పశువుల కొట్టంలో గంజాయి సాగు
eenadu telugu news
Published : 24/10/2021 02:08 IST

పశువుల కొట్టంలో గంజాయి సాగు

జీడిమెట్ల, న్యూస్‌టుడే: పశువులకు వేసే దాణాలో గంజాయి మొక్కలు కలిపితే ఎదుగుదల శక్తి పెరుగుతుందని ఎవరో చెప్పిన మాటల్ని నమ్మి కటకటాల పాలయ్యాడు ఓ వ్యక్తి. పశువుల కొట్టంలో గంజాయి మొక్కల్ని సాగుచేస్తున్నట్లు విశ్వసనీయ సమచారం అందడంతో జీడిమెట్ల, ఎస్‌వోటీ పోలీసులు శనివారం దాడులు చేశారు. 20 మొక్కల్ని స్వాధీనం చేసుకొని అతణ్ని రిమాండ్‌కు తరలించారు. ఇన్‌స్పెక్టర్‌ కె.బాలరాజు వివరాల మేరకు.. గాజులరామారం మెట్టుకానిగూడకు చెందిన సప్పిడి కృష్ణారెడ్డి స్థానికంగా ఉన్న పశువుల కొట్టంలో గేదెలను పెంచుతున్నారు. వాటికి వేసే దాణాలో గంజాయి కలిపితే పాలు ఎక్కువ ఇవ్వడంతో పాటు ఎదుగుదల శక్తి పెరుగుతుందని ఎవరో చెప్తే విన్నారు. కొన్ని నెలల నుంచి పశువుల కొట్టంలోనే మొక్కల్ని సాగు చేస్తున్నారు. నిందితుడు ఇతరులకు విక్రయిస్తున్నట్లు ఎలాంటి ఆధారాలు దొరకలేదని ఇన్‌స్పెక్టర్‌ పేర్కొన్నారు. కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని