Published : 28/02/2021 05:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నిష్పక్షపాతంగా ఎన్నికల నిర్వహణ


మాట్లాడుతున్న నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌

 

ఈనాడు డిజిటల్‌, తిరుపతి: ఎన్నికల నిర్వహణ, ఏర్పాట్లు నిష్పక్షపాతంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల కమిషనరు నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ ఆదేశించారు. నగర, పురపాలక ఎన్నికల ఏర్పాట్లపై చిత్తూరు, అనంతపురం, కడప, కర్నూలు, నెల్లూరు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, మున్సిపల్‌ కమిషనర్లతో ఎస్‌ఈసీ శనివారం తిరుపతిలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీ ఎన్నికలను అధికారులు విజయవంతగా నిర్వహించారని కితాబిస్తూ... ఇదే స్ఫూర్తితో నగర, పురపాలక ఎన్నికలను నిర్వహించాలని సూచించారు. జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడానికి తీసుకున్న చర్యలను పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా ఎస్‌ఈసీకి కలెక్టరు హరినారాయణన్‌ తెలిపారు. సమీక్షలో పరిశీలకులు నవీన్‌కుమార్‌, ఎస్‌ఈసీ కార్యదర్శి కన్నబాబు, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ డైరెక్టరు ఎం.ఎం.నాయక్‌, పరిశీలకులు అదనపు డీజీపీ సంజయ్‌, అనంతపురం రేంజ్‌ డీఐజీ కాంతి రాణటాటా పాల్గొన్నారు.

●అమలుకాని న్యాయస్థానం ఆదేశాలు: ఎన్నికల విషయమై రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు ఎక్కడా అమలు కావడంలేదని ఎస్‌ఈసీ ఎదుట తెదేపా నేతలు ప్రస్తావించారు. నామినేషన్లలో అక్రమాలపై తగిన అధికారాలు వినియోగించి చర్యలు తీసుకోవాలని న్యాయస్థానం ఆదేశించినా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు తెదేపా తరఫున ఎమ్మెల్సీ రాజసింహులు, తెదేపా తిరుపతి పార్లమెంటు అధ్యక్షుడు నరసింహయాదవ్‌, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, భాజపా నేతలు శనివారం ఇక్కడ ఎస్‌ఈసీని కలిశారు. తిరుపతి, చిత్తూరు నగరపాలక సంస్థల నామినేషన్ల సందర్భంగా చోటు చేసుకున్న దౌర్జన్యాలు, ఇటీవల బెదిరింపులను నేతలు ప్రస్తావించారు. బెదిరింపుల కారణంగా తమ పార్టీ అభ్యర్థులు పరారీలో ఉన్నారని, నామినేషన్ల ఉపసంహరణకు అభ్యర్థులు స్వయంగా వచ్చే పక్షంలో అనుమతించాలని విన్నవించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని