లాభాల పేరుతో నమ్మించి.. నట్టేట ముంచి
eenadu telugu news
Published : 28/09/2021 04:03 IST

లాభాల పేరుతో నమ్మించి.. నట్టేట ముంచి

రూ.17 కోట్లు కొల్లగొట్టిన కార్పొరేట్‌ బ్యాంక్‌ మాజీ ఉద్యోగి అరెస్ట్‌

రెండు నెలలు శ్రమించి పట్టుకున్న సీసీఎస్‌ పోలీసులు

ఈనాడు, హైదరాబాద్‌: బ్యాంకులో కాకుండా తన వద్ద పెట్టుబడులు పెడితే, షేర్లు, మ్యూచ్‌వల్‌ ఫండ్స్‌లో మదుపు చేసి రూ.లక్షల్లో లాభాలిస్తానంటూ వినియోగదారులను నమ్మించాడు. వారందరినీ మోసం చేసి రూ.17 కోట్లు కొల్లగొట్టిన యాక్సిస్‌ బ్యాంక్‌ మాజీ ఉద్యోగి రావిప్రోలు శ్రీహర్షను సీసీఎస్‌ పోలీసులు సోమవారం అరెస్ట్‌ చేశారు. పంజాబ్‌లోని ఖరార్‌లో తలదాచుకున్నాడన్న సమాచారంతో ఏసీపీ మనోజ్‌ కుమార్‌ బృందం వెళ్లి ఆదివారం అతడిని అదుపులోకి తీసుకుంది. నెల్లూరు జిల్లాకు చెందిన శ్రీహర్ష (36) తల్లిదండ్రులతోపాటు హైదరాబాద్‌లో స్థిరపడ్డాడని, ఇంజినీరింగ్‌ పూర్తిచేశాక యాక్సిస్‌ బ్యాంక్‌లో అసిస్టెంట్‌ మేనేజర్‌గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించాడని ఏసీపీ మనోజ్‌ కుమార్‌ తెలిపారు.

తార్నాక నుంచి అబుదాబికి.. తార్నాక యాక్సిస్‌ బ్యాంక్‌లో 2014 నుంచి 2017వ వరకూ పనిచేసిన శ్రీహర్ష బ్యాంక్‌ ఖాతాదారులతో మాట్లాడుతూ.. తనకు డబ్బులిస్తే ఎక్కువ వడ్డీకి ఇస్తానని చెప్పి వారితో రూ.లక్షలు, రూ.కోట్లలో అప్పు ఇప్పించుకున్నాడు. వడ్డీ డబ్బులంటూ నెలనెలా వారికి నగదు ఇచ్చాడు. అనంతరం అబుదాబిలోని యాక్సిస్‌ బ్యాంక్‌కు బదిలీ అయ్యాడు. తర్వాత అసలు, వడ్డీ ఇవ్వలేదు. బాధితులు ఆ బ్యాంక్‌ అధికారులకు ఫిర్యాదు చేయగా.. రెండేళ్ల క్రితం ఉద్యోగం నుంచి తొలగించారు. అప్పటి నుంచి శ్రీహర్ష అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. బాధితులు రెండు నెలల క్రితం సీసీఎస్‌ పోలీసులను ఆశ్రయించారు. ఆచూకీ కోసం పోలీసులు రెండు నెలలు శ్రమించారు. ఏసీపీ మనోజ్‌కుమార్‌ అబుదాబిలో బ్యాంక్‌ అధికారులను సంప్రదించారు. బ్యాంక్‌కు తరచూ వస్తున్న పంజాబీ యువతిని పెళ్లి చేసుకున్నాడని, ఉద్యోగం నుంచి తొలగించాక ఎక్కడికి వెళ్లాడో తెలీదని వారు వివరించారు. శ్రీహర్ష గతంలో వాడిన ఫోన్‌నంబర్లతో వివరాలను తెలుసుకున్నారు. ఖరార్‌ పట్టణంలో ఉన్నాడని గుర్తించి అక్కడికి వెళ్లి పట్టుకున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని