సమయానికి రండి..పరీక్షలు రాయండి
eenadu telugu news
Published : 21/10/2021 01:01 IST

సమయానికి రండి..పరీక్షలు రాయండి

న్యూస్‌టుడే, పాత తాండూరు: ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం పరీక్షలు రాసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కరోనా కారణంగా ఇంటర్‌ విద్యార్థులు గతేడాది పరీక్ష రాయకుండానే ద్వితీయంలోకి వెళ్లారు. ప్రస్తుతం తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో విద్యార్థులు నష్టపోకుండా ఉండాలని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 25వ తేదీ నుంచి నవంబరు 3వ తేదీ వరకు ఉదయం 9గంటల నుంచి 12 గంటల వరకు కొనసాగనున్నాయి. తాజా నిబంధనల ప్రకారం ఈసారి 70శాతం పాఠ్యాంశాల నుంచే ప్రశ్నలు వస్తాయని అధికారులు చెబుతున్నారు. ప్రశాంతంగా నిర్వహించేందుకు వసతులు కల్పించామని ఆయా కళాశాలల అధ్యాపకులు వివరిస్తున్నారు.

జిల్లాలో 9,300 మంది విద్యార్థులు..: తాండూరు, వికారాబాద్‌, పరిగి, కొడంగల్‌ నియోజకవర్గాల పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో మొత్తం 9,300 మంది ఇంటర్‌ ప్రథమ సంవత్సరం పరీక్షలకు హాజరు కానున్నారు. మొత్తం 29 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. గతంలో 24 కేంద్రాలుండగా, తాండూరులో 2, పరిగి, వికారాబాద్‌, యాలాల పరిధిలో ఒకటి చొప్పున ఐదు కేంద్రాలను అదనంగా పెంచారు. కేంద్రంలో భౌతిక దూరం పాటించేలా కూర్చోబెట్టనున్నారు. వ్యాక్సిన్‌ తీసుకున్న అధ్యాపకులకు విధులను కేటాయించారు. ఈ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టారు. కేంద్రం వద్ద 144 సెక్షన్‌ కొనసాగుతుందని వివరించారు. పరీక్షల సమయంలో విద్యార్థులకు తల్లిదండ్రులు సహకరించాలని అధ్యాపకులు వివరిస్తున్నారు. 

ఇబ్బందుల్లేకుండా..: ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఇటీవల జిల్లా పాలనాధికారిణి నిఖిత అన్నిశాఖల అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. ఉదయం, సాయంత్రం వేళ సమయానికి బస్సు సౌకర్యం కల్పించడం, చదువుకు ఆటంకం కలగకుండా ఆయా తేదీల్లో రాత్రి వేళల్లో విద్యుత్‌ అంతరాయం ఏర్పడకుండా చూడాలని ఆశాఖ అధికారులను ఆదేశించారు. కేంద్రాల వద్ద వెళుతురు, తాగునీటి సౌకర్యం తోపాటు కొవిడ్‌ నిబంధనలు, ఐసోలేషన్‌ గది, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండనున్నారు.


అమల్లో నిమిషం నిబంధన  : శంకర్‌ నాయక్‌, జిల్లా ఇంటర్‌ బోర్డు అధికారి
పరీక్ష సమయానికి అరగంట ముందే విద్యార్థులు కేంద్రానికి చేరుకోవాలి. నిమిషం నిబంధన అమల్లో ఉంది. అందరూ మాస్కులు, శానిటైజర్లు కలిగి ఉండాలి. ఎప్పటికప్పుడు గదులను శుభ్రం చేయడం, శానిటైజ్‌ చేయాలని కళాశాలల ప్రధాన అధ్యాపకులకు, యాజమాన్యాలకు సూచించాం. ఆన్‌లైన్‌లో ప్రవేశపత్రాన్ని తీసుకోవాలి.


 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని