ప్రమాణాలకు తిలోదకాలు.. ప్రమాదాల గుబులు!
eenadu telugu news
Published : 20/09/2021 01:00 IST

ప్రమాణాలకు తిలోదకాలు.. ప్రమాదాల గుబులు!

సామర్థ్యంలేని బస్సులను నడిపిస్తున్న ప్రైవేట్‌ పాఠశాలలు

పట్టించుకోని రవాణాశాఖ

ఈనాడు డిజిటల్‌, వికారాబాద్‌

పట్టణాల్లో ఉద్యోగం, ఉపాధి, వ్యాపార, ఇతర రోజువారీ కార్యకలాపాల్లో లేచింది మొదలుకుని నిద్రపోయేంత వరకు తల్లిదండ్రులు క్షణం తీరిక లేకుండా గడిపేస్తున్నారు. పిల్లల చదువులు, ఉన్నత భవిష్యత్తు కోసం ప్రైవేటు పాఠశాలలవైపు మొగ్గుచూపుతున్నారు. ఉదయం బస్సులో తీసుకెళ్లి, తరగతులు ముగిసిన అనంతరం ఇంటికి జాగ్రత్తగా తీసుకొస్తారమని పాఠశాలల యాజమాన్యాలు భరోసా కల్పిస్తున్నాయి. ఇందుకోసం పిల్లల సంఖ్యకు అనుగుణంగా మినీ బస్సు నుంచి పెద్ద బస్సులు సైతం కొన్ని పాఠశాలలు నడిపిస్తున్నాయి. ఇంత వరకు బాగానే ఉన్నా ఏడాదిన్నర నుంచి కరోనా ప్రభావంతో పాఠశాలలు మూతపడ్డాయి. దీంతో బస్సులు పార్కింగ్‌కే పరిమితమయ్యాయి. ఇటీవల 20 రోజుల నుంచి రోడ్లపైకి వస్తున్నాయి. అయితే అన్ని రకాలు ప్రమాణాలు కలిగి ఉన్నాయా.. ఫిట్నెస్‌ చేయించుకున్నారా అనే ఆలోచన తల్లిదండ్రులు చేయడంలేదు. నిర్వాహకులను అడుగకపోవడంతో, వారు అసలు దృష్టి సారించడం లేదు. సుమారు 260 బస్సులు అనధికారికంగానే నడిపిస్తున్నారు. దీనిపై రవాణా శాఖ దృష్టి సారించి ప్రమాదాల నివారణకు ముందస్తు చర్యలు తీసుకోవాల్సి ఉంది.

జిల్లాలో మొత్తం 185 ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. ఇందులో దాదాపు 41 వేల మంది విద్యార్థులు చదువుతున్నారని విద్యాశాఖ నివేదికలు చెబుతున్నాయి. అయితే పాఠశాలల వారి అవసరాలకు అనుగుణంగా వికారాబాద్‌, పరిగి, తాండూరు, కొడంగల్‌, ఇతర మండల కేంద్రాల్లోని పాఠశాలలకు వివిధ ప్రాంతాల నుంచి మొత్తం 260 బస్సులను నడిపిస్తున్నారు. నిబంధనల ప్రకారం ఏటా పాఠశాలల పునఃప్రారంభానికి ముందే, మే నెలలో బస్సులన్నింటిని అవసరమైన మరమ్మతు చేయించుకోవడం, రంగులు వేయించుకుని రవాణా శాఖ కార్యాలయానికి ఫిట్నెస్‌ కోసం తీసుకొస్తారు. బస్సును నడిపించే డ్రైవర్‌, బస్సు కండిషన్‌ను పరిశీలించిన మీదట రవాణా శాఖాధికారులు వాహనం సమర్థవంతంగా ఉంటే ఏడాది కాల పరిమితిలో నడిపించడానికి ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తారు. ప్రస్తుతం ఈ ప్రక్రియ జరగడంలేదు. అయినా తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకోవాల్సిన అధికారులు తమకు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఫలితంగా ఏదైనా ప్రమాదం జరిగితే అప్పుడు హడావుడి చేసినా ఉపయోగం ఉండదని, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

కొవిడ్‌ నిబంధనల అమలు

జిల్లాలో పాఠశాల బస్సును నడిపించాలంటే డ్రైవర్‌కు తప్పనిసరిగా లైసెన్స్‌తో పాటు, రెండు డోసులు కరోనా టీకా తీసుకోవాలని నిబంధన పెట్టారు. డ్రైవర్‌ గుర్తింపు కార్డు, చరవాణి సంఖ్య, ఇతర వివరాలను బస్సులో అందుబాటులో ఉంచాలి. బస్సులో కొవిడ్‌ నిబంధలను పాటిస్తూ పరిమిత సంఖ్యలోనే విద్యార్థులను తరలించాల్సి ఉంటుంది. బస్సులో శానిటైజర్‌ అందుబాటులో ఉంచడం, పిల్లలు, బస్సు సిబ్బంది తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలని చెబుతున్నారు. అయితే ఇందులో కొన్ని పాఠశాలల యాజమాన్యాలు శానిటైజర్‌, మాస్క్‌లు అందుంబాటులో ఉంచుతున్నా, బస్సులో పిల్లల సంఖ్యపై చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహిస్తాం..: భద్రునాయక్‌, జిల్లా రవాణా శాఖాధికారి

నిబంధనల ప్రకారం పాఠశాలల బస్సులు ఫిట్నెస్‌ తీసుకోవాలి. లేకుండా రోడ్లపైకి వస్తే వాహనాలను సీజ్‌ చేస్తాం. త్వరలోనే ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహిస్తాం. అదే సమయంలో డ్రైవర్లకు త్వరలోనే అవగాహన సదస్సు నిర్వహించి, కరోనా, రవాణా చట్టం ఆచరించాల్సిన నియమ, నిబంధనలను వివరిస్తాం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని