నిప్పుకోళ్ల జాతులన్నీ నగరానికి!
eenadu telugu news
Published : 19/10/2021 03:17 IST

నిప్పుకోళ్ల జాతులన్నీ నగరానికి!

ప్రస్తుతం ‘జూ’లో ఆస్ట్రిచ్‌, ఈములు
త్వరలో రియో, కసోరి జాతులు
ఈనాడు, హైదరాబాద్‌

గరంలోని జంతు ప్రపంచలోకంలో త్వరలో కొత్త జాతులు సందడి చేయబోతున్నాయి. నెహ్రూ జంతు ప్రదర్శనశాల అధికారులు జంతు మార్పిడి పథకం ద్వారా దేశ విదేశాల్లోని జూ పార్కుల నుంచి కొత్త జంతువులు, పక్షులను తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. అందులో భాగంగా నిప్పుకోళ్ల జాతికి చెందిన పక్షులన్నింటినీ జూలో ప్రదర్శించేందుకు రంగం సిద్ధమైంది. ప్రస్తుతం నెహ్రూ జూలో రెండు రకాలున్నాయి. ఆస్ట్రిచ్‌, ఈము పక్షలు సందర్శకులకు కనువిందు చేస్తున్నాయి. వీటి రకానికి చెందిన మరో రెండు జాతులు ఏడాది చివరికల్లా హైదరాబాద్‌ రానున్నాయి. త్రివేండ్రమ్‌ నుంచి రెండు జతల రియోలు, మరో ప్రాంతం నుంచి కసోరి జత రాజధానికి చేరుకోనున్నాయి. దాదాపు అదే సమయానికి జపాన్‌ నుంచి కంగారూలు, మీర్‌క్యాట్‌లు, భువనేశ్వర్‌ నుంచి చింపాంజీలు వస్తాయని జూపార్కు సంతోషం వ్యక్తం చేస్తోంది.


భువనేశ్వర్‌ నుంచి చింపాంజీ జంట..
జూపార్కులోని ఏకైక మగ చింపాంజీ గతేడాది చనిపోయింది. దాని స్థానంలో ఓ జంట చింపాంజీలను తీసుకొచ్చేందుకు భువనేశ్వర్‌ అధికారులతో చర్చలు జరుపుతున్నారు. ఏడాది చివరికి ప్రక్రియ పూర్తవుతుందని అంచనా. జిరాఫీలు, ఇతర పక్షి, జంతువులనూ జంతు మార్పిడి పథకం ద్వారా తెచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు.


జపాన్‌ నుంచి కంగారూలు, మీర్‌క్యాట్‌లు..
జపాన్‌ దేశం నుంచి కంగారూలు నాలుగు జతలు, ఓ జత మీర్‌క్యాట్‌లు (కుందేళ్ల మాదిరి ఉంటాయి. పెంగిన్లలా రెండు కాళ్లపైనా నడుస్తాయి.) రానున్నాయి. వాటిని తీసుకొచ్చేందుకు డీజీఎఫ్‌టీ (డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌) అనుమతి కోసం వేచి చూస్తున్నా అధికారులు చెబుతున్నారు. జపాన్‌ దేశం వాటిని మనకు ఇస్తున్నందుకుగాను.. నెహ్రూ జూ నుంచి ఓ ఆడ ఆసియా సింహాన్ని బదులుగా పంపిస్తున్నట్లు తెలిపారు.


ఎగరలేని భారీ పక్షి జాతులు..

సహజంగా చాలా మంది నిప్పుకోళ్లు ఆఫ్రికాలోనే ఉంటాయనుకుంటారు. ఆఫ్రికా నిప్పుకోడిని పోలిన మరో మూడు భారీ పక్షి జాతులు ఆస్ట్రేలియా, అమెరికాల్లోనూ ఉన్నాయి.

ఈము..

దీన్ని ఆస్ట్రేలియా ఆస్ట్రిచ్‌గా పిలుస్తారు. ఆఫ్రికా నిప్పుకోడికన్నా తక్కువ ఎత్తు, బరువు ఉంటుంది. రెక్కలూ చిన్నవే. దీని మెడపై ఈకలుంటాయి. గరిష్ఠంగా 1.9మీటర్ల ఎత్తు, 60కేజీల బరువు పెరుగుతాయి.


ఆస్ట్రిచ్‌..

ఒకప్పుడు ఆసియాలోనూ వీటి మనుగడ ఉండేది. ఇప్పుడు ఆఫ్రికాలో అడవుల్లో ఉన్నాయి. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద పక్షి. రెక్కలు పెద్దవి. కానీ ఎగరలేదు. ఇవి గరిష్ఠంగా 2.8మీటర్ల ఎత్తు, 145కేజీల బరువు పెరుగుతాయి. వీటి గుడ్లూ భారీగా ఉంటాయి. గంటకు 70కి.మీ వేగంతో పరుగుతీస్తాయి. అప్పుడు 3 నుంచి 5మీటర్ల దూరంలో పాదాలు పడతాయి. ఇతర పక్షులకు భిన్నంగా పాదాలకు రెండే వేళ్లుంటాయి. అందంగా పెద్ద కళ్లూ ఉంటాయి. ఎక్కువ దూరం చూస్తాయి. మెడపై ఈకలు ఉండవు.


రియా..

దక్షిణ అమెరికా నిప్పుకోడిగా పిలుస్తారు. ఆస్ట్రిచ్‌, ఈముల కన్నా చిన్నది. మెడపై జుట్టు ఉంటుంది. గరిష్టంగా 1.7మీటర్ల ఎత్తు, 40కేజీల బరువు పెరుగుతుంది. తెలుపు, గోదుమ రంగులకు చెందిన రెండు జతల రియాలు నెహ్రూ జూకు రానున్నాయి.


కసోరి

ఇది అన్నింటికన్నా చిన్నది. నిప్పు కోళ్లతోపోలిస్తే భిన్నంగా ఉంటుంది. నెమలి మాదిరి దీని మెడపై నీలి రంగు ఈకలుంటాయి. ఇది ప్రమాదకరమైన పక్షి. వీటిని నగరానికి తీసుకొస్తే.. అన్ని రకాల నిప్పు కోళ్లు జూ పార్కులో ఉన్నట్లవుతుంది. అందులో భాగంగా అధికారులు వేర్వేరు జంతు ప్రదర్శనశాలలతో చర్చలు జరుపుతున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని