ఉట్టిపడిన భక్తిభావం.. నిమజ్జనం శోభాయమానం
eenadu telugu news
Published : 20/09/2021 01:00 IST

ఉట్టిపడిన భక్తిభావం.. నిమజ్జనం శోభాయమానం

ఊరేగింపులో యువత కేరింత

ఊరేగింపులో యువతుల నృత్యం

వికారాబాద్‌, న్యూస్‌టుడే: భాజా భజంత్రీలు.. డప్పుల దరువులకు అనుగుణంగా.. యువకుల ఉత్సాహం మధ్య గణనాథుల నిమజ్జన యాత్ర ఆదావారం శోభాయమానంగా జరిగింది. ఊరేగింపుతో పట్టణంలోని రహదారులు కిటకిటలాడాయి. మహిళల కోలాటం, యువకుల విచిత్ర వేషధారణలు అలరించాయి. పురపాలకసంఘం పరిధిలోని అన్ని వార్డుల్లో ప్రతిష్ఠించిన వినాయక విగ్రహాలను సాయంత్రం 6 గంటల నుంచి ఒక్కొక్కటిగా ఊరేగింపుగా తీసుకొచ్చారు. శివరామ్‌నగర్‌ కాలనీ వినాయకున్ని గుర్రపు బగ్గీలో తరలించగా, పండ్ల వ్యాపారం నిర్వహించే పిట్టల వారి కుటుంబం వినాయకుని ఊరేగింపు వాహనాన్ని రకరకాల పండ్లతో అలంకరించారు. మహాశక్తి చౌరస్తా కూడలి మీదుగా శోభాయాత్ర కొనసాగింది. హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో వికారాబాద్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ మెతుకు ఆనంద్‌, రాష్ట్ర బీసీ కమిషన్‌ సభ్యుడు శుభప్రద్‌ పటేల్‌, పురపాలక అధ్యక్షురాలు మంజుల, హిందు ఉత్సవ సమితి ప్రతినిధులు మాధవరెడ్డి, కృష్ణ పంతులు పాల్గొన్నారు. వినాయక భక్త మండలి, వీరశైవ సమాజం, హిందూ ఉత్సవ సమితి, న్యాయవాదుల సంఘం వారు మండపాలను ఏర్పాటు చేసి స్వాగతం పలికారు.పట్టణంలోని ఇందిరానగర్‌లో శ్రీవెంకటేశ్వర భజన మండలి ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన వినాయకుని లడ్డూను వేలం నిర్వహించగా, పట్టణంలోనే అత్యధికంగా రూ.1.75 లక్షలకు చాకలి బుచ్చయ్య బృందం దక్కించుకోగా, శివారెడ్డిపేటలో రూ.1,01,116లకు చంద్రమౌళి, సింగారపు రాచయ్య కాలనీలో రూ.85 వేలకు న్యాయవాది రమేష్‌కుమార్‌ దక్కించుకున్నారు. వికారాబాద్‌ మున్సిపల్‌ పరిధిలోని ఆలంపల్లిలో నిర్వహించిన లడ్డూ వేలంలో పాటలో పాల్గొన్న మైనార్టీ యువకుడు మహ్మద్‌జాఫర్‌ రూ.13 వేలకు దక్కించుకున్నారు. మహిళల కోలాటం, విద్యార్థులభజన, సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఎస్పీ ఎం.నారాయణ, డీఎస్పీ సంజీవరావు ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు.

పరిగి,న్యూస్‌టుడే: పట్టణంలోని అయ్యప్ప కాలనీలో రూ.1.12 లక్షలకు శ్రీనివాస్‌ సొంతం చేసుకున్నారు. పూడూరు మండలం మేడిపల్లి కలాన్‌లో మాజీ సర్పంచి కృష్ణ లడ్డూను రూ.1.11 లక్షలకు దక్కించుకున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని