వేర్వేరు చోట్ల గంజాయి స్వాధీనం
eenadu telugu news
Published : 27/10/2021 01:45 IST

వేర్వేరు చోట్ల గంజాయి స్వాధీనం


నిందితుడిని చూపుతున్న ఎక్సైజ్‌ పోలీసులు

మెదక్‌, చిన్నశంకరంపేట, న్యూస్‌టుడే: సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో ఆబ్కారీ అధికారులు గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నారు. విక్రేతలను గుర్తించి కేసులు నమోదు చేస్తున్నారు. జిల్లాలో పలు చోట్ల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మనూరు మండలం మాయికోడ్‌కు చెందిన కమ్మరి బ్రహ్మయ్య ద్విచక్రవాహనంపై మత్తు పదార్థాన్ని తీసుకెళ్తుండగా ఆబ్కారీ అధికారులు సోమవారం రాత్రి రేగోడ్‌ వద్ద పట్టుకున్నారు. అతడి వద్ద 300 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎక్సైజ్‌ పర్యవేక్షకుడు రజాక్‌ తెలిపారు. మంగళవారం సంగారెడ్డి జిల్లా కొత్లాపూర్‌కు చెందిన వినోద్‌కుమార్‌, రేగోడ్‌ మండలం దోసపల్లికి చెందిన శ్రీకాంత్‌తో కలిసి ద్విచక్రవాహనంపై గంజాయి తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నారు. శ్రీకాంత్‌ పరారవగా, వినోద్‌ను అదుపులోకి తీసుకున్నారు. 200 గ్రాములు స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్‌ సీఐ గోపాల, ఎస్సై మోబిన్‌ ఉన్నారు.

* చిన్నశంకరంపేట మండలం గవ్వలపల్లిలో ఎండు గంజాయిని విక్రయిస్తున్న యువకుడిని అరెస్టు చేసినట్లు స్థానిక ఎస్‌ఐ గౌస్‌ తెలిపారు. వివరాలు ఇలా.. విశ్వసనీయ సమాచారం మేరకు గవ్వలపల్లి చౌరస్తాలో వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ యువకుడిని పట్టుకొని విచారించగా అసలు విషయం తెలిసింది. అతడి వద్ద 5 ఎండు గంజాయి ప్యాకెట్లు (50గ్రాములు) దొరికాయి. గవ్వలపల్లి పరిధిలోని అగ్రహారం గ్రామానికి చెందిన గౌడ కృష్ణ ఇంటి వద్ద మొక్కలు పెంచుతున్నట్లు సదరు యువకుడు చెప్పడంతో అక్కడికి వెళ్లి వాటిని ధ్వంసం చేశారు. వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ వివరించారు.

ఒకరి రిమాండ్‌..

సంగారెడ్డి అర్బన్‌: ఎండు గంజాయి సరఫరా చేసిన విస్లావత్‌ అనిల్‌నాయక్‌(21)ను అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించామని ఆబ్కారీ సీఐ మధుబాబు గౌడ్‌ తెలిపారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని