క్రైం వార్తలు
eenadu telugu news
Published : 28/09/2021 04:03 IST

క్రైం వార్తలు

బాగా నచ్చావు.. పెళ్లి చేసుకుందాం

ఏకాంతంగా గడిపిన వీడియోలు అంతర్జాలంలో

డబ్బు ఇచ్చినా ‘డిలీట్‌’ చేయని కేటుగాడు

ఈనాడు, హైదరాబాద్‌: మ్యాట్రిమోనీ వెబ్‌సైట్‌లో చూశాను.. బాగా నచ్చావు.. పెళ్లి చేసుకుందామంటే నమ్మింది. ఏకాంతంగా గడిపిన క్షణాలు అంతర్జాలంలో ప్రత్యక్షం కావడంతో కంగుతింది. సరూర్‌నగర్‌ చెందిన బాధితురాలు(30) మాట్రిమోనీ వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేసుకుంది. ఓ రోజు 95732 05940 నంబర్‌ నుంచి కాల్‌ వచ్చింది. అటువైపు నుంచి సుభాష్‌ అనే వ్యక్తి పరిచయం చేసుకున్నాడు. మీ ప్రొఫైల్‌ బాగా నచ్చిందని చెప్పాడు. తర్వాత తరచూ ఫోన్లో మాట్లాడుకునేవారు. కలుద్దామని మాదాపూర్‌కు రమ్మన్నాడు. ఇద్దరు ఏప్రిల్‌ 27న ఓ రెస్టారెంట్‌లో కలిశారు. భోజనం తర్వాత తన గదికి తీసుకెళ్లాడు. ఏకాంతంగా కలిసిన సమయంలో నిందితుడు వీడియోలు, ఫొటోలు తీశాడు. కొన్ని రోజుల తర్వాత అవి అంతర్జాలంలో ప్రత్యక్షమయ్యాయి. కంగుతిన్న బాధితురాలు సుభాష్‌కు కాల్‌ చేసింది. డబ్బు ఇవ్వాలని.. లేదంటే సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేస్తానని బెదిరించాడు. డబ్బులిచ్చినా డిలీట్‌ చేయకపోవడంతో పోలీసులను ఆశ్రయించింది.


ఇద్దరు బంగ్లాదేశీయుల అరెస్టు

శంషాబాద్‌, న్యూస్‌టుడే: వారిద్దరూ బంగ్లాదేశీయులు. అడ్డదారిలో సరిహద్దు దాటి భారత్‌కు వచ్చారు. భారతీయులం అంటూ ఇక్కడి దళారుల సహకారంతో నకిలీ ఆధార్‌, పాన్‌, కార్డులను సృష్టించి భారత్‌ పాస్‌పోర్ట్‌ను సంపాదించుకున్నారు. అవే పత్రాలతో విదేశాలకు వెళ్లడానికి యత్నించి విమానాశ్రయంలో భద్రతాధికారులకు చిక్కి జైలుపాలయ్యారు. ఈ ఘటన సోమవారం శంషాబాద్‌ విమానాశ్రయంలో చోటు చేసుకుంది. విమానాశ్రయ అధికారులు తెలిపిన కథనం ప్రకారం.. బంగ్లాదేశ్‌కు చెందిన పీల్‌ బరువా, ప్రొసెన్‌జీత గతంలో భారత్‌కు వచ్చారు. పేర్లను మార్చుకొని నకిలీ పాస్‌పోర్ట్‌, ధ్రువీకరణ పత్రాలను తీసుకున్నారు. ఉపాధి కోసం దొహా వెళ్లడానికి శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్నారు. వారి ప్రవర్తనపై అనుమానం వచ్చిన భద్రతాధికారులు పాస్‌పోర్ట్‌, ధ్రువీకరణ పత్రాలను పరిశీలించారు. గట్టిగా నిలదీయగా అసలు విషయం బయట పడింది. ఇద్దరినీ అరెస్ట్‌ చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.


అటు తెరిపిలేని వాన.. ఇటు పురిటి నొప్పులు

పోలీసులను ఆశ్రయించిన గర్భిణి కుటుంబీకులు

ఆసుపత్రికి తరలించిన రక్షకభటులు

సికింద్రాబాద్‌, న్యూస్‌టుడే: నగరంలో సోమవారం ఉదయం నుంచి ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షంతో ఆటోలు, టాక్సీలు అందుబాటులో లేకుండా పోయాయి. దీంతో పోలీసులే స్పందించి ఓ గర్భిణిని ఆసుపత్రికి తరలించిన సంఘటన చిలకలగూడ ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. సోమవారం ఉదయం ఠాణా పరిధికి చెందిన ఓ గర్భిణికి పురుటినొప్పులు మొదలయ్యాయి. మరోవైపు, జోరు వాన కారణంగా స్థానికంగా రవాణా సదుపాయాలన్నీ సన్నగిల్లాయి. ఈ క్రమంలో ఆమె కుటుంబీకులు నేరుగా పోలీసులకు సమాచారం అందించారు. దీంతో కానిస్టేబుల్‌ కిరణ్‌కుమార్‌, హోంగార్డు ఇమ్రాన్‌ గర్భిణి నివాసానికి చేరుకున్నారు. అనంతరం ఆమెను తమ పెట్రోలింగ్‌ వాహనంలో గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు పోలీసులు తెలిపారు.


మూసీలో గుర్తు తెలియని యువకుడి మృతదేహం

చైతన్యపురి, న్యూస్‌టుడే: గుర్తు తెలియని యువకుడి మృతదేహం మూసీ ప్రవాహంలో కొట్టుకువచ్చి చైతన్యపురి ఫణిగిరికాలనీ సమీపంలోని మూసీ ఒడ్డున లభించిన సంఘటన సోమవారం చోటు చేసుకుంది. చైతన్యపురి ఇన్‌స్పెక్టరు రవికుమార్‌ వివరాల ప్రకారం..సుమారు 25- 30 సంవత్సరాల వయసు గల యువకుడి మృతదేహం ఫణిగిరికాలనీ సమీపంలోని మూసీ ఒడ్డున ఉన్నట్లు స్థానికులు సమాచారం అందించారు.దాంతో సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా ప్రవాహంలో మృతదేహం కొట్టుకువచ్చినట్లు గుర్తించారు. మృతదేహం గుర్తు పట్టరాకుండా ఉందని, మృతుడి చేతి మణికట్టుపై హిందీలో దర్శన్‌ అంటూ పచ్చబొట్టు ఉందని తెలిపారు. పంచనామా అనంతరం అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించినట్లు తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని