ప్రజల సమీకరణ బాధ్యత మంత్రులు, ఎమ్మెల్యేలదే
eenadu telugu news
Published : 24/10/2021 02:08 IST

ప్రజల సమీకరణ బాధ్యత మంత్రులు, ఎమ్మెల్యేలదే

రంగారెడ్డి జిల్లా నియోజకవర్గాల సమీక్షలో కేటీఆర్‌


సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్‌

ఈనాడు, హైదరాబాద్‌: వరంగల్‌లో వచ్చే నెల 15న జరిగే తెలంగాణ విజయగర్జన సభకు కార్యకర్తలు, ప్రజలను తరలించే బాధ్యత మంత్రులు, ఎమ్మెల్యేలదేనని పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీ రామారావు తెలిపారు. సమన్వయంతో పనిచేసి, సభ విజయవంతానికి కృషి చేయాలన్నారు. శనివారం అయిదో రోజు ఆయన తెలంగాణ భవన్‌లో ఉమ్మడి మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి జిల్లాల్లోని షాద్‌నగర్‌, ఎల్బీనగర్‌ తదితర నియోజకవర్గాల సమీక్ష నిర్వహించారు. మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, సబితారెడ్డి, పార్టీ సెక్రటరీ జనరల్‌ కె.కేశవరావు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితరులు పాల్గొన్నారు. కేటీఆర్‌ మాట్లాడుతూ, విజయగర్జన సభకు వచ్చే ప్రజలకు ఏ లోటుపాట్లు రాకుండా చూడాలని, సభ అనంతరం క్షేమంగా ఇళ్లకు చేర్చాలన్నారు.

రాజాసింగ్‌ మాటల గారడీ వద్ధు.. గోషామహల్‌ భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్‌ మాటల గారడీని మానాలని, మంచి పనులు చేసి పేరు తెచ్చుకోవాలని మంత్రి కేటీఆర్‌ శనివారం ట్విటర్‌లో సూచించారు. తమ ఇంటికి సమీపంలోని ఓ పెట్రోల్‌ బంకు వద్ద ఆగి.. పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై ప్రజలు ఏమంటున్నారో తెలుసుకోవాలన్నారు.భాజపా పాలనలో జీడీపీ అంటే గ్యాస్‌, డీజిల్‌, పెట్రోల్‌ ధరలు పెరగడమా? అని ప్రశ్నించారు. తనతో బైక్‌పై పర్యటించి పాతనగర పరిస్థితిని తెలుసుకోవాలని కేటీఆర్‌కు రాజాసింగ్‌ ట్విటర్‌లో సవాలు చేయగా.. మంత్రి పైవిధంగా సమాధానమిచ్చారు.


పుత్లీబౌలీ వద్ద సీఎం కేసీఆర్‌ చిత్రాలతో ఫ్లెక్సీలు

తెరాస ప్లీనరీ సమావేశాలు.. ట్రాఫిక్‌ మార్గదర్శకాలు..

రాయదుర్గం, న్యూస్‌టుడే: ఈ నెల 25న మాదాపూర్‌ హైటెక్స్‌లో తెరాస ప్లీనరీ సమావేశాల సందర్భంగా ట్రాఫిక్‌ నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు సైబరాబాద్‌ డీసీపీ (ట్రాపిక్‌) ఎస్‌ఎం విజయ్‌కుమార్‌ తెలిపారు. సమస్యలు తలెత్తకుండా మాదాపూర్‌, పరిసర ప్రాంతాల్లో మార్గదర్శకాలు అమలు చేస్తున్నామన్నారు.

ప్రత్యామ్నాయ దారులివీ..

* మాదాపూర్‌ నీరుస్‌ నుంచి గచ్చిబౌలి జంక్షన్‌ వైపునకు వచ్చే వాహనదారులు అయ్యప్ప సొసైటీ(సీఓడీ), దుర్గం చెరువు మీదుగా మాదపూర్‌ వైపునకు, ఇనార్బిట్‌ మాల్‌, ఐటీసీ కోహినూర్‌ హోటల్‌, ఐకియా, బయోడైవర్సిటీ జంక్షన్‌ మీదుగా గచ్చిబౌలీకి.. అదే దారిలో నీరుస్‌ వైపునకు వెళ్లవచ్ఛు

* మియాపూర్‌, హఫీజ్‌పేట్‌, కొత్తగూడ వైపు నుంచి హైటెక్‌ సిటీ, సైబర్‌ టవర్‌, జూబ్లీహిల్స్‌ వైపునకు వచ్చే ట్రాఫిక్‌ రోలింగ్‌ హిల్స్‌, ఏఐజీ ఆసుపత్రి, ఐకియా, ఇనార్బిట్‌ మాల్‌, దుర్గం చెరువు రోడ్డు మీదుగా ఉన్న మార్గాన్ని అనుసరించాలి. సైబర్‌ టవర్‌ జంక్షన్‌ రోడ్డులో రాకపోకలకు అనుమతి లేదు.

* రాంచంద్రపురం, చందానగర్‌ ప్రాంతాల నుంచి మాదాపూర్‌, గచ్చిబౌలి వైపు వచ్చే వాహనదారులు బీహెచ్‌ఈఎల్‌, నల్లగండ్ల, హెచ్‌సీయూ, ట్రిపుల్‌ ఐటీ, గచ్చిబౌలి రోడ్డు మార్గాన్ని వినియోగించుకుని ఆల్విన్‌, కొండాపూర్‌ రోడ్డులో రాకపోకలు పరిహరించాలి..

* మాదాపూర్‌ జోన్‌లో భారీ వాహనాల రాకపోకలను నియంత్రిస్తారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని