రైలు వస్తే.. ఆగాల్సిందే!
eenadu telugu news
Published : 19/10/2021 01:21 IST

రైలు వస్తే.. ఆగాల్సిందే!

రామయ్యగూడ వద్ద ·గేటు వేయడంతో ..

న్యూస్‌టుడే, వికారాబాద్‌ మున్సిపాలిటీ: జిల్లా వ్యాప్తంగా ప్రధాన రహదారుల్లో రైల్వే ట్రాక్‌లున్నాయి. వీటి వద్ద వంతెనలు లేకపోవటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. రైలు వచ్చి వెళ్లే సమయంలో గేట్ల వద్ద 10 నిమిషాలు వేచి చూడాల్సి వస్తోంది. ఏళ్లుగా ఇదే దుస్థితి. అప్పట్లో రోడ్లపై రద్దీ లేకపోవటంతో సమస్యలు ఎదురు కాలేదు. రానురాను విపరీతమైన వాహనాల సంఖ్య పెరిగింది. గేటు పడిందంటే చాలా వాహనాలు బారులు తీరుతున్నాయి. ఇక అత్యవసరంగా వైద్యానికి వెళ్లేవారికి, గర్భిణుల బాధలు చెప్పనలవి కాదు.

వికారాబాద్‌ కోర్టు సమీపంలో అనంతగిరి రోడ్డుపై రైల్వే ట్రాక్‌పై అధిక సంఖ్యలో రైళ్లు తిరుగుతుంటాయి. తాండూరు, ధారూర్‌, కోట్‌పల్లి, బంట్వారం, పెద్దేముల్‌ మండలాల నుంచి హైదరాబాద్‌ వెళ్లాలంటే, తిరిగి రావాలంటే ఇదే ప్రధాన మార్గం. రైళ్లు వచ్చే సమయంలో గేటు వేస్తున్నారు. రామయ్యగూడ వద్ద ఇదే పరిస్థితి. హౌజింగ్‌ బోర్డు, రాజీవ్‌గృహ కల్ప, రామయ్యగూడ ప్రజలు తరచుగా వికారాబాద్‌కు వచ్చి వెళుతుంటారు. వీరు వికారాబాద్‌కు రావాలంటే  ఈ మార్గంలో రావాల్సిందే. గంగారం సమీపంలో ఇదే పరిస్థితి. జైదుపల్లి, తరిగోపుల, గొట్టిముక్కుల, నాగారం  గ్రామాల ప్రజలు వికారాబాద్‌కు రాకపోకలు సాగిస్తుంటారు.

మరమ్మతుకు చేరిన వంతెన: వికారాబాద్‌ నుంచి హైదరాబాద్‌కు వెళ్లే రహదారిలో వంతెన   శిథిలావస్థకు చేరింది. వాహనాల రాకపోకలు పెరిగి ట్రాఫిక్‌కు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వంతెన విస్తరించటం, కొత్తగా అండర్‌గ్రౌండ్‌ బ్రిడ్జిని నిర్మించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. వికారాబాద్‌ పట్టణం రామయ్యగూడ, కోర్టు సమీపంలోని గేట్ల వద్ద అండర్‌ బ్రిడ్జి నిర్మాణానికి రైల్వే అధికారులు సర్వేకే పరిమితం చేశారు.

తాండూరులో ఇలా

తాండూరు, పాత తాండూరు మధ్య రైల్వే ట్రాక్‌పై రైళ్లు ఎక్కువ సంఖ్యలో రాకపోకలు సాగించడంతో ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

తాండూరు నుంచి జహీరాబాద్‌ వెళ్లే మార్గంలో, తాండూరు నుంచి కరణ్‌కోట వైపు వెళ్లే దారిలో బెల్కటూర్‌ వద్ద రైల్వే ట్రాక్‌లున్నాయి. ఈ మార్గంలో సిమెంట్‌ కంపెనీలకు చెందిన గూడ్స్‌ రైళ్లు వెళుతుంటాయి. రైలు వెళ్లిన ప్రతి సారి గేటు వేస్తున్నారు.
మండలాల్లో ఇదే పరిస్థితి
మర్పల్లి మండల కేంద్రం నుంచి బుధేరా, మోమిన్‌పేట, సదాశివపేట వైపు వెళ్లే రహదారిలో రైలు వెళ్లే వరకు గేటు వద్ద వాహనాలు నిలవాల్సిందే.

మోమిన్‌పేట మండలం మొరంగపల్లి వద్ద తరచుగా గేటు పడటంతో ఆర్టీసీ బస్సుల రాకపోకలకు ఇబ్బందులు  ఎదురవుతున్నాయి.

నవాబ్‌పేట మండలం గేటువనంపల్లి వద్ద, యాలాల నుంచి కోకట్‌ నుంచి తండాకు వైపు వెళ్లే మార్గంలో గేటు వద్ద వంతెన నిర్మించాల్సిన అవసరం ఉంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న సమస్యలను దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ దృష్టికి తీసుకెళ్లామని ఎంపీ రంజిత్‌రెడ్డి తెలిపారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని