దారంతా జనమాయె.. ఊరంతా సందడాయె
eenadu telugu news
Updated : 20/09/2021 12:39 IST

దారంతా జనమాయె.. ఊరంతా సందడాయె

ఫలించిన 40 వేలమంది సిబ్బంది కష్టం

ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి

వారం రోజులుగా ఉత్కంఠ..అసలు హుస్సేన్‌సాగర్‌తోపాటు సమీపంలో ఉన్న పెద్ద చెరువుల్లో నిమజ్జనం ఉంటుందా లేదా? లేనిపక్షంలో వేలాది విగ్రహాలను ఎక్కడ నిమజ్జనం చేయాలి...ఈ ప్రశ్నలు అధికారులను ఉక్కిరిబిక్కిరి చేశాయి. సుప్రీంకోర్టు ఆదేశాలతో సాగర్‌, చెరువుల్లో నిమజ్జనం చేయడానికి అంగీకరించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఉత్కంఠ మధ్య కొన్ని గంటల వ్యవధిలోనే అధికారులు రాత్రిపగలూ కష్టపడి నిమజ్జనం కోసం క్రేన్లు ఇతరత్రా ఏర్పాట్లు చేశారు. గణేష్‌ ఉత్సవ కమిటీలు, భక్తులూ తోడ్పాటు అందించారు. ఇంకేం...ఆదివారం జరిగిన నిమజ్జనం క్రతువు ఎటువంటి ఇబ్బంది లేకుండా సజావుగా ముగిసింది. దాదాపు 12 లక్షలమంది వేడుకలో పాల్గొన్నారని అంచనా. మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, మహమూద్‌ అలీ, మేయర్‌ విజయలక్ష్మి, కమిషనర్‌ లోకేష్‌కుమార్‌, జలమండలి ఎండీ దానకిషోర్‌, డీజీపీ మహేందర్‌ రెడ్డి, మూడు పోలీసు కమిషనరేట్ల సీపీలు అంజనీ కుమార్‌, స్టీఫెన్‌ రవీంద్ర, మహేష్‌ భగవత్‌ కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. దాదాపు 48 గంటలపాటు 40 వేలమంది అధికారులు, ఇతరత్రా సిబ్బంది ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.

ఖైరతాబాద్‌, బాలాపూర్‌పై దృష్టి!

మహానగరంలో ఖైరతాబాద్‌, బాలాపూర్‌ విగ్రహాల నిమజ్జనం ముగిస్తే దాదాపుగా వేడుక పూర్తయినట్లే. ఆ రెండు చోట్ల గణనాథుల ఊరేగింపు ఉదయం మొదలయ్యేలా ఏర్పాట్లు చేశారు. దీంతో సాయంత్రానికే ఆయా గణనాథుల నిమజ్జనం పూర్తయ్యింది. దీంతో మిగతా విగ్రహాలు చకచకా ముందుకు సాగాయి. మరోవైపు ముందురోజే చాలా విగ్రహాలు నిమజ్జనానికి తరలాయి. శనివారం రాత్రి పదిగంటల నుంచి ఆదివారం ఉదయానికే వేలాది విగ్రహాలు నిమజ్జనం చేశారు. ఆదివారం రాత్రి 11 గంటల వరకు ఐదు అడుగులపైనున్న 1800 విగ్రహాలు సాగర్‌లో నిమజ్జనమయ్యాయి.

ఆదుకున్న కొలనులు

బల్దియా రెండేళ్ల కిందట నిమజ్జనం కోసం ఆయా ప్రాంతాల్లో ప్రత్యేకంగా కొలనులను నిర్మించింది. ఈ ఏడాది అవి కూడా కీలకపాత్ర పోషించాయి. రాజేంద్రనగర్‌లో నిర్మించిన కోనేరులో సమీప కాలనీల గణనాథులను నిమజ్జనం చేశారు. వెనువెంటనే నిమజ్జన వ్యర్థాలను తొలగించే పనులు చేపట్టారు.మెట్రో ఆదుకుంది

ఈనాడు, హైదరాబాద్‌: శోభాయాత్ర కొనసాగిన మార్గంలో ట్రాఫిక్‌ ఆంక్షల కారణంగా ఆదివారం ఎక్కువ మంది మెట్రోని ఆశ్రయించారు. నిమజ్జనం తిలకించేందుకు హుస్సేన్‌సాగర్‌కు వచ్చే భక్తులు, సందర్శకులతో మియాపూర్‌-ఎల్‌బీనగర్‌ మార్గంలోని ఖైరతాబాద్‌, లక్డీకాపూల్‌ స్టేషన్లు కిటకిటలాడాయి. ప్రయాణికుల సౌలభ్యం కోసం రైళ్ల రాకపోకల సమయాన్ని అర్ధరాత్రి ఒంటిగంట వరకు పొడిగించారు. ఎంఎంటీఎస్‌ సైతం ఖైరతాబాద్‌ మార్గంలో 8 అదనపు సర్వీసులను నడిపింది. ఆర్టీసీ ప్రధాన కూడళ్ల నుంచి సాగర తీరానికి వేర్వేరు మార్గాల్లో 560 అదనపు సర్వీసులను అర్ధరాత్రి వరకు నడిపింది.


మురిసిన నగరం!

ఈనాడు, హైదరాబాద్‌: నగరం నలుదిక్కులూ ఒక్కటయ్యాయి. మహాసంబరాన్ని కళ్లారా వీక్షించేందుకు.. మనసారా ఆనందాన్ని ఆస్వాదించేందుకు భక్తజనం తరలివచ్చారు. కరోనా మొదటి, రెండో దశల్లో వేలాదిమందిని బలితీసుకుంది. ప్రస్తుతం సాధారణ పరిస్థితులు నెలకొనడంతో గణేష్‌ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. సెలవురోజు కావటంతో ముగింపు సంబరాన్ని దగ్గరగా చూసేందుకు పొరుగు జిల్లాల నుంచి కూడా భారీగా తరలి వచ్చారు. దాదాపు 18 నెలల విరామం తర్వాత.. సరదాగా గడిపేందుకు ట్యాంక్‌బండ్‌ పరిసరాలు వేదికగా మారాయి.


ఏకరూపం.. అలంకారం

ఈనాడు, హైదరాబాద్‌ : నిమజ్జనానికి తరలివచ్చే గణనాథుల వాహనాలను అలంకరించే మండప నిర్వాహకులు.. తమ ఆహార్యంలోనూ ప్రత్యేకత ఉండేలా చూస్తున్నారు. ఏకరూప దుస్తులు ధరించి నిమజ్జనంలో ఆకట్టుకున్నారు. చిన్నపిల్లల నుంచి యువత, పెద్దల వరకు అందరూ ఒకే రకమైన దుస్తుల్లో సందడి చేశారు. కాలనీలు, గల్లీలు, అపార్ట్‌మెంట్లలో మండపాలను ఏర్పాటు చేసే నిర్వాహకులు నిమజ్జనం వేళ ఏకరూప దుస్తులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. నచ్చిన రంగుల్లో కుర్తా పైజామాలను ప్రత్యేకంగా ఆర్డరిచ్చి తెచ్చుకుంటున్నారు. కాగా ఈసారి నిమజ్జన వేడుకలను తిలకించేందుకు వచ్చిన సందర్శకుల కుటుంబాలు సైతం ఏకరూప దుస్తుల్లో కన్పించడం విశేషం.


క్షణక్షణం అప్రమత్తం

ఈనాడు, హైదరాబాద్‌: నిమజ్జన వేడుకల్లో భాగంగా ట్యాంక్‌బండ్‌ వైపు పోలీసులు, ఎన్టీఆర్‌ మార్గ్‌లో బల్దియా, హెచ్‌ఎండీఏ సహకారంతో కంట్రోల్‌రూమ్‌లను ఏర్పాటు చేసి ప్రజల్ని అప్రమత్తం చేశారు.నిఘా నేత్రాలతో పర్యవేక్షించారు. తప్పిపోయిన వారి కోసం ఏర్పాటు చేసిన శిబిరం నిండిపోయింది. రద్దీలో బంధువులు గుంపులో నుంచి విడిపోయారు. ఒంటరిగా ఉన్న వృద్ధులు, ఏడుస్తూ కన్పించిన చిన్నారుల్ని పోలీసులు, సిబ్బంది శిబిరం వద్దకు చేర్చారు. మైక్‌ల ద్వారా బంధువుల వివరాలు చెప్పడంతో శిబిరం వద్దకు వచ్చి తీసుకెళ్లారు. మంత్రులు, ఉన్నతాధికారులు ఏరియల్‌ సర్వే చేశారు.


మహా గణపతి.. ఇలా తరలి..

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌, నారాయణగూడ, న్యూస్‌టుడే: ఏ గల్లీ చూసినా కిక్కిరిసిన భక్తజనం.. 12 లక్షలపైగా జనానికి దర్శనం.. అదే మహాగణపతి వైభవానికి నిదర్శనం. ఖైరతాబాద్‌ శ్రీ పంచముఖ రుద్ర మహాగణపతి నిమజ్జనం ప్రశాంతంగా పూర్తయింది. ఆదివారం తెల్లవారుజామునుంచే ఏర్పాట్లు మొదలై అడుగులో అడుగై కదిలి ఏకంగా 7 గంటలపాటు శోభాయాత్ర సాగింది. మధ్యలో వర్షం, చెట్లు కొంత అంతరాయం కలిగించినా.. మధ్యాహ్నం 3.23గంటలకు సంపూర్ణ నిమజ్జనం పూర్తయింది. ఎన్‌టీఆర్‌ మార్గ్‌ మొత్తం కిక్కిరిసి తోపులాటలూ జరిగాయి. శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం మధ్యాహ్నం వరకు ఖైరతాబాద్‌కు ఏకంగా 12లక్షలకుపైగా భక్తులు వచ్చినట్లు ఉత్సవకమిటీ తెలిపింది.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని