14 నెలల బాలుడికి అరుదైన శస్త్రచికిత్స
eenadu telugu news
Published : 20/10/2021 02:11 IST

14 నెలల బాలుడికి అరుదైన శస్త్రచికిత్స

‘ఈనాడు’ కథనంతో ముందుకొచ్చిన దాతలు
చికిత్స పొందుతున్న బాలుడు

హయత్‌నగర్‌ న్యూస్‌టుడే: హయత్‌నగర్‌ పెద్దఅంబర్‌పేట్‌లోని యూనికార్పస్‌ వర్డ్‌ అండ్‌ డీడ్‌ హాస్పిటల్‌లో 14నెలల బాలుడికి అరుదైన శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తి చేశారు. బాగ్‌ అంబర్‌పేట్‌ మల్లిఖార్జుననగర్‌కు చెందిన జె.శ్రీను, హరిత దంపతుల కుమారుడికి (14నెలలు) పుట్టుకతోనే మూత్రాశయం శరీరం బయట ఉంది. చాలా అరుదుగా ఉండే ఈ సమస్యను ‘బ్లాడర్‌ ఎక్స్‌ట్రోఫి’ అంటారని వైద్యులు తెలిపారు. వైద్యానికి పెద్దమొత్తంలో ఖర్చు అవుతుందని చెప్పడంతో దంపతులు కుంగిపోయారు. బాలుడిని ఆదుకోవాలంటూ గత నెల 23న ‘పాపం...పసివాడు’ శీర్షికతో ‘ఈనాడు’లో కథనం ప్రచురితమైంది. పలువురు దాతలు ముందుకొచ్చి ఆర్థిక సాయం అందించారు. అదే క్రమంలో యూనికార్పస్‌ హెల్త్‌ ఫౌండేషన్‌ కూడా పూర్తి సహకారం అందించి బాలుడికి అరుదైన శస్త్రచికిత్స నిర్వహించినట్లు ఆసుపత్రి డైరెక్టర్‌ డాక్టర్‌ గడ్డం శిల్ప తెలిపారు. రిటైర్డ్‌ పిడియాట్రిక్‌ సర్జన్‌, ప్రముఖ వైద్యులు డాక్టర్‌ జాకబ్‌ చాకో, పిడియాట్రిక్‌ సర్జన్‌ డాక్టర్‌ మందాకిని, అనస్తీషియా వైద్యులు డాక్టర్‌ నితిన్‌లతో కూడిన వైద్య బృందం ఈనెల 7న ఐదుగంటలకు పైగా శ్రమించి శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేసినట్లు తెలిపారు. బాలుడి ఆరోగ్యం నిలకడగానే ఉందన్నారు. కార్యక్రమంలో ఫౌండేషన్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ శాంసన్‌సుజిత్‌ కుమార్‌, సూపరిండెంట్‌ డాక్టర్‌ జ్యోత్స్న, సిబ్బంది పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని