Crime News: తీవ్రంగా కొట్టి.. గొంతు కోసి వ్యక్తి హత్య.. భార్యపై అనుమానం
eenadu telugu news
Updated : 24/10/2021 13:09 IST

Crime News: తీవ్రంగా కొట్టి.. గొంతు కోసి వ్యక్తి హత్య.. భార్యపై అనుమానం


ముస్కాన్‌ పటేల్‌ కుటుంబం

హయత్‌నగర్‌, న్యూస్‌టుడే: ఓ వ్యక్తిని దారుణంగా కొట్టి, హత్య చేసి మృతదేహంపై కారంపొడి చల్లి కారులో వదిలివెళ్లిన ఘటన హయత్‌నగర్‌లో కలకలం రేపింది. పోలీసుల కథనం మేరకు.. విజయవాడ జాతీయ రహదారిలో హయత్‌నగర్‌ సమీపాన ఓ కారులో మృతదేహం ఉన్నట్లు స్థానికులు శనివారం ఉదయం పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనా స్థలంలో పోలీసులు వచ్చి పరిశీలించగా ఓ వ్యక్తిని హత్య పడేసినట్లు గుర్తించారు. డాగ్‌స్క్వాడ్‌, క్లూస్‌ టీం ఆధారాలు సేకరించింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా శుక్రవారం అర్ధరాత్రి తర్వాత వ్యక్తిని దారుణంగా కొట్టి, గొంతు కోసి హత్య చేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని శివార్లలో పడేసేందుకు తీసుకెళ్తుండగా హయత్‌నగర్‌ రేడియోస్టేషన్‌ రాగానే కారు మొరాయించడంతో కారంపొడి చల్లి పారిపోయారు. కారులో లభించిన ఆర్‌సీ ఆధారంగా మృతుడు సైదాబాద్‌కు చెందిన మహమ్మద్‌ ముస్కాన్‌ పటేల్‌గా నిర్ధారించారు.

పోలీసుల అదుపులో నిందితులు!

మహారాష్ట్రలోని సోలాపూర్‌కు చెందిన ముస్కాన్‌ పటేల్‌(45), భార్య ఫిర్దోద్‌ బేగంతో కలిసి సైదాబాద్‌లోని సపోటాబాగ్‌లో అద్దెకుంటున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ముగ్గురు కుమారులు. ముస్కాన్‌ పటేల్‌ లారీ డ్రైవర్‌గా, ఫిర్దోద్‌ బేగం మండీ నడుపుతున్నారు. ఫిర్దోద్‌ బేగానికి వరసకు మరిది అయిన హామీద్‌ పటేల్‌తో రెండేళ్లుగా వివాహేతర సంబంధం ఉన్నట్లు ముస్కాన్‌ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అడ్డు తొలగించుకునేందుకే ఫిర్దోద్‌ బేగం, హామీద్‌, మరో వ్యక్తి కలిసి అర్ధరాత్రి ముస్కాన్‌ పటేల్‌ గొంతుకోసి హత్య చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల అదుపులో ముగ్గురు నిందితులు ఉన్నట్లు సమాచారం.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని