Published : 28/02/2021 05:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

‘నిబంధనలు పాటించని విద్యాసంస్థలు సీజ్‌’


మాట్లాడుతున్న కమిషన్‌ వైస్‌ ఛైర్‌పర్సన్‌

తిరుపతి(విద్య): ప్రభుత్వ అనుమతి లేకుండా, నిబంధనలు పాటించకుండా నడుస్తున్న విద్యాసంస్థలను సీజ్‌ చేయడానికి ప్రభుత్వానికి సిఫార్సు చేసినట్లు ఆంధ్రప్రదేశ్‌ పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ సభ్యులు ఉద్ఘాటించారు. తిరుపతి శ్రీనివాసమంగాపురం సమీపంలోని నారాయణ విద్యాసంస్థల్లో ఈనెల 21న మృతిచెందిన విద్యార్థి గురించి అధ్యాపకులు, విద్యార్థులతో శనివారం మాట్లాడారు. తిరుపతి నగరం కొర్లగుంటలోని భారతి విద్యానికేతన్‌ను తనిఖీ చేశారు. ఎలాంటి నిబంధనలు పాటించని పాఠశాల గుర్తింపు రద్దు చేయాలని అధికారులను ఆదేశించారు. చెన్నారెడ్డి కాలనీలోని తిరుపతి ఉప విద్యాశాఖాధికారి కార్యాలయంలో విలేకరుల సమావేశంలో కమిషన్‌ వైస్‌ ఛైర్‌పర్సన్‌ డాక్టర్‌ విజయ శారదా రెడ్డి మాట్లాడుతూ.. నారాయణ విద్యాసంస్థలో యాజమాన్యం నిర్లక్ష్యంతోనే విద్యార్థి మృతిచెందాడని గుర్తించామన్నారు. రాష్ట్రంలోని ప్రైవేట్‌ డీఎడ్‌ కళాశాలల్లో 60 శాతం కళాశాలల మూసివేతకు ప్రభుత్వానికి సిఫార్సు చేశామన్నారు. సభ్యులు ప్రొఫెసర్‌ వి.నారాయణరెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం జారీ చేసిన జీవో 57ను ఎక్కడా అమలు చేయడం లేదని, అమలు చేయని విద్యాసంస్థలపై చర్యలు తీసుకుంటామన్నారు. మార్చి నెలలో జూనియర్‌ కళాశాలల ఫీజులు, ఏప్రిల్‌ నెలలో పాఠశాలల ఫీజులను నిర్ణయించి గ్రామ పంచాయతీ, మండల స్థాయిలో బోర్డులు ఏర్పాటు చేస్తామన్నారు. గతంలో తనిఖీ చేసిన నారాయణ కళాశాల, ఎన్‌ఆర్‌ఐ కళాశాలలకు నోటీసులు జారీ చేశామన్నారు. సీబీఎస్‌ఈ అమలు చేయడానికి కావాల్సిన వనరులు, లోటుపాట్లను గుర్తించేలా త్వరలో ప్రభుత్వానికి నివేదిక అందిస్తామన్నారు. కార్యక్రమంలో కమిషన్‌ సభ్యులు డాక్టర్‌ ఈశ్వరయ్య, ఆర్జేడీ వెంకటకృష్ణారెడ్డి, డీఈవో నరసింహారెడ్డి, తిరుపతి డీవైఈవో సి.విజయేంద్రరావు, డైట్‌ ప్రిన్సిపల్‌ డాక్టర్‌ శేఖర్‌, అధ్యాపకులు బాలాజీ తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని