గ్రాముల్లో కొనొచ్చు.. భద్రంగా దాచుకోవచ్చు!
eenadu telugu news
Updated : 18/10/2021 05:36 IST

గ్రాముల్లో కొనొచ్చు.. భద్రంగా దాచుకోవచ్చు!

తర్వాత దశలో మెహిదీపట్నం పనులు..

అధునాతన సౌకర్యాలతో సిద్ధమైన మోడల్‌ రైతుబజార్‌

ఈనాడు - హైదరాబాద్‌

దాదాపు సిద్ధమైన కూకట్ పల్లిలోని మోడల్ రైతు బజార్ భవనం

మొత్తం 15 దశల్లో విస్తరించి ఆసియాలోనే అతి పెద్ద కాలనీగా కూకట్‌పల్లి హౌసింగ్‌ బోర్డుకు పేరుంది. అందుకే ఈ ప్రాంతానికి రైతుబజారు ముందుగానే కేటాయించారు. అయితే అది ప్రజల అవసరాలను తీర్చలేకపోయింది. దీంతో ఈ రైతుబజారును విస్తరించాలని వ్యవసాయ మార్కెటింగ్‌ శాఖ తలచింది. కానీ స్థలం లేకపోవడంతో మల్టీలెవెల్‌ మోడల్‌ రైతు బజారు నిర్మించాలని నిర్ణయించింది. నగరంలో రైతు బజార్లన్నింటినీ ఇలాగే అభివృద్ధి చేయడానికి నమూనాగా కూకట్‌పల్లి హౌసింగ్‌ బోర్డు రైతుబజారును రూ.15 కోట్లతో అభివృద్ధి చేసింది. ఏడాదిలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకొని.. కరోనాతో పాటు.. వివిధ కారణాల వల్ల మూడేళ్లు దాటింది. మొత్తమ్మీద పూర్తయ్యింది. నెల రోజుల్లో ఇది ప్రారంభం కానుంది.

రెండంతస్తుల భవనం..

కూకట్‌పల్లి హౌసింగ్‌ బోర్డులోని మాల్స్‌ దగ్గరలో అంతే రీతిలో ఈ మోడల్‌ రైతుబజారు నిర్మాణమయ్యింది. మొత్తం ఎకరం స్థలం విస్తీర్ణంలో నిర్మిస్తున్న రెండంతస్తుల భవనంలో సెల్లార్‌లో పార్కింగ్‌ సౌకర్యం ఉంది. 1, 2 అంతస్తులలో రైతులకు, పొదుపు సంఘాలకు దుకాణాలను కేటాయిస్తారు. అలాగే క్యాంటిన్‌ సౌకర్యం కల్పించారు. సులభ్‌ కాంప్లెక్స్‌తో పాటు.. ఇక్కడ బయోగ్యాస్‌ ఇంధన తయారీ యూనిట్‌ను కూడా నెలకొల్పుతున్నారు. ఇక్కడి క్యాంటిన్‌కు అవసరమైన గ్యాస్‌తో పాటు.. విద్యుత్‌ అవసరాలను కూడా ఈ ప్లాంట్‌ ద్వారా తీర్చాలని అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతానికి రైతులకు రెస్టు రూంలు అందుబాటులోకి తీసుకురాలేకపోతున్నారు. పైన మరో అంతస్తు నిర్మిస్తే ఈ సౌకర్యం అందుబాటులోకి వస్తుంది. అలాగే కోల్డ్‌ స్టోరేజీని కూడా నిర్మించారు.

వినియోగదారుల అవస్థలు తీరేలా..

డిజిటల్‌ కాంటాలు కావాలని.. బిల్లులు కూడా రావాలని వినియోగదారులు ఒక ఉద్యమాన్నే నగరంలో నడుపుతున్నారు. ఇప్పుడు రైతుబజారుకు వెళ్తే ఎవరైనా కిలో లేదంటే అర కిలో కూరగాయలు తప్పనిసరిగా కొనాల్సిన పరిస్థితి ఉంది. అలాగే వ్యవసాయ మార్కెటింగ్‌ శాఖ నిర్ణయించిన ధరలకు అమ్మకాలు జరిగే పరిస్థితి కూడా లేదు. కేపీహెచ్‌బీ కాలనీలో నిర్మాణాన్ని పూర్తి చేసుకున్న ఈ రైతుబజారులో డిజిటల్‌ కాంటాలు.. బిల్లులు కూడా అందుబాటులోకి రానున్నాయి. దీంతో నగరంలోని రైతుబజార్లన్నిటిలో నిర్ణయించిన ధరలకే ఇక్కడా అమ్మకాలు జరుగుతాయి. 300 గ్రాములు.. 700ల గ్రాములు చొప్పున కొనుక్కునే అవకాశం.. ఎన్ని గ్రాముల కూరగాయలు కొంటున్నామో అంతే డబ్బులు చెల్లించే వ్యవస్థ అందుబాటులోకి వస్తోంది. అలాగే కూరగాయలు మిగిలిపోతే.. భద్రపరచడానికి శీతల గిడ్డంగి కూడా ఉండడంతో రైతులకు కూడా నష్టం రాదు.


త్వరలో మిగతా చోట్ల నిర్మాణం

గరంలో మొత్తం 12 రైతుబజార్లున్నాయి. అందులో మొదటిసారిగా కేపీహెచ్‌బీలో మోడల్‌ రైతుబజారు నిర్మాణం జరిగింది. తర్వాత దశలో మెహిదీపట్నం రైతుబజారును చేపడతామని మార్కెటింగ్‌ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే అక్కడ మూడు అంతస్తుల భవన నమూనాలు సిద్ధమయ్యాయని.. వాటికి జీహెచ్‌ఎంసీ ఆమోదం కూడా ఉందని చెప్పారు. కేపీహెచ్‌బీ మోడల్‌ రైతుబజారు ప్రారంభమయ్యాక వెంటనే ఈ పనులు చేపడతామని.. ఏడాదిలో పూర్తి చేస్తామన్నారు. తర్వాత దశలో మిగతా రైతుబజార్లు నిర్మిస్తామని చెబుతున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని