మున్సిపల్‌కు ఆదాయం.. ప్రజలకు భారం
eenadu telugu news
Published : 18/10/2021 02:27 IST

మున్సిపల్‌కు ఆదాయం.. ప్రజలకు భారం

న్యూస్‌టుడే, కొడంగల్‌


చెత్త సేకరణకు వినియోగించే వాహనాలు

మున్సిపాల్టీలను స్వచ్ఛ పట్టణాలుగా తీర్చిదిద్దేందుకు పురపాలికలకు కొత్త చట్టాన్ని రూపొందించారు. దీన్ని అనుసరించి ఇళ్లు, దుకాణాలు వద్ద చెత్త తీయడానికి కొంత పన్ను వసూలు చేయాలి. పాత మున్సిపాలిటీల్లో నిధుల సేకరణకు పెద్దగా అవాంతరాలు ఉండటంలేదు. కొత్త వాటిలో మాత్రం ఎక్కువగా ఉన్నవి విలీన గ్రామాలే కాబట్టి పన్నుల వసూలు తమకు ఆర్థిక భారమేనని ప్రజలు వాపోతున్నారు. ఈ విషయంలో మార్పులు చేయాల్సి ఉందని కోరుతున్నారు.

నాలుగులో రెండు కొత్తవి..: వికారాబాద్‌ జిల్లాలో తాండూరు, వికారాబాద్‌ పాత మున్సిపాలిటీలు కాగా 2018లో కొడంగల్‌, పరిగి మున్సిపల్‌ హోదా పొందాయి. ఆయా పురపాలికల్లో సభ్యుల తీర్మానం మేరకు పన్నులు ఎంత వసూలు చేయాలో నిర్ణయించుకోవాల్సి ఉంది. ఇప్పటికే జిల్లాలోని తాండూర్‌ మున్సిపాల్టీలో దుకాణాల సముదాయాలను అనుసరించి ఇళ్లకు రూ.50 దుకాణాలకు రూ.100 చొప్పున వసూలు చేస్తున్నారు. వికారాబాద్‌ జిల్లా కేంద్రంలో మాత్రం కేవలం దుకాణాలకు మాత్రమే యూజర్‌ ఛార్జీలను తీసుకుంటున్నారు. ఇక పరిగి, కొడంగల్‌ మున్సిపాల్టీలో మాత్రం యూజర్‌ ఛార్జీల కింద ఇంకా పన్నులు వసూలు ప్రారంభించలేదు.

విలీన తండాలకు అదనపు కష్టం

కొడంగల్‌ పట్టణంలో పాటు కొడంగల్‌ మున్సిపాల్టీలో విలీనమైన పల్లెలు గుండ్లకుంట, పాత కొడంగల్‌, పాత కొడంగల్‌ తండా, బుల్కాపూర్‌, ఐనోన్‌పల్లి తండాల్లో కూలీ చేసుకొని బతికే కుటుంబాలు 90శాతంకు పైగా ఉన్నాయి. ఈ ఐదు పల్లెలకు మున్సిపల్‌ చట్టం పూర్తిస్థాయిలో అమలైతే మోయలేని భారంగా మారే అవకాశం ఉంది. పరిగి, వికారాబాద్‌, తాండూరు మున్సిపాల్టీల్లోనూ ఇలాంటి సమస్య తలెత్తుతోంది.


చట్టాన్ని అనుసరించే వసూలు : నాగరాజు, మున్సిపల్‌ కమిషనర్‌, కొడంగల్‌

నూతన మున్సిపల్‌ చట్టం ఆధారంగానే పన్ను వసూలు చేయాలని నిబంధనలు ఉన్నాయి. కొత్త మున్సిపాలిటీల్లో అక్కడి పరిస్థితులను గమనిస్తున్నాం. పన్నుల వసూలు చేస్తే ప్రజలపై భారం పడుతుందని అమలు చేయడంలేదు. ప్రజలు యూజర్‌ ఛార్జీలకు సహకరిస్తే పట్టణం మరింత అభివృద్ధి చేసుకోవచ్చని భావిస్తున్నాం.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని