
కాకినాడకు చేరిన వ్యాక్సిన్ నిల్వలు
కాకినాడ కలెక్టరేట్, న్యూస్‌టుడే: కొవిడ్-19పై మహాయుద్ధానికి జిల్లాలో రంగం సిద్ధమౌతోంది. కరోనా నివారణకు ఈ నెల 16 నుంచి టీకాలు వేసేందుకు ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. తొలి విడతలో జిల్లాలో గుర్తించిన 38,612 మంది ప్రభుత్వ, ప్రైవేటు వైద్యారోగ్య అధికారులు, సిబ్బందికి టీకాలు అందించడానికి చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా భారత్ బయోటెక్ తయారు చేసిన కొవాగ్జిన్ డోసులు బుధవారం జిల్లాకు చేరాయి. విజయవాడ సెంట్రల్ వ్యాక్సిన్ నిల్వ కేంద్రం నుంచి ప్రత్యేక వాహనంలో కట్టుదిట్టమైన భద్రత మధ్య టీకాలను కాకినాడలోని జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నిల్వ కేంద్రానికి ఉదయం 7 గంటలకు తీసుకువచ్చారు. తొలి విడతలో 47వేల డోసులు(4,700 వైల్స్) జిల్లాకు కేటాయించారు. జిల్లా వైద్యారోగ్య అధికారి(ఇన్‌ఛార్జి) డాక్టర్ ఎన్.ప్రసన్నకుమార్, డీఐవో అరుణ టీకాలను తీసుకుని ప్రత్యేక శీతల యంత్రాల్లో భద్రపర్చారు. జిల్లాకు వచ్చిన 47వేల డోసుల్లో అయిదువేలు యానాంకు పంపనున్నారు. గురువారం నుంచి కాకినాడలోని వ్యాక్సిన్ నిల్వ కేంద్రం నుంచి వైల్స్‌ను ఈ నెల 16న వ్యాక్సినేషన్ చేసే కేంద్రాలకు తరలించనున్నారు. దీని కోసం 15 రూట్లు ఏర్పాటు చేశారు. తొలివిడతలో టీకాలు వేసిన వారికి రెండో డోసు ఇవ్వడానికి తరువాత వైల్స్ వస్తాయని ఇన్‌ఛార్జి డీఎంహెచ్‌వో ప్రసన్నకుమార్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సినేషన్‌కు 190 కేంద్రాలు కేటాయించినప్పటికీ, తొలి విడతలో 33 కేంద్రాల్లోనే టీకాలు వేస్తారని ఆయన చెప్పారు.