సంఘటితంతోనే సంస్కృతి పరిరక్షణ
eenadu telugu news
Published : 20/09/2021 02:15 IST

సంఘటితంతోనే సంస్కృతి పరిరక్షణ

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌, న్యూస్‌టుడే, అబిడ్స్‌: సనాతన హిందూ ధర్మాన్ని, సంస్కృతిని పరిరక్షించేందుకు హిందువులందరూ జాగృతమై సంఘటితం కావాలని ఝార్ఖండ్‌కు చెందిన హనుమంత్‌ కథా వచక్‌ వ్యవస్థాపకులు ప్రదీప్‌ భయ్యాజి మహరాజ్‌ పిలుపునిచ్చారు. ఆదివారం భాగ్యనగర ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఎంజే మార్కెట్‌ వద్ద ఏర్పాటు చేసిన ప్రధాన స్వాగత వేదికపై ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రపంచం మొత్తం భారత దేశంవైపు చూస్తున్న ప్రస్తుత తరుణంలో మన ఐక్యతను చాటి చెప్పేందుకు ఇలాంటి ఉత్సవాలు ఉపయోగపడుతున్నాయన్నారు. ఉత్సవ సమితి అధ్యక్షులు, వీహెచ్‌పీ అంతర్జాతీయ అధ్యక్షుడైన రాఘవరెడ్డి, ప్రధాన కార్యదర్శి డా.భగవంతరావు మాట్లాడుతూ.. ఈ ఏడు సామూహిక శోభాయాత్రపై తొలి నుంచి ఆటంకాలు కల్పిస్తూ వచ్చినప్పటికీ ఆ విఘ్నేశ్వరుడు మహాప్రభంజనంలా వేడుకలు జరిగేందుకు ఆశీర్వదించారని అన్నారు. కార్యక్రమంలో వీహెచ్‌పీ రాష్ట్ర అధ్యక్షుడు రామరాజు, భాగ్యనగర ఉత్సవ సమితి ప్రతినిధులు, భాజపా నాయకులు పాల్గొని వేదిక మీదుగా వినాయకసాగర్‌కు వెళ్తున్న ప్రతిమలకు పూలతో స్వాగతం పలికారు.

యువశక్తి.. సేవా స్ఫూర్తి!

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: గణేషుని నిమజ్జనోత్సవాల్లో నగరంలోని అన్ని చెరువుల వద్ద యువతీ యువకులు సేవా స్ఫూర్తి చాటారు. నగరంతో పాటు తెలంగాణ జిల్లాల్లోని ప్రభుత్వ కళాశాలలకు చెందిన ఎన్‌సీసీ కేడెట్లు, స్క్వాట్లు, ఎన్‌ఎస్‌ఎస్‌ వలంటీర్లు సేవలందించారు. ట్యాంక్‌బండ్‌పై జీహెచ్‌ఎంసీ విపత్తు నిర్వహణ దళం ఆధ్వర్యంలో ఈత వచ్చిన ఎన్‌సీసీ కేడెట్లు రక్షకులుగా సేవలందించారు. పలువురు విద్యార్థులు శ్రమదానం చేశారు. ఆహార పొట్లాలు, మాస్కులు పంపిణీ చేశారు.

గంగ ఒడికి చేర్చే వారధులు

ఈనాడు, హైదరాబాద్‌: గణనాథులను గంగ ఒడికి చేర్చడంలో వారిదే కీలకపాత్ర.. విధుల నిర్వహణలో నిరంతరం అప్రమత్తంగా వ్యవహరిస్తారు. భారీ విగ్రహాలు వచ్చినా.. ఎంతో జాగ్రత్తగా సాగరంలో నిమజ్జనం చేస్తుంటారు. వారే ట్యాంక్‌బండ్‌ వద్ద క్రేన్లు నిర్వహించే ఆపరేటర్లు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చి 4రోజులపాటు క్రేన్లను నిర్వహించి మళ్లీ సొంతూళ్లకు వెళ్లి పనుల్లో నిమగ్నమవుతుంటామని చెబుతున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని