స్వశక్తితో నడిచేలా.. స్థైర్యంగా నిలిచేలా!
eenadu telugu news
Published : 19/10/2021 03:17 IST

స్వశక్తితో నడిచేలా.. స్థైర్యంగా నిలిచేలా!

ఒంటరి మహిళలకు భరోసా!

 

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌

బ్యాగులు కుట్టడంలో శిక్షణ

ర్తను కోల్పోయి ఒకరు. విడిగా ఉంటున్న మరొకరు. అనారోగ్యం బారిన పడిన భర్త. బండెడు బాధ్యతలను భుజాలపై మోస్తూ..అటు కుటుంబాన్ని పోషించడానికి, పిల్లల్ని చదివించడానికి ఇబ్బంది పడుతున్న ఎంతో మంది ఒంటరి మహిళలకు భరోసా అందిస్తోంది నగరానికి చెందిన ‘సఫా’ స్వచ్ఛంద సంస్థ. నైపుణ్య శిక్షణ అందిస్తూ, ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. ఇప్పటివరకు వందలాది మందికి  ఆత్మస్థైర్యాన్ని అందించింది. ఇంటి బాడుగలకు, పిల్లల చదువులకు, కుటుంబ పోషణకు, అనారోగ్య ఖర్చులకు ఇలా ప్రతిదానికి నా అనేవాళ్ల మీద ఆధారపడకుండా స్వశక్తితో ముందుకు నడిచేలా మార్గం సుగమం చేస్తోంది.
ప్రారంభమైందిలా
ఒంటరి మహిళల అభ్యున్నతి కోసం 2006లో ప్రారంభమైంది సఫా ఫౌండేషన్‌. మహిళలకు టైలరింగ్‌లో నైపుణ్య శిక్షణ అందించడంతోపాటు వారికి ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఆలోచనలతో బహదూర్‌పురాలోని వట్టేపల్లిలో ప్రారంభించారు. నెల రోజులపాటు వారికి ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలుగా ఎలా మారాలో శిక్షణ అందించారు. ఉత్పత్తి, మార్కెటింగ్‌, లాభ, నష్టాల బేరీజు తదితర అంశాలపై శిక్షణ ఇచ్చారు. శిక్షణ పొందిన వారిలో 70 శాతం మందికి ఉపాధి అవకాశాలు లభించాయి.
కిచెన్‌.. అందరూ యజమానులే..
ఒంటరి మహిళలు పడుతున్న కష్టాలపై అధ్యయనం చేసిన సంస్థ .. వారు పడుతున్న అవస్థల నుంచి బయటపడేసి వారికి మంచి ఉపాధి అవకాశాలు కల్పించాలని నిర్ణయించి లుక్మా కిచెన్‌ను 2019లో బహదూర్‌పురాలోని వట్టేపల్లిలో ప్రారంభించింది. ఇళ్లలో పాచి పని చేసే మహిళలందరినీ ఒక దగ్గరికి చేర్చి వారికి హైదరాబాదీ రుచులను వండడంలో నిష్ణాతులుగా తయారు చేసింది. ఇందుకోసం ప్రముఖ చెఫ్‌లతో శిక్షణ అందించింది. అనంతరం నవాబ్‌ సాహెబ్‌ కుంటలో మరొక లుక్మా కిచెన్‌ను ప్రారంభించింది. ఇక్కడ సుమారు 15 మంది మహిళలు పని చేస్తున్నారు. ‘ప్రతి ఒక్కరూ యజమాని, ప్రతి ఒక్కరు ఉద్యోగి’ అనే కాన్సెప్ట్‌పై ఇది నడుస్తోంది. ఉదయం 7  నుంచి ఆర్డర్లు తీసుకోవడం, గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో వాటిని ఇంటింటికీ డోర్‌ డెలివరీ చేయడం ప్రత్యేకత. మహిళలనే పూర్తి స్థాయి రైడర్లుగా నియమించి వారితోనే డోర్‌ డెలివరీలు చేయించి అందులోనూ వారికి ఉపాధి కల్పించాలని అనుకుంటున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు.

టైలరింగ్‌


కొవిడ్‌ సమయంలో సేవలు

కొవిడ్‌ వేళ.. వీధి వ్యాపారులకు సూక్ష్మ రుణాలు అందజేసింది. ఆర్టిజన్‌ సెంటర్‌ ద్వారా లక్ష మాస్కులు ఉచితంగా పంపిణీ చేశారు. అన్నార్తులకు ఆహారం అందజేసింది. నగరాన్ని వరదలు అతలాకుతలం చేసిన సమయంలోనూ సేవా కార్యక్రమాలు చేశారు. చిన్నారులకు ఉచిత ట్యూషన్లు చెప్పించారు. పై చదువులు చదవలేని వారికి కెరీర్‌ గైడెన్స్‌, కమ్యూనికేషన్‌ నైపుణ్యాలు అందించి ఉపాధి కల్పించారు.


స్టూడియో.. మహిళలకు మాత్రమే..
నగరంలో మహిళలకు మాత్రమే ప్రత్యేకంగా రిక్రియేషన్‌ హబ్‌లు వెలుస్తున్నాయి. అలాంటి కోవలోకి చెందించే రీక్రియేషన్‌ హబ్‌ లుక్మా స్టూడియో.. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు తమ ఆలోచనలు పంచుకోవడానికి, స్నేహితులు అందరూ కలిసి ఇక్కడ సరదాగా గడపడానికి అన్ని రకాల సదుపాయాలు అమర్చారు. కేవలం మహిళలకు మాత్రమే ప్రవేశం. ఇక్కడికి వచ్చిన వారందరూ లుక్మా కిచెన్‌ వంటకాలన్నీ రుచి చూసే వెళ్తారు. దమ్‌ కా కీమా, తలవా గోష్ట్‌, బగార్‌-ఇ-బైగన్‌, అచారి చికెన్‌, కుబూలీ, కిచిడీ కట్టా, దాల్చా వంటి విభిన్న హైదరాబాదీ రుచులను ఆస్వాదిస్తుంటారు.
ఆర్టిజన్‌ సెంటర్‌
నవాబ్‌ సాహెబ్‌ కుంట ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఆర్టిజన్‌ సెంటర్‌ ద్వారా వందలాది మందికి ఉపాధి కల్పిస్తున్నారు. కుట్టుమిషన్లు ఏర్పాటు చేసి చిన్నారుల ఏకరూప దుస్తులు, రెడిమేడ్‌ దుస్తులు, వైవిధ్యమైన జ్యూట్‌ బ్యాగులు తదితరాలు అందిస్తున్నారు. కార్పొరేట్‌ కంపెనీలు, విశ్వవిద్యాలయాలు, ఇతర కళాశాలలు సైతం సమావేశాలు ఇతర కార్యక్రమాలు జరిగినప్పుడు అందరికీ పంచడానికి జ్యూట్‌ బ్యాగులను ఇక్కడి నుంచే ఆర్డరు ఇస్తుంటాయని సఫా ఫౌండేషన్‌ సోషల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ మేనేజర్‌ సయ్యద్‌ యూనస్‌ తెలిపారు


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని