’గాంధీ‘లో నత్తనడకన విద్యుత్‌ పునరుద్ధరణ..
eenadu telugu news
Published : 27/10/2021 03:37 IST

’గాంధీ‘లో నత్తనడకన విద్యుత్‌ పునరుద్ధరణ..

గాంధీఆసుపత్రి, న్యూస్‌టుడే: గాంధీ ఆసుపత్రిలో విద్యుత్‌ పునరుద్ధరణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఆసుపత్రిలో జరిగిన అగ్ని ప్రమాదం స్వల్పమైందేననీ, ఎవరికీ నష్టం వాటిల్లలేదని యంత్రాంగం ప్రకటించింది. వారం కావస్తున్నా పునరుద్ధరణ పనులు నెమ్మదిగా సాగుతుండడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈనెల 20న సెల్లారులోని విద్యుత్‌ రూమ్‌లో సంభవించిన విద్యుదాఘాతం నాలుగో అంతస్తు వరకు వ్యాపించగా.. ఆసుపత్రిలో విద్యుత్‌ సరఫరాను పూర్తిగా నిలిపివేసి మంటలు అదుపులోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఆసుపత్రిలో రెండు బ్లాక్‌లుగా విభజిస్తూ విద్యుత్‌ కనెక్షన్లు ఇవ్వగా, ప్రమాదం జరిగిన ప్రాంతం నార్త్‌ బ్లాక్‌లో ఉండడంతో సౌత్‌బ్లాక్‌కు ముందుగా విద్యుత్‌ సరఫరాను అందించారు. విద్యుదాఘాతంతో ఫ్యూజుబాక్సులు, ఎనిమిదో అంతస్తు వరకు విస్తరించిన కేబుళ్లన్నీ కాలిపోయాయి. ముందుగా చీకట్లను తొలగించాలనే ఉద్దేశంతో అన్ని ప్రాంతాల్లో సింగిల్‌ ఫేజ్‌ కనెక్షన్లద్వారా దీపాలు వెలిగేలా చేశారు. వార్డులు, పరిపాలనా విభాగాల్లో ఫ్యాన్లు తిరిగేలా పునరుద్ధరించారు. సెల్లారు నుంచి ఎనిమిదో అంతస్తు వరకు కాలిపోయిన ఫ్యూజ్‌బాక్సులు, కేబుళ్ల లింకుబాక్సులు, కేబుల్‌ వైర్లు తదితర వాటిని అమర్చాల్సి ఉండగా ఆ పనులన్నీ మరీ నత్తనడకన సాగుతున్నాయి. ఎంతలేదన్నా మరో వారం పట్టే అవకాశాలున్నట్లు సమాచారం.

నిర్వహణ చూసేవారేరీ?

సెల్లారుతోపాటు 8 అంతస్తులు, వందల గదులు, అందులోని విద్యుత్‌ వ్యవస్థ నిర్వహణను చూసేందుకు సరిపడా సిబ్బంది లేని కారణంగా తరచూ అగ్ని ప్రమాదాలు జరుతున్నాయని తాజాగా వెల్లడైంది. ప్రస్తుతం గ్రేడ్‌-2లో ఒక్కరే ఎలక్ట్రీషియన్‌ పనిచేస్తున్నారు. అనధికారికంగా మరో పది మంది విధులు నిర్వహిస్తున్నా.. నిపుణులు కాకపోవడం గమనార్హం. నిపుణులుంటూ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రమాదాలను పసిగడుతూ అవసరమైన చర్యలు తీసుకునేందుకు వీలుంటుంది. ఈ ఏర్పాట్లు లేని కారణంగానే రెండేళ్లల్లో పది అగ్ని ప్రమాదాలు జరిగి పెద్దమొత్తంలోనే నష్టం వాటిల్లింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని