చేతులు కాలితేనే.. చేతలు చూపిస్తారా?
eenadu telugu news
Published : 21/10/2021 03:49 IST

చేతులు కాలితేనే.. చేతలు చూపిస్తారా?

గాంధీలో ప్రమాదాల నివారణకు ఏర్పాటు చేసిన ఫైర్‌ సెక్యూరిటీ బాక్సు పరిస్థితి

విద్యుదాఘాతంతో మంటలు చెలరేగడంతో భయంతో సిబ్బంది పరుగులు

ఈనాడు, హైదరాబాద్‌- గాంధీ ఆసుపత్రి, న్యూస్‌టుడే: నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అగ్నిమాపక వ్యవస్థపై మరోసారి చర్చ మొదలైంది. బుధవారం తెల్లవారుజామున గాంధీలో విద్యాదాఘాతంతో మంటలు చెలరేగడంతో రోగులు, సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. అగ్నిప్రమాదాలు సంభవించిన సమయంలో వెంటనే రంగంలోకి దిగేలా ప్రభుత్వ ఆసుపత్రుల ప్రాంగణంలోనే అగ్నిమాపక కేంద్రాలు ఏర్పాటుచేయాలని అధికారులు నిర్ణయించారు. తొలుత ఉస్మానియా, గాంధీ, నిలోఫర్‌ ఆసుపత్రులకు ప్రత్యేకంగా అగ్నిమాపక కేంద్రాలు మంజూరయ్యాయి. ప్రస్తుతం గాంధీలో మాత్రమే ఈ కేంద్రం అందుబాటులోకి వచ్చింది. మిగతా ఆసుపత్రుల్లో స్థలం ఎంపిక.. షెడ్డుల నిర్మాణ పనులు పూర్తిచేశారు. నగరంలోని గాంధీ, ఉస్మానియా, నిలోఫర్‌, పేట్లబుర్జు, ఛాతి, మానసిక వైద్యశాల కీలకమైనవి. ఇక్కడ ఏదైనా అగ్ని ప్రమాదం జరిగితే నష్టం ఊహించడం కష్టం. ప్రస్తుతం నిధుల కొరత కారణంగా ఒక్క పని ముందుకు సాగడం లేదని అధికారులు వాపోతున్నారు. 

గాంధీలో ఇదీ పరిస్థితి
గాంధీలో 20ఏళ్ల కిందట ఏర్పాటుచేసిన అగ్నిమాపక వ్యవస్థ ఇప్పటికీ ఆధునికీకరణకు నోచుకోలేదు. ఆధునికీకరించాలని లేకుంటే ముప్పు తప్పదని ఇప్పటికే ముగ్గురు సూపరింటెండెంట్‌లు ప్రతిపాదనలు వైద్యారోగ్యశాఖకు పంపారు. అక్కడి నుంచి మాత్రం స్పందన కరవైంది. గాంధీలో ఈ ఏడాదిలో రెండోసారి షార్ట్‌  సర్య్కూట్‌తో మంటలు వ్యాపించాయి.
* గాంధీలో కొత్త భవనం 2003లో అందుబాటులోకి రాగా.. అప్పటి అవసరాల మేరకు రూ.50లక్షలు వెచ్చించి అగ్నిమాపక పరికరాలు ఏర్పాటుచేశారు. ఏళ్లుగా వాటి నిర్వహణను పట్టించుకోకపోవడంతో అవి మూలకు చేరాయి. ప్రస్తుతం కరోనాతోపాటు ఇతర రోగులకు చికిత్సలు అందిస్తున్నారు. ఇంత ప్రాధాన్యత ఉన్న ఆసుపత్రిలో అగ్నిమాపక వ్యవస్థ లేకపోవడం దయనీయం. కేవలం 2.5కోట్లతో ఆధునికీకరించే వీలుంది.

ఉస్మానియాలో..
రాష్ట్రంలో అతి పెద్దాసుపత్రి అయిన ఉస్మానియాలోనూ అగ్నిమాపక చర్యలు అటకెక్కాయి. అగ్నిమాపక కేంద్రంతోపాటు ఆసుపత్రిలో వివిధ పరికరాల ఏర్పాటు కోసం గతంలో రూ.1.66 కోట్లతో పంపిన ప్రతిపాదనలు బుట్టదాఖలయ్యాయి. అగ్నిమాపక కేంద్రాల ఏర్పాటు కోసం ఉస్మానియాలో షెడ్డు నిర్మించి వదిలేశారు. ఇతర పనులు మాత్రం ముందుకు సాగడం లేదు. పూర్తి స్థాయిలో అగ్నిమాపక యంత్రం అందుబాటులోకి రావాలంటే షెడ్డుతోపాటు ఇతర మౌలిక వసతులు కల్పించాలి. కనీసం 40 వేల లీటర్ల సామర్థ్యంతో ఉన్న నీటి సంపు అవసరం ఉంటుంది.


 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని