గంజాయి స్మగ్లర్‌ అరెస్ట్‌
eenadu telugu news
Published : 20/10/2021 03:09 IST

గంజాయి స్మగ్లర్‌ అరెస్ట్‌

నర్సీపట్నం నుంచి హైదరాబాద్‌కు రవాణా

నాగసాయి

ఈనాడు, హైదరాబాద్‌: విశాఖపట్నం ఏజెన్సీ, ఆంధ్రా ఒడిషా సరిహద్దులో గంజాయి పండిస్తున్న రైతుల నుంచి కొని హైదరాబాద్‌కు సరఫరా చేస్తున్న వానపల్లి నాగసాయిని ఉత్తర మండలం టాస్క్‌ఫోర్స్, అఫ్జల్‌గంజ్‌ పోలీసులు మంగళవారం అరెస్ట్‌ చేశారు. అతడి వద్ద నుంచి రూ.4 లక్షల విలువైన గంజాయి పొట్లాలను స్వాధీనం చేసుకున్నామని కొత్వాల్‌ అంజనీ కుమార్‌ విలేకరుల సమావేశంలో తెలిపారు. నర్సీపట్నంకు చెందిన నాగసాయి కేటరింగ్‌ వ్యాపారం నిర్వహిస్తూనే ఏడాది నుంచి గంజాయి స్మగ్లర్‌గా మారాడు. మూడు రోజుల క్రితం అరెస్టైన అహ్మద్‌నగర్‌ వాసులు విలాస్‌భావ్, ధ్యానేశ్వర్‌లకు ఇతడే గంజాయి సరఫరా చేశాడు.  హైదరాబాద్‌లోని కొందరు ఏజెంట్లకు స్వయంగా ఇతడే గంజాయిని తీసుకు వస్తున్నాడు. మంగళవారం తెల్లవారుజామున ఎంజీబీఎస్‌ నుంచి ఆటోలో వెళ్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  గంజాయి కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విచారణ ప్రక్రియ వేగంగా పూర్తిచేసేందుకు ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయాలంటూ ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నామని అంజనీకుమార్‌ తెలిపారు. 

ప్రత్యేక డ్రైవ్, 128 మంది అరెస్ట్‌
గంజాయి సరఫరాను నిరోధించేందుకు ఆరు వారాలుగా పోలీసులు  ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహిస్తున్నారు. ఈ వ్యవధిలో 82 కేసులు నమోదు చేసి 128 మందిని అరెస్ట్‌ చేశారు. 1500కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. విక్రయాలను కొనసాగిస్తున్న 24 మందిపై పీడీ చట్టం ప్రయోగించారు. నగరానికి గంజాయిని తీసుకు వచ్చే 17 మంది ట్రాన్స్‌పోర్టర్లను అరెస్ట్‌ చేశారు. గంజాయి ఎక్కడ లభిస్తోందన్న అంశాలపై నిందితులను విచారించగా ఒడిషాలోని మల్కన్‌గిరి, ఆంధ్రా- ఒడిశా సరిహద్దు, సీలేరు, తుని, అరకు, పాడేరు, నర్సీపట్నం, చింతపల్లి రిజర్వ్‌ ఫారెస్ట్‌ల నుంచి తీసుకు వస్తున్నామంటూ చెప్పారని టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ(ఓఎస్‌డీ) రాధాకిషన్‌ రావు తెలిపారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని