నిబంధనల విస్మరణ..నీటివనరుల ఆక్రమణ
eenadu telugu news
Published : 21/10/2021 01:01 IST

నిబంధనల విస్మరణ..నీటివనరుల ఆక్రమణ

ఈనాడు డిజిటల్‌, వికారాబాద్‌: న్యూస్‌టుడే, మోమిన్‌పేట్‌

బొంరాస్‌పేట మండలం మదన్‌పల్లిలో ఇలా..

ఎఫ్‌టీఎల్‌ సమీపాన పొలం చుట్టూ నిర్మించిన కంచె

* మోమిన్‌పేట్‌ మండల కేంద్రంలోని నందివాగు ప్రాజెక్టు బఫర్‌ జోన్‌లో అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారు. నిబంధనల ప్రకారం ఫుల్‌ట్యాంక్‌ లెవల్‌ నుంచి 30 మీటర్ల మేర కొంత స్థలాన్ని విడిచిపెట్టాలి. ఇక్కడ ఆ విషయాన్ని విస్మరించారు. అయినా రెవెన్యూ అధికారులు మా పరిధి కాదని, నీటిపారుదల అధికారులు మా దృష్టికి రాలేదని దాటవేస్తున్నారు.  
* బొంరాస్‌పేట మండలం మదన్‌పల్లి సమీపంలోని చెరువు ఫుల్‌ట్యాంక్‌ లెవల్‌లో మట్టిని పోసి చదును చేస్తున్నారు. చెరువులో కడీలు పాతారు. పై భాగంలో ఉన్న పట్టా భూముల్లో లే అవుట్‌ వేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. పట్టా భూములయినా ఎఫ్‌టీఎల్‌ పరిధిలో మట్టిని నింపడం నిబంధనలకు విరుద్ధం. నిత్యం అదే దారిలో రాకపోకలు సాగించే అధికారులు దృష్టిసారించడం లేదని గ్రామస్థులు పేర్కొంటున్నారు.
చెరువులు, ప్రాజెక్టులు, నదులు, వాగులు, కాల్వల పరిధిలో ఫుల్‌ ట్యాంక్‌ లెవల్‌ (ఎఫ్‌టీఎల్‌), బఫర్‌ జోన్లలో ఎటువంటి నిర్మాణాలు చేపట్టొద్దని చట్టం చెబుతోంది. క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తే మాత్రం ఆ విషయాన్ని ఎవరూ పట్టించుకునే పరిస్థితి కనిపించడం లేదు. పట్టణీకరణ పెరగడం, సిర్థాస్తి వ్యాపారం జోరందుకోవడంతో గ్రామాలు, పట్టణాల్లో పెద్ద సంఖ్యలో వెంచర్లు, వ్యవసాయ క్షేత్రాలు ఏర్పాటవుతున్నాయి. ఈ క్రమంలోనే అక్రమాలకు తెరలేపుతున్నారు. అయినా రెవెన్యూ, జలవనరుల అధికారులు మాత్రం తమకేమీ పట్టదన్నట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో సహజ సిద్ధంగా ఉండాల్సిన నీటి వనరులు దెబ్బతింటున్నాయి. మెల్లిమెల్లిగా అన్యాక్రాంతమవుతున్నాయి. అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తే తప్ప వీటికి అడ్డుకట్ట పడదు.
జిల్లాలో 571 పంచాయతీల పరిధిలో మొత్తం 1,126 చెరువులు జలవనరుల శాఖ ఆధీనంలో ఉన్నాయి. మిషన్‌ కాకతీయ పథకంలో రూ.248 కోట్లు వెచ్చించి 726 చెరువులను అభివృద్ధి చేశారు. చెరువుల శిఖం భూములను గుర్తించడం, కట్టలను బలోపేతం చేయడం, ట్యాంకు నీటి నిల్వ సామర్థ్యం పెంపొందించే కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం గడిచిన మూడేళ్ల నుంచి చెరువులపై పర్యవేక్షణ కొరవడింది. పట్టణం, గ్రామం అనే తేడా లేకుండా రహదారులకు సమీపంలో ఉన్న నీటి వనరులను కబ్జా చేస్తున్నారు. వ్యవసాయ భూములకు ధరలు విపరీతంగా పెరగడంతో, స్థిరాస్తి వ్యాపారులు ఫుల్‌ ట్యాంక్‌ లెవల్‌లో మట్టిని పోసి చదును చేస్తున్నారు. పట్టా భూములని చెప్పి బఫర్‌ జోన్‌లో నిర్మాణాలు చేపడుతున్నారు. ప్రాజెక్టులు, చెరువుల పరిధిలో ఫుల్‌ ట్యాంక్‌ లెవల్‌ నుంచి కనీసం 30 మీటర్ల వరకు ఎటువంటి నిర్మాణాలు చేపట్టవద్దు.  అయితే నందివాగు ప్రాజెక్టు, వికారాబాద్‌ తాగునీటి ఆధారమైన శివారెడ్డిపేట్‌ చెరువు, తాండూరులోని గొల్లచెరువు, చిలుకవాగు, పరిగి కొత్తచెరువు, ప్రధాన కాలువలు ఇలా అన్ని రకాలుగా జలవనరుల శాఖకు సంబంధించినవి ఆక్రమణకు గురవుతున్నాయి. మరికొంత మంది అనధికారికంగా నిషేధిత ప్రాంతాల్లో నిర్మాణాలు చేపడుతున్నారు.

కార్యాలయం నుంచి కదలకుండానే
చెరువులు, వాగులు, జలాశయాలు, ఇలా జలవనరులకు ఆనుకుని ఉన్న భూముల్లో పట్టా, లావణి పట్టా, ఇతర ఏరకమైన ప్రైవేటు, ప్రభుత్వ భూములైనా పనులు చేపట్టాలంటే అనుమతులు తీసుకోవాలి. అధికారులు పరిశీలించి, నీటి పారుదల, నిల్వకు సంబంధించి ఎటువంటి ఆటంకం లేదనుకుంటే నిరభ్యంతర పత్రం ఇవ్వాలి. జిల్లాలో ఈ ప్రక్రియ ఆచరణకు నోచుకోవడం లేదు. కార్యాలయం నుంచి కదలకుండానే పత్రాలు జారీ చేస్తున్నారన్న  ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీని వెనుక ఓ ఉన్నతాధికారి ప్రమేయం ఉందని విశ్వసనీయమైన సమాచారం.


పరిశీలించి క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తాం
సుందర్‌, ఈఈ నీటిపారుదల

నంది వాగు బఫర్‌ జోన్‌లో నిర్మాణాలపై ఇప్పటి వరకు ఫిర్యాదు రాలేదు. నిర్మాణాలు చేపట్టడం చట్టరీత్యా నేరం. క్రిమినల్‌ కేసులు నమోదు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. అన్ని పరిశీలించాకే నిరభ్యంతర పత్రం ఇస్తాం.


 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని