మళ్లీ క్రియాశీలక రాజకీయాల్లోకి ప్రజాశాంతి పార్టీ: డా.కేఏ పాల్‌
eenadu telugu news
Published : 24/10/2021 02:01 IST

మళ్లీ క్రియాశీలక రాజకీయాల్లోకి ప్రజాశాంతి పార్టీ: డా.కేఏ పాల్‌

సమావేశంలో పార్టీ కోర్‌ కమిటీ సభ్యులు, వర్చువల్‌గా(ల్యాప్‌టాప్‌లో) మాట్లాడుతున్న కేఏ పాల్‌

అమీర్‌పేట, న్యూస్‌టుడే: దేశం, రాష్ట్రాల్లో నెలకొన్న అస్థిరత్వం దృష్ట్యా ప్రజాశాంతి పార్టీని మళ్లీ క్రియాశీలక రాజకీయాల్లోకి తీసుకురానున్నట్లు ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకులు డా.కేఏ పాల్‌ తెలిపారు. అమీర్‌పేట అపరాజిత కాలనీలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో అమెరికా నుంచి వర్చువల్‌ విధానంలో కేఏ పాల్‌ మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేయడం కోసం సంసిద్ధం అవుతున్నామన్నారు. తెలంగాణలో పార్టీని పటిష్ఠపరచడం కోసం నిపుణులు, అనుభవజ్ఞులైన కోర్‌ కమిటీ సభ్యులను ఎంపిక చేశామన్నారు. వారసత్వ రాజకీయాలకు తమ పార్టీ వ్యతిరేకమన్నారు. కేవలం తెలుగు రాష్ట్రాలే కాకుండా జాతీయస్థాయిలో పార్టీ కార్యక్రమాలను విస్తృతపరిచేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు.

తెలంగాణలోని పాత 10 జిల్లాల పరిధిలో నియోజకవర్గం, మండల, గ్రామ, డివిజన్‌, బూత్‌స్థాయి కమిటీలను ఏర్పాటుచేయాలని కోర్‌ కమిటీ సభ్యులకు సూచించారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పార్టీలు కుల, మతాల మధ్య చిచ్చుపెట్టి సమాజాన్ని నాశనం చేస్తున్నాయని ఆరోపించారు. ప్రస్తుతం ఉన్న పార్టీల నేతలు పరస్పరం అవినీతి ఆరోపణలతో దూషించుకోవడం తప్ప ప్రజలకు చేసిందేమి లేదన్నారు. అవినీతి నిర్మూలన, వారసత్వ రాజకీయాలకు స్వస్తి పలకడం, రాష్ట్రాలపై ఉన్న అప్పుల భారం తీర్చడం, కులమతాలకతీతంగా అభివృద్ధి చేయడం ప్రజాశాంతి పార్టీతోనే సాధ్యమవుతుందని చెప్పారు. సమావేశంలో ప్రజాశాంతి పార్టీ కోర్‌ కమిటీ సభ్యులు దానమయ్య, సత్తియా గోవింద్‌, జ్యోతి బేగల్‌, డీసీ రోశయ్య, ప్రకాశం తదితరులు పాల్గొన్నారు. వివిధ జిల్లాలకు చెందిన పలువురు ఆ పార్టీలో చేరారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని