అవగాహన కల్పిస్తూ...సైబర్‌ భద్రతకు భరోసానిస్తూ..
eenadu telugu news
Published : 21/10/2021 01:57 IST

అవగాహన కల్పిస్తూ...సైబర్‌ భద్రతకు భరోసానిస్తూ..

● కళాశాలల్లో విస్తృతంగా హ్యాకథాన్ల నిర్వహణ

● ఎథికల్‌ హ్యాకింగ్‌లో విద్యార్థులకు శిక్షణ

ఈనాడు, హైదరాబాద్‌


హ్యాకథాన్‌కు హాజరైన విద్యార్థులు

మీకు తెలియకుండానే మీ పాస్‌వర్డ్‌ వేరొకరికి తెలిసిపోతే..! మీ ఫోన్‌ను హ్యాక్‌ చేసి సమస్త సమాచారం తెలుసుకుంటే..!! అసలు ఇది సాధ్యమేనా..? అలాంటి తరుణంలో ఒక విద్యార్థిగా ఎలా స్పందించాలి.. ఖాతాలను తిరిగి పొందే వీలుందా.. ఇలా ఎన్నో ప్రశ్నలు.. సందేహాలకు హ్యాకథాన్‌ సమాధానంగా నిలుస్తోంది. కళాశాలల్లో రెండు రోజులపాటు జరిగే హ్యాకథాన్లతో విద్యార్థులకు వివిధ రంగాలపై పట్టుచిక్కుతోంది. నగరానికి చెందిన యువకుడు కళాశాలల విద్యార్థులకు సైబర్‌భద్రతపై అవగాహన కల్పిస్తూ ముందుకు సాగుతున్నాడు. అతనే సైటెక్‌ ల్యాబ్స్‌ సీఈవో ముదాల్కర్‌ సందీప్‌.

250 కళాశాలల్లో నిర్వహణ

నగరంలోని ముసారాంబాగ్‌లో సందీప్‌ సైటెక్‌ ల్యాబ్స్‌ కంపెనీ నిర్వహిస్తున్నారు. సైబర్‌ భద్రత, ఫోరెన్సిక్‌ రంగంలో అనుభవం సాధించారు. 2015 నుంచి కళాశాలల్లో హ్యాకథాన్లు ఏర్పాటు చేసి హ్యాకింగ్‌పై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. ఇటీవల ఐదో ఎడిషన్‌లో భాగంగా ఘట్‌కేసర్‌లోని ఏస్‌ కళాశాలలో రెండు రోజుల హ్యాకథాన్‌ నిర్వహించారు. దీనికి 790 మంది విద్యార్థులు హాజరై సైబర్‌ భద్రతపై తర్ఫీదు తీసుకున్నారు. ఆరేళ్లలో 250 ఇంజినీరింగ్‌, డిగ్రీ కళాశాలలకు చెందిన వేలాది మంది విద్యార్థులకు సందీప్‌ అవగాహన కల్పించారు. రెండు నుంచి మూడు రోజులపాటు ఈ-హ్యాక్‌ పేరిట కార్యశాలలు నిర్వహిస్తున్నారు. ఫోన్లు, కంప్యూటర్లు ఎలా హ్యాక్‌ అవుతాయి.. డాటా చోరీ జరిగే తీరు..? ఎలా దుర్వినియోగమవుతోంది..? హ్యాకింగ్‌ జరిగితే ఏం చేయాలి..? ఎలా తెలుసుకోవాలి..? నెట్‌వర్క్‌ను ఎలా రక్షించుకోవాలి.. ఇలా విద్యార్థులకు అవగాహన కల్పించి సమస్యలను పరిష్కరించేలా సూచనలు చేస్తున్నారు.

పోలీసుల విభాగంతో ప్రారంభమై..

బీటెక్‌ ఈసీఈ చదువుతూనే.. ప్రైవేటుగా 11 కంప్యూటర్‌ కోర్సులు చేశారు సందీప్‌. ఇంజినీరింగ్‌ పూర్తయ్యాక ప్రాంగణ నియామకాల్లో ఉద్యోగం వచ్చింది. పోలీసు విభాగంతో అనుసంధానమై నైజీరియన్‌, ఉద్యోగాల మోసాలు, అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తించే అబ్బాయిలను గుర్తించడం తదితర నేరాల్లో నిందితులను గుర్తించడంలో సహకారం అందించారు. 2010, 11లో ఉచితంగా కళాశాలల విద్యార్థులకు అవగాహన కల్పించారు. 2014లో తొలుత తార్నాకలో సైటెక్‌ ల్యాబ్స్‌ ప్రారంభించి.. తర్వాత మూసారంబాగ్‌కు కంపెనీని మార్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి, వరంగల్‌, ప్రకాశం జిల్లాలతోపాటు అహ్మదాబాద్‌, లద్దాఖ్‌లోనూ సైబర్‌ భద్రతపై పోలీసులకు శిక్షణ ఇచ్చారు. కంపెనీ తరఫున విద్యార్థులకు ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

అలా మొదలైంది: సందీప్‌

‘‘2005లో బీటెక్‌ చదువుతున్న సందర్భంలో నా ఆర్క్యూట్‌ అకౌంట్‌ హ్యాక్‌ అయ్యింది. అప్పుడే హ్యాకింగ్‌ పదం తొలిసారిగా విన్నా. అప్పటికే కంప్యూటర్‌ కోర్సులు చేసి ఉండటంతో హ్యాకింగ్‌పై బాగా పరిశోధన చేశా. కొత్త ప్రొగ్రామ్స్‌ తెలుసుకుని సొంతంగా ప్రోగ్రామ్స్‌ రాయడం ప్రారంభించాను. మా నాన్న ముదాల్కర్‌ కాశీవిశ్వనాథం డిప్యూటీ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌గా పనిచేసేవారు. ఒకరోజు మా నాన్నకు తెలిసిన డీఎస్పీ ఇంటికి వచ్చి కేసుల గురించి మాట్లాడుకుంటున్నారు. ఒక అమ్మాయికి ఎవరో అబ్బాయి అసభ్య సందేశాలు పంపిస్తూ వేధింపులకు గురి చేస్తున్నాడని వారి మాటాల్లో విన్నా. ఆ కేసు వివరాలు తెలుసుకుని అతని ఫోన్‌ నంబరు కనిపెట్టడంలో సాయపడ్డాను. ఆ తర్వాత మిగిలిన సైబర్‌ కేసులు ఛేదించే విషయంలో పోలీసులకు ఆ డీఎస్పీ పరిచయం చేశారు. అలా పోలీసు విభాగంతో కలిసి అప్పట్లో చాలావరకు సైబర్‌ నేరాలకు సంబంధించిన కేసులు పరిష్కరించా. అప్పట్లో డీసీపీగా ఉన్న ఆర్‌ ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ సహకారంతో పోలీసు విభాగంలో సైబర్‌ సెల్‌ ప్రారంభించడంలో కీలకపాత్ర పోషించా. ల్యాబ్‌ ఏర్పాటులోనూ సహకారం అందించా.’’ అని సందీప్‌ వివరించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని