బంగారం బిస్కెట్ల పేరిట నమ్మించి మోసం
eenadu telugu news
Published : 19/10/2021 03:17 IST

బంగారం బిస్కెట్ల పేరిట నమ్మించి మోసం

నేరేడ్‌మెట్‌, న్యూస్‌టుడే: బంగారం బిస్కెట్లు అమ్ముతామని మోసం చేసిన ఐదుగురిని సోమవారం నేరేడ్‌మెట్‌ పోలీసులు అరెస్టు చేశారు. సీఐ నర్సింహాస్వామి కథనం ప్రకారం.. కుషాయిగూడ నాగార్జున కాలనీకి చెందిన ఆంథోనిమోసస్‌ లారెన్స్‌(38) స్నేహితుడు దాసును డబ్బు అడిగాడు. తన వద్ద లేకపోవడంతో దాసు.. స్నేహితుని వద్ద రూ.లక్ష తీసుకొని ఆంథోనికి ఇచ్చాడు. కొంతకాలం తర్వాత అడిగితే, పైసలు లేవని బంగారు బిస్కెట్లు ఉన్నాయని.. కొనేవాళ్లు ఉంటే చెప్పాలన్నాడు. దీంతో దాసు విషయాన్ని స్నేహితులైన వినోద్‌, కుమార్‌లకు తెలియజేశాడు. వారు నేరేడ్‌మెట్‌లో బంగారం వ్యాపారం చేసే రవీందర్‌కు చెప్పారు. దీంతో రవీందర్‌, వినోద్‌లు బంగారం కోసం సెప్టెంబరు 29న ఆంథోని వద్దకు వెళ్లగా అతడు వారిని బాలాజీనగర్‌లో ఓ గదికి తీసుకెళ్లాడు. అక్కడ స్నేహితులు చంద్రశేఖర్‌(29), మల్లికార్జున్‌(30), ఆనంద్‌(40), సురేశ్‌(27), సుబ్రహ్మణ్యం ఉన్నారు. ఆరుగురు రవీందర్‌ను, వినోద్‌లను గదిలో బంధించి రూ.93 వేల నగదు దోచుకున్నారు. రవీందర్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా ఐదుగురిని రిమాండ్‌కు తరలించారు. సుబ్రహ్మణ్యం పరారీలో ఉన్నాడు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని