దాయాదుల మధ్య ఘర్షణ
eenadu telugu news
Published : 20/09/2021 01:00 IST

దాయాదుల మధ్య ఘర్షణ

ఎంపీటీసీకి తీవ్ర గాయాలు

తీవ్రంగా గాయపడ్డ ఎంపీటీసీ అంబరయ్య

పెద్దేముల్‌, న్యూస్‌టుడే: దాయాదుల మధ్య జరిగిన ఘర్షణలో ఎంపీటీసీ సభ్యుడు తీవ్రంగా గాయపడిన సంఘటన పెద్దేముల్‌లో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎంపీటీసీ సభ్యుడు అంబరయ్య, పంచాయతీ కార్మికుడు అంబరయ్య కుటుంబాల మధ్య కొంత కాలంగా పాతకక్షలు ఉన్నాయి. శనివారం రాత్రి వినాయక నిమజ్జనం సందర్భంగా ఉద్దేశ పూర్వకంగా తమ ఇంటి వద్ద నృత్యాలు చేశారని ఎంపీటీసీ అంబరయ్య రవి అనే యువకుడిని మందలించి, ఇంట్లోకి పిలిచి చేయి చేసుకున్నాడు. తన తమ్ముడు రవిపై ఎందుకు చేయి చేసుకున్నారని పంచాయితీ పెట్టేందుకు పంచాయతీ కార్మికుడు అంబరయ్య వైరి వర్గం వారికి కబురు పంపించాడు. విషయం తెలుసుకున్న ఎంపీటీసీ అంబరయ్య, తముళ్లు పాండు, వెంకటయ్య కలిసి పంచాయతీ కార్మికుడు అంబరయ్య ఇంటి వద్దకు వెళ్లారు. ఇరు వర్గాలు రోడ్డుపైనే ఘర్షణకు దిగి రాళ్లు, కర్రలతో దాడి చేసుకున్నారు. తొపులాటలో ఎంపీటీసీ సభ్యుడు అంబరయ్య తీవ్రంగా గాయపడ్డాడు. పరిస్థితిని గమనించి అప్పటికే సోదరుడు రవితో కలిసి అంబరయ్య తమ ఇంట్లోకి వెళ్లారు. రక్తపు గాయాలతోనే ఎంపీటీసీ సభ్యుడు పోలీస్ స్టేషన్‌ వెళ్లి ఫిర్యాదు చేశారు. తనపై దాడికి పాల్పడ్డ వ్యక్తులపై కఠినంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఎవరిపై తాము దాడి చేయలేదని ఎంపీటీసీ సభ్యుడు కిందపడి గాయపడ్డాడని రవి, అంబరయ్య తెలిపారు. తమ ఇంటి పైకి వచ్చి దాడికి పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. గ్రామీణ సీఐ జలందర్‌రెడ్డి, తాండూరు ఎస్ఐ ఏడుకొండలుతో కలిసి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. జరిగిన సంఘటనపై కాలనీ వాసులతో మాట్లాడారు. ఇరు వర్గాలు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని పెద్దేముల్‌ ఎస్‌ఐ విశ్వజన్‌ తెలిపారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని