బతుకు బండి.. బహు కష్టమండి!
eenadu telugu news
Published : 21/10/2021 03:49 IST

బతుకు బండి.. బహు కష్టమండి!

పెట్రోవాత, నిత్యావసరాల ధరలతో నగరవాసి విలవిల

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌

అంబర్‌పేట్‌లో ఉంటున్న రమేశ్‌ క్యాబ్‌ డ్రైవర్‌. భార్య, ముగ్గురు పాపలతో అద్దె ఇంట్లో కాపురం ఉంటున్నాడు. కరోనా తర్వాత పరిస్థితి తారుమారైంది. ఇంట్లో అందరూ అనారోగ్యానికి గురికావడంతో ఆసుపత్రి బిల్లులకు అప్పులు చేయాల్సి వచ్చింది. కోలుకున్నారనుకున్న సమయంలో ఇంధన ధరలు, గ్యాస్‌, నిత్యావసర సరకుల ధరలు పెరిగిపోవడంతో గుదిబండ పడినట్టయింది. ఇంటి అద్దె, సరకులు, పెట్రోల్‌, నిర్వహణ ఖర్చులు, విద్యుత్తు బిల్లులు, పాలు, ఇతరాలకు మొత్తం కలిపి నెలకు రూ.16వేలు ఖర్చవుతున్నాయి. అతని ఆదాయం రూ.25,000. పాఠశాలకు వెళ్తున్న ఇద్దరు కుమార్తెల ఫీజులకు సగటున నెలకు రూ.4వేలు. గతంతో పోలిస్తే నెలకు రూ.4వేల అదనపు భారం పడింది.

ఖర్చులు పెరుగుతున్నాయి.. ఆదాయం మాత్రం పడిపోయింది. దాదాపు అన్ని వర్గాలను కరోనా దెబ్బకొట్టింది. మార్కెటింగ్‌ ఉద్యోగులు, ప్రైవేటు పాఠశాలల టీచర్లు, మెకానిక్‌లు, ఆటో డ్రైవర్లు, చిరుద్యోగులు, ఇతర వృత్తుల వారిదీ ఇదే పరిస్థితి. ఖర్చులు పెరిగిన స్థాయిలో ఆదాయం పెరగకపోవడంతో అనేక మంది అప్పుల పాలవుతున్నారు. 15 రోజులకోసారి ఏదో ఒక రూపంలో సామాన్యుడిపై భారం పడుతూనే ఉంది.

మధ్య తరగతిపై పిడుగు..
చాలీచాలని జీతాలతో.. అప్పులతో బతుకులు నెట్టుకొస్తున్న వారికి పుండు మీద కారం చల్లినట్లు ధరలు అంతకంతకూ పెరుగుతూ వస్తున్నాయి. ఆగకుండా పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరల వల్ల బండితో రోడ్డెక్కేందుకు భయపెడుతోంటే.. వంటగ్యాస్‌ ధర ఇంట్లో మంట పుట్టిస్తోంది. మధ్య తరగతి ప్రజలకు రోజురోజుకు బతుకు భారంగా మారుతోంది. నిత్యావసరాల ధరలు పరుగులు తీస్తున్నాయి. వంట నూనెలైతే భగ్గుమంటున్నాయి. గతేడాది అక్టోబరులో రూ.646.50 ఉన్న వంట గ్యాస్‌ సిలిండర్‌ ధర ప్రస్తుతం రూ.952 ఉంది. అంటే ఏడాదిలో 44శాతం పెరిగింది. గతేడాది మార్చిలో పెట్రోల్‌ ధర రూ.76.23, డీజిల్‌ ధర రూ.70 ఉండగా బుధవారం పెట్రోల్‌ రూ.110.46, డీజిల్‌ రూ.103.56గా ఉంది. అంటే ఏడాదిలో దాదాపు 45శాతం భారం పెరిగింది. మధ్య తరగతి కుటుంబంపై పప్పులు, వంటనూనెల రూపంలోనే నెలకు రూ.400 వరకు భారం పడుతోంది. సగటున నెలకు 3 లీటర్ల నూనె వినియోగించే కుటుంబానికి గతంలో రూ.311 అయ్యేది, ప్రస్తుతం రూ.460 వరకు ఖర్చవుతోంది.


35 నుంచి 40శాతం  ధరలు పెరిగాయి
- పి.నర్సింహారావు, ఎస్సార్‌నగర్‌

కొవిడ్‌ సమయంలో ఉద్యోగం పోయింది. ప్రస్తుతం ఉద్యోగం వెతుక్కుంటున్నా. నెలకు ప్రతి వస్తువుపై 20 నుంచి 30శాతం పెరిగింది. కూరగాయల ధరలు బాగా పెరిగాయి. సరుకులవి 15శాతం పెరిగాయి. ఇంట్లో నలుగురు కుటుంబ సభ్యులం.. గతంలో రూ.6వేలున్న ఖర్చు ఇప్పుడు రూ.8వేలు దాటింది. ద్విచక్ర వాహనం ఉండటంతో నెలకు 10 లీటర్ల పెట్రోల్‌కు రూ.1,100 ఖర్చవుతోంది. ఇప్పుడు నెలకు రూ.300 అదనపు భారం పడుతోంది. కూరగాయలకు వారంలో రూ.350 నుంచి రూ.400 ఖర్చయ్యేది. ప్రస్తుతం రూ.600 అవుతోంది.


ప్రభుత్వాలే చర్యలు తీసుకోవాలి
- డా.సి.కృష్ణారెడ్డి, హెచ్‌సీయూ ఆచార్యుడు

సరకులు, ఇంధన ధరలు సగటు మనిషికి పెను భారంగా మారాయి. అనవసర ఖర్చులొద్దు. మద్యం, విహారాలకు, వినోదాలకు చేసే ఖర్చులను సగం వరకు తగ్గించుకోవాలి. ప్రజా రవాణాను వినియోగించాలి. ఖాళీ సమయంలో తాత్కాలిక ఉద్యోగాలు చేస్తూ ఆదాయం పెంచుకోవాలి. ధరల నియంత్రణలో ప్రభుత్వాలు తీసుకునే చర్యలే కీలకం. పీడీఎస్‌ ద్వారా అందుబాటు ధరల్లో వంటనూనెలు అందించాలి. ఇంధనాలపై ప్రభుత్వాలు పన్ను తగ్గించాలి.


 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని