ఆ సీఐ రూటే సెపరేటు!
eenadu telugu news
Updated : 27/10/2021 13:02 IST

ఆ సీఐ రూటే సెపరేటు!

రూ.200 కోట్ల భూ వ్యవహారంతో వెలుగులోకి

ఏకంగా బాధితులపైనే హత్యాయత్నం కేసు

ఈనాడు, హైదరాబాద్‌: అక్కడ ఎకరం రూ.10కోట్లకు పైమాటే.. మొత్తం 20 ఎకరాల వ్యవహారం. ఇంకేముంది.. ‘సెటిల్‌’ చేస్తే భారీగానే గిట్టుబాటవుతుందని ఆ సీఐ లెక్కలు వేసుకున్నాడు. అవతలి వైపు వ్యక్తులతో కుమ్మక్కై ఏకంగా బాధితులపైనే ‘హత్యాయత్నం’ కేసు నమోదు చేసి ముప్పుతిప్పలు పెట్టారు. సైబరాబాద్‌ పోలీసు ఉన్నతాధికారులు సదరు సీఐపై తాజాగా వేటు వేశారు.

చంపాలనుకున్నారని ‘వాంగ్మూలం’ ఇప్పించి..

ఓ బిల్డర్‌ డెవలప్‌మెంట్‌ కోసం సుమారు 20 ఎకరాలను పట్టాదారు నుంచి తీసుకున్నారు. ప్రహరీ నిర్మాణం మొదలుపెట్టారు. ఆ భూమి తనదంటూ ఓ వ్యక్తి వచ్చి పనులు ఆపించారు. కలెక్టర్‌ జారీ చేసిన ప్రొసీడింగ్స్‌, ఇతరత్రా ధ్రువీకరణ పత్రాలను బిల్డర్‌ ఆ వ్యక్తికి చూపించారు. ఇక్కడినుంచి కథ ఆ సీఐ దగ్గరికి చేరింది. బిల్డర్‌ తరఫున అక్కడ పనులు చేయిస్తున్న మేనేజర్‌పై ‘ట్రెస్‌పాస్‌’ కేసు పెట్టించారు. సదరు బిల్డర్‌.. ఆ వ్యక్తిని చంపించేందుకు కుట్ర చేసినట్లు మేనేజర్‌తోనే వాంగ్మూలం ఇప్పించారు. ఆ రికార్డుతో కేసును ‘హత్యాయత్నం’గా మార్చారు. సదరు బిల్డర్‌, మరి కొందర్ని నిందితులుగా సీఐ చేర్చాడు.

ప్రజాప్రతినిధి ఆగ్రహం వ్యక్తం చేసినా..

హత్యాయత్నం కేసుతో కంగుతిన్న సదరు బిల్డర్‌.. కీలక ప్రజా ప్రతినిధిని ఆశ్రయించారు. జరిగిన విషయం తెలుసుకుని సదరు నేత పోలీసు ఉన్నతాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు ఈ వ్యవహారంపై విచారణ బాధ్యతను ఓ ఏసీపీకి అప్పగించారు. నెలలు గడిచినా విచారణ ముందుకు సాగలేదు. మరోసారి సదరు బిల్డర్‌ ఉన్నతాధికారులను ఆశ్రయించడంతో విచారణ పట్టాలెక్కింది. అవతలి వైపు వ్యక్తితో కుమ్మక్కై ఆ సీఐ ఉద్దేశపూర్వకంగానే ఇదంతా చేసినట్లు తేలడంతో ‘వేటు’ వేశారు. సదరు సీఐ పలు భూ వివాదాల్లోనూ తలదూర్చినట్టు వెల్లడయ్యింది. చెప్పినట్టు వినలేదంటూ ఓ వృద్ధుడిపై పీడీ చట్టం కూడా ప్రయోగించినట్లు వెలుగులోకొచ్చింది.

కొసమెరుపు ఏమిటంటే.. 20 ఎకరాల భూగొడవ ప్రాంతం సదరు సీఐ పరిధిలోకి కాదు.. మరో ఠాణా పరిధిలోకొస్తుందని తేలడంతో ఉన్నతాధికారులు అవాక్కయ్యారు. ఆ సీఐ బాధితులు ఒక్కొక్కరుగా ఇప్పుడు ఉన్నతాధికారుల వద్దకు వరుస కడుతున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని