ధాన్యం కొనుగోలుకు కసరత్తు
eenadu telugu news
Published : 18/10/2021 03:58 IST

ధాన్యం కొనుగోలుకు కసరత్తు

ఏర్పాటు కానున్న కేంద్రాలు

న్యూస్‌టుడే, తాండూరు: వానాకాలంలో సాగు చేసిన వడ్లను కొనుగోలు చేసేందుకు పౌరసరఫరాల శాఖ కసరత్తు ప్రారంభించింది. విక్రయానికి వచ్చే ధాన్యాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. వీటి ద్వారా మద్దతు ధర అందించనున్నారు. వర్షాకాలంలో రైతులు 80 వేల ఎకరాల్లో వరి చేశారు. కొన్ని గ్రామాల్లో కంకులు గట్టి పడే దశలో ఉన్నాయి. నవంబరు ద్వితీయార్థం నుంచి సాగులో ఉన్న పైర్ల నుంచి దిగుబడులు చేతికి అందనున్నాయి. ఈ నేపథ్యంలోనే పౌరసరఫరాల శాఖ కార్యాచరణ ప్రారంభించింది. ప్రాథమిక సహకార సంఘాలు, మార్కెట్‌ కమిటీలు, ఐకేపీ, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ కలిపి మొత్తం 191 కేంద్రాలను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. వాటిల్లో అవసరమైన మేరకు తూకం, తేమను కొలిచే యంత్రాలను అందుబాటులో ఉంచనున్నామని అధికారులు తెలిపారు. ధాన్యం ఏ-గ్రేడు క్వింటాకు రూ.1,960, సాధారణం క్వింటాకు రూ.1,940 చొప్పున చెల్లించ నున్నారు.

అంచనా దిగుబడి 2.20 లక్షల మెట్రిక్‌ టన్నులు: జిల్లా వ్యాప్తంగా సాగులో ఉన్న 80వేల ఎకరాల నుంచి 2.20లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. వచ్చిన దిగుబడిలో 1.90 లక్షల మెట్రిక్‌ టన్నులను కొనుగోలు చేసే అవకాశం ఉంది. మిగిలిన 30వేల మెట్రిక్‌ టన్నులను రైతులు సొంత అవసరాలకు వినియోగించుకోనున్నారు. గతేడాది యాసంగిలో రైతుల నుంచి 1.34లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఈసారి మాత్రం 86వేల మెట్రిక్‌ టన్నులు అధికం.

20 లక్షల గోనె సంచులు అవసరం: రైతులు సొంత బ్యాగుల్లో తెచ్చిన ధాన్యాన్ని ఎఫ్‌సీఐ తన బ్యాగుల్లోకి మార్చుకునేందుకు 20 లక్షల లక్షల గోనె సంచులు అవసరం. ప్రస్తుతం 6 లక్షలు అందుబాటులో ఉన్నాయి. వీటిని ఆయా కొనుగోలు కేంద్రాలకు పంపిణీ చేస్తారు. కొనుగోలు ప్రక్రియ ప్రారంభం కాగానే ఉన్నతాధికారులు అవసరమైన మేరకు మరిన్ని సరఫరా చేయనున్నారు.


గోదాంలు, మిల్లులకు

రైతులు కొనుగోలు కేంద్రాల్లో విక్రయించిన ధాన్యాన్ని అధికారులు నిర్ణీత గోదాంలు లేదంటే మిల్లులకు తరలించనున్నారు. పరిస్థితులను బట్టి ఏఏ కేంద్రంలోని ధాన్యాన్ని ఎక్కడెక్కడికి పంపించాలని నిర్ణయిస్తారు. ఆమేరకు కేంద్రాల్లో తాత్కాలికంగా నిల్వచేసిన ధాన్యాన్ని సంబంధిత సిబ్బంది కేటాయించిన లారీల్లో గమ్యస్థానాలకు తరలించే ఏర్పాట్ల్లు చేస్తారు.


సాగు ఆశాజనకమే..

ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా వర్షాలు ఎక్కువగా కురిశాయి. సాగులో ఉన్న పైర్లకు బోర్లు, బావుల నుంచి నీటిని పారించే పరిస్థితి ఎక్కువగా రాలేదు. దీంతో రైతులు పైర్లకు నీటిని పారించే సమయాన్ని సస్యరక్షణ చర్యల చేపట్టేందుకు వినియోగించారు. సకాలంలో కలుపు మందులను పిచికారీ చేయడం, పైర్ల ఎదుగుదలకు అవసరమైన ఎరువులను చల్లడం, ఎగువ నుంచి పాటుగా వచ్చి చేరిన వరదను బయటికి పంపించడం వంటి పనులు చేపట్టారు.


నవంబరు పది నుంచి కొనుగోలు చేసే అవకాశం

రాజేశ్వర్‌, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి

జిల్లాలో వానాకాలం కింద సాగు చేసిన ధాన్యాన్ని వచ్చే నవంబరు పది నుంచి కొనుగోలు చేస్తాం. ఈమేరకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నాం. కేంద్రాలను ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలనే విషయాన్ని జిల్లా పాలనాధికారిణి దిశానిర్దేశం చేస్తారు. వరి ఎక్కువగా సాగు చేసిన గ్రామంలో ఏర్పాటు చేయడానికి ప్రాధాన్యం ఇస్తాం. ఏర్పాటైన చోట రైతులకు అవసరమైన అన్ని వసతులను కల్పిస్తాం.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని