బీ పాస్‌... బైపాస్‌!
eenadu telugu news
Published : 19/10/2021 03:17 IST

బీ పాస్‌... బైపాస్‌!

కొత్త చట్టమొచ్చినా గ్రేటర్‌లో ఆగని అక్రమ నిర్మాణాలు
అధికారుల చేతులు తడిపి యథేచ్ఛగా కొనసాగింపు
ఉప్పల్‌ కూడలిలో ఎకరం పైగా స్థలంలో భవనం
ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి; ఈనాడు, హైదరాబాద్‌; న్యూస్‌టుడే, ఉప్పల్‌

ఉప్పల్‌ మెట్రో స్టేషన్‌ పక్కన పునాదుల దశలో ఉన్న భవనం

రాజధానిలో అక్రమ నిర్మాణాలు పుట్టగొడుగుల్లా వెలుస్తుండడంతో.. అడ్డుకట్టవేయాలని సీఎం కేసీఆర్‌ తలంచారు. అనధికారికంగా నిర్మాణాలు చేపట్టేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ జీహెచ్‌ఎంసీని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే ముఖ్యమంత్రి ఆదేశాలను బేఖాతరు చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఉప్పల్‌ ఎక్స్‌రోడ్డులో నిర్మిస్తున్న బహుళంతస్తుల భవనమే దీనికి ప్రత్యక్ష నిదర్శనం. అనుమతి లేకుండానే 1.2 ఎకరాల విస్తీర్ణంలో భారీ సెల్లార్‌ తవ్వడమేగాక, ఒక అంతస్తు నిర్మించేశారు. మరో అంతస్తు నిర్మిస్తున్నారు. స్థానికులు గగ్గోలు పెడుతున్నా ప్రణాళిక విభాగం చర్యలు తీసుకోకపోవడాన్ని చూస్తుంటే టీఎస్‌ బీపాస్‌ చట్టాన్ని అధికారులు పక్కదారి(బైపాస్‌) పట్టిస్తున్న విషయం ఇట్టే అర్థమవుతోంది.  

ఉప్పల్‌ ఎక్స్‌రోడ్డులో మెట్రో స్టేషన్‌ పక్కనున్న ఖాళీ స్థలాన్ని నగరానికి చెందిన ఓ బడాబాబు సొంతం చేసుకున్నారు. రెండెకరాల విస్తీర్ణంలో అతి పెద్ద షాపింగ్‌ కాంప్లెక్సుకు పూనుకున్నారు. ఆయనకు నగరానికి చెందిన కీలక ప్రజాప్రతినిధి అండ ఉందని సమాచారం. నిబంధనల ప్రకారం.. ప్రణాళికా విభాగం అనుమతి తీసుకున్నాకే నిర్మాణం చేపట్టాలి. ఒకవేళ అనుమతిచ్చినా వర్షాకాలం దృష్ట్యా నిబంధనల ప్రకారం జూన్‌ 1 నుంచి అక్టోబరు 31 వరకు సెల్లార్లు తవ్వరాదు. ఉప్పల్‌ కూడలిలో మాత్రం ఈ ఆదేశాలు ఏమాత్రం అమలుకావడంలేదు. భూమి లోపల 3 అంతస్తులు నిర్మించడానికి సెల్లార్‌ తవ్వారు. ఇప్పటికే ఒక శ్లాబు వేయగా, మరొకటి పురోగతిలో ఉంది. చుటుపక్కల వారు అభ్యంతరం తెలిపినా, జీహెచ్‌ఎంసీకి ఫిర్యాదులు చేసినా ఆపలేదు. నిర్మాణం చేపట్టిన వ్యక్తి ఓ పార్టీలో కీలక పదవిలో ఉండటంతో అధికారులు కన్నెత్తి చూడడంలేదు. అదేమంటే ‘నిర్మాణదారుడికి కీలక నేత అండదండలు ఉన్నాయని, అడ్డుపడితే శంకరగిరి మాన్యాలు పట్టాల్సిందే’నని కిందిస్థాయి అధికారులు చెబుతున్నారు.

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ట్వీట్‌తో..
అధికారులు స్పందించకపోవడంతో స్థానికులు టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డికి సమాచారం ఇచ్చారు. మంత్రి కేటీఆర్‌ను ఉద్దేశించి రేవంత్‌ ట్వీట్‌ చేశారు. ‘హైదరాబాద్‌ మంత్రి అండ.. ఉప్పల్‌ చౌరస్తాలో అనుమతి లేని అక్రమ నిర్మాణం.. ఫిర్యాదులు చేసినా పట్టించుకో లేదు.. మీ శాఖ బాగోతాలపై చర్యలుంటాయా’ అంటూ ట్వీట్‌లో ప్రశ్నించారు. దీనిపై ప్రభుత్వ పెద్దలు జీహెచ్‌ఎంసీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పందించిన అధికారులు అక్రమ నిర్మాణ పనులను అడ్డుకున్నారు.

ఏడాదికి 2-3 వేల అక్రమ నిర్మాణాలు
మహానగరంలో ఏటా అధికారికంగా 15 వేల నిర్మాణాలకు అనుమతిస్తుండగా మరో 2-3 వేల అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. కిందిస్థాయి అధికారులు అక్రమ నిర్మాణదారులతో కుమ్మక్కై ఎలా చేపట్టాలన్నదానిపై ప్రణాళిక ఇస్తుండడం గమనార్హం. అంతస్తులను బట్టి లంచాలు రాబట్టి, సంబంధితుతందరికీ వాటాలు పంపిణీ చేస్తున్నారు. అక్రమ నిర్మాణాల నిరోధానికి జోనల్‌ స్థాయిలో స్పెషల్‌ టాస్క్‌ఫోర్సులను ఏర్పాటు చేసి, నెల రోజులు సమర్థంగా వినియోగించుకొని తర్వాత వదిలేశారు. దీంతో పట్టణ ప్రణాళిక విభాగంలో అవినీతి నిత్యకృత్యమైంది.


రెండ్రోజుల్లో అనుమతి ఇస్తారట..

విషయమై బల్దియా అధికారులను వివరణ కోరగా.. నిర్మాణ అనుమతి అర్జీ పరిశీలనలో ఉందని, రెండ్రోజుల్లో మంజూరవుతుందని పేర్కొన్నారు. మరి పనులు ఎలా జరుగుతున్నాయంటే నోరు మెదపడం లేదు. ఈ వివాదంలోకి తమను లాగొద్దని ఓ అధికారి అన్నారు. ఫిర్యాదు విషయం ఆలస్యంగా తెలిసిందని, విచారణ చేపట్టి వివరాలు చెబుతామని, కేంద్ర కార్యాలయ అధికారి తెలిపారు. ఉప్పల్‌ సర్కిల్‌ అధికారులు దీన్ని అక్రమ నిర్మాణమని తేల్చారు. కేంద్ర కార్యాలయం ఆదేశిస్తే చర్యలు తీసుకుంటామన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని