తోచినంత రాసేసి..దక్కినంత దాచేసి
eenadu telugu news
Published : 19/10/2021 03:17 IST

తోచినంత రాసేసి..దక్కినంత దాచేసి

ఈనాడు, హైదరాబాద్‌: మణికొండ మున్సిపల్‌ కమిషనర్‌ సెలవులో ఉన్నప్పుడు ఆయన యూజర్‌ఐడీ, పాస్‌వర్డ్‌తో తోచినంత ఆస్తిపన్ను రాసుకుని అక్రమంగా ఆమోదముద్ర వేశారు ఇంటి దొంగలు. గుర్తించిన కమిషనర్‌ నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆస్తిపన్ను చెల్లించేందుకు కమిషనర్‌ అండ్‌ డైరెక్టర్‌ మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌(సీడీఎంఏ) వెబ్‌సైట్‌లో అర్జీ పెట్టుకుంటే బిల్‌ కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. వారి నుంచి నివేదిక రెవెన్యూ అధికారులకు వెళ్తుంది. సక్రమంగా ఉంటే మున్సిపల్‌ కమిషనర్‌కు పంపిస్తారు. ఆ అధికారి తనకు కేటాయించిన యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌తో లాగినై ఆమోదముద్ర వేస్తారు. దరఖాస్తుదారుడు తిరిగి లాగినై సూచించిన ఆస్తి పన్ను చెల్లించాలి.

జరిగిందిదీ: ఈఏడాది జూన్‌ 24 నుంచి జులై 18 వరకు మణికొండ మున్సిపల్‌ కమిషనర్‌ సెలవులో ఉన్నారు. ఆయన కార్యాలయంలో పనిచేసే కొందరు బిల్‌కలెక్టర్లు, కంప్యూటర్‌ ఆపరేటర్లు కమిషనర్‌ యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ను దుర్వినియోగం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా.. సంబంధిత ధ్రువ పత్రాలు లేకుండానే ఆ దరఖాస్తులకు ‘కమిషనర్‌’గా ఆమోద ముద్ర వేశారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేసి నిందితులను గుర్తించాలంటూ కమిషనర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని