయని అంచనా. ఆర్జిత సేవల ద్వారా రూ.70 కోట్లు, బ్రేక్‌/ ప్రత్యేక ప్రవేశ దర్శనాల ద్వారా రూ.210 కోట్లు వస్తాయని అంచనా వేస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని