కార్య దర్శనం కట్టుదిట్టం
eenadu telugu news
Published : 20/09/2021 01:00 IST

కార్య దర్శనం కట్టుదిట్టం

ఉదయం 8గంటలకు విధులు

స్వీయ చిత్రంతో యాప్‌లో నమోదైతేనే హాజరు

జిల్లా పంచాయతీ కార్యాలయంలో వినతిపత్రం ఇస్తున్న కార్యదర్శులు

న్యూస్‌టుడే, బషీరాబాద్‌: పల్లెప్రగతిలో పంచాయతీ కార్యదర్శులే కీలకం. వీరు సక్రమంగా విధులు నిర్వహిస్తేనే పురోగతి సాధ్యం. రోజురోజుకు పని భారం పెరుగుతోందని పంచాయతీ కార్యదర్శులు వాపోతున్నారు. తాజాగా రూపొందించిన పల్లెప్రగతి యాప్‌లో ఉదయం 8గంటలకే గ్రామ పరిధిలో ఉండి కార్యాలయం బయట, లోపల ఉన్నట్లు స్వీయ చిత్రం తీసి యాప్‌లో నమోదు చేస్తేనే విధులకు హాజరయినట్లు, లేకపోతే గైర్హాజరుగా నమోదవుతుంది. ఈ కొత్త విధానంతో వారంతా దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం.. గ్రామానికి సంబంధించిన అన్ని బాధ్యతలు చూసుకోవడం, ఉన్నతాధికారులకు నివేదికలు అందించేందుకు రోజంతా తలమునకలవుతున్నాం. ఇక ఉదయాన్నే విధుల్లో ఉండాలనే నిబంధన ఏమిటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు అందరూ పాటించాలని జిల్లా పంచాయతీ అధికారులు, ఎంపీడీఓలు వారికి సూచిస్తున్నారు.

జిల్లాలోని 19 మండలాల పరిధిలో 566 గ్రామ పంచాయతీలున్నాయి. వీటిల్లో 124 మంది పంచాయతీ కార్యదర్శులు, 421 జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులు, 15 మంది ఓపీఎస్‌లు విధులు నిర్వర్తిస్తున్నారు. పల్లెలను చక్కగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ప్రభుత్వం గ్రామానికి ఒకరిని నియమించింది. రెండేళ్ల క్రితం విధులకు వచ్చిన జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులకు రూ.15వేల వేతనం ఇవ్వగా.. ఇటీవల రూ.28వేలకు పెంచారు. విధుల క్రమబద్ధీకరణ ఇంకా జరగాల్సి ఉంది. బాధ్యతలు చేపట్టాక ఎటువంటి శిక్షణ లేకున్నా అన్ని పనులు సవ్యంగా చూసుకుంటున్నామని చెబుతున్నారు. ఉపాధి పథకంలో క్షేత్రస్థాయిలో తొలగించినప్పటి నుంచి వారి బాధ్యతలు వీరే చేసుకుంటున్నారు. పల్లెప్రగతి, గ్రామ పంచాయతీకి సంబంధించిన పనులు, పారిశుద్ధ్యం.. ఇలా అన్ని పనులు తామే చేసుకోవడం తోపాటు ఎప్పటికప్పుడు పంచాయతీ లెక్కలు, వివరాలను ఆన్‌లైన్‌ నమోదు చేస్తున్నారు. రోజువారీగా పారిశుద్ధ్య పనుల నివేదిక (డిఎస్‌ఆర్‌)ను చరవాణిలో పంపించాల్సి ఉంటుంది. ఈ పనులన్నీ చేసుకోవాలంటే తీరికలేకుండా రోజు గడుస్తోంది. ఇదే తరుణంలో ఉదయం 8గంటలకే కార్యదర్శి పంచాయతీ స్థల పరిధిలో ఉండాలనడం సమంజసం కాదని సమయాన్ని 10గంటలకు మార్పు చేయాలని కోరుతున్నారు.

ఆందోళన బాట..: మా పరిధిలో ఉండే ఏ పనినైనా.. ఎంత సమయానికైనా చేస్తామని, మా విధులు మేం సక్రమంగా చేసుకుంటామని వారు చెబుతున్నారు. ఉదయం సమయాన్ని మార్పు చేయాలని కోరుతూ జిల్లా పంచాయతీ కార్యాలయం, పాలనాధికారి కార్యాలయంలో వినతిపత్రాలు సమర్పించారు. జిల్లాల వారీగా కార్యదర్శుల నుంచి ఒత్తిడి పెరగడంతో రాష్ట్ర కార్యదర్శుల సంఘం ప్రతినిధులు సంబంధిత శాఖ మంత్రిని కలిసి విన్నవించాలని నిర్ణయించుకున్నారు. పని ఒత్తిడి, సమయ భారాన్ని తగ్గించకపోతే శాంతియుత ఆందోళనకు సిద్ధమవుతామని మండల, జిల్లాల కార్యదర్శుల సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. ఇందుకు నిరసనగా రెండు రోజులుగా డీఎస్‌ఆర్‌ను నమోదు చేయడం మానేశారు.

ఉరుకులు పరుగులు..

జిల్లాలోని ఏ గ్రామ పంచాయతీ పరిధిలోనూ కార్యదర్శి స్థానికంగా ఉండడం లేదు. వారున్న పట్టణ ప్రాంతం నుంచి విధులు నిర్వర్తించే పంచాయతీకి సొంత వాహనంపై వెళ్లాలంటే కనీసం అరగంట నుంచి గంట సమయం పడుతుంది. ఇతర ప్రైవేటు వాహనం సహాయమైతే మరో ఆరగంట సమయం అదనంగా అవుతుంది. ఉదయం 6గంటలకు ఇంటి నుంచి బయలుదేరితేనే గమ్యానికి సకాలంలో చేరే అవకాశం ఉంటుంది. రోజంతా పని చేశాక, సమావేశాలని, రిపోర్టులని, ఇతరత్ర పనుల కోసం మండల కార్యాలయానికి ఉరుకులు, పరుగులతో చేరుకుంటున్నామని, అక్కడ విధులు ముగించుకుని ఇంటికి వచ్చే సరికి రాత్రి 10గంటలవుతోందని, ఉదయాన్నే మళ్లీ వెళ్లాలంటే మానసిక ఒత్తిడికి లోనవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఒత్తిడికి గురి చేయొద్దు

నర్సింహులు, జిల్లా అధ్యక్షులు, పంచాయతీ కార్యదర్శుల సంఘం.

గ్రామ పంచాయతీల పరిధిలో ఎంత పని చేయడానికైనా మేమంతా సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వ పథకాలు ప్రజలకు సవ్యంగా అందాలంటే అన్నిశాఖల అధికారులకు మేం గ్రామాల్లో జవాబుదారీతనంగా ఉండాలి. అలాంటప్పుడు చక్కగా విధులు నిర్వరిస్తేనే మాకు సాధ్యమవుతుంది. అన్ని పనులపై పర్యవేక్షణ తోపాటు ఉన్న నివేదికలను సమర్పించాల్సి ఉంటుంది. ఇప్పటికే విధుల్లో పనిభారం తీవ్రంగా ఉంది. ఉదయం 8గంటలకే విధుల్లో ఉన్నట్లు యాప్‌లో నమోదు చేసుకోవాలనడం సమంజసం కాదు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి, పది గంటలకు హాజరయ్యే సమయాన్ని ఇవ్వాలని కోరుతాం.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని