TS News: ఫలించని భర్త కిడ్నీ దానం
eenadu telugu news
Updated : 18/10/2021 11:13 IST

TS News: ఫలించని భర్త కిడ్నీ దానం

ట్రాన్స్‌ప్లాంటేషన్‌ అనంతరం భార్య మృతి

వైద్యుల నిర్లక్ష్యం అంటూ బంధువుల ఆందోళన


ఆసుపత్రి ఎదుట మృతదేహంతో ఆందోళన చేస్తున్న బాధిత కుటుంబసభ్యులు

మాదాపూర్‌, న్యూస్‌టుడే: రెక్కాడితేగానీ డొక్కాడని కుటుంబంలో గృహిణికి సోకిన మూత్రపిండాల వ్యాధి కుటుంబీకులకు కన్నీటిని మిగిల్చింది. భర్త కిడ్నీ దానంతో ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చేసుకొని తిరిగి వస్తుందనుకున్న ఆమె.. చికిత్స పొందుతూ మృతి చెందడంతో వారంతా శోకసంద్రంలో మునిగిపోయారు. మాదాపూర్‌ పోలీసుల సమాచారం ప్రకారం.. ఎల్బీనగర్‌లో ఉండే పి.శివకుమార్‌ భార్య పావనిని(30) ఇటీవల మాదాపూర్‌లోని మెడికవర్‌ ఆసుపత్రికి తీసుకెళ్లగా వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చేయాలని నిర్ణయించారు. రూ.పది లక్షలు ఖర్చవుతుందని చెప్పారు. అప్పు చేసి డబ్బు పోగు చేసిన భర్త తన కిడ్నీని ఇచ్చేందుకు ముందుకొచ్చాడు. వైద్యులు నాలుగు రోజుల కిందట శస్త్రచికిత్స చేసి భర్త కిడ్నీని భార్యకు అమర్చారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న ఆమె ఆదివారం ఉదయం మృతి చెందింది. కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే పావని మృతి చెందిందంటూ ఆదివారం సాయంత్రం ఆసుపత్రి ఎదుట మృతదేహంతో బైఠాయించారు. వైద్యులు రెండుసార్లు శస్త్రచికిత్స చేశారని, సరిగా నిర్వహించకపోవడం వల్లనే ఆమె మరణించిందని పావని తల్లిదండ్రులు మహాలక్ష్మి, ఏడుకొండలు ఆరోపించారు. ఆసుపత్రి యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు ఆసుపత్రికి చేరుకొని లిఖిత పూర్వక ఫిర్యాదు ఇస్తే విచారణ చేపట్టి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. సాయంత్రం మెడికవర్‌ ఆసుపత్రి మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాకేష్‌ మాట్లాడుతూ.. కిడ్నీ టాన్ర్స్‌ప్లాంటేషన్‌లో రిస్క్‌ ఉంటుందన్న విషయాన్ని ముందుగానే తెలియజేశామన్నారు. శస్త్రచికిత్స అనంతరం ఇన్‌ఫెక్షన్‌ అధికం కావడంతో ఆమె ప్రాణాలను కాపాడలేకపోయామని, వైద్యుల నిరక్ష్యమంటూ చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని