ధర.. కుత కుత
eenadu telugu news
Updated : 27/10/2021 13:16 IST

ధర.. కుత కుత

కూరగాయ వ్యాపారుల మాయాజాలంతో కొనుగోలుదారుల బెంబేలు

ఈనాడు- సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి

వ్యవసాయ విశ్వవిద్యాలయ అంచనా ప్రకారం రోజుకు నగరంలో ఒక వ్యక్తి తినే కూరగాయలు: 269 గ్రాములు

గ్రేటర్‌లో ఏడాదికి అవసరమైనవి: 722 మెట్రిక్‌ టన్నులు

పండించిన కూరగాయలకు గిట్టుబాటు ధర లభించక రైతులు అప్పుల పాలవుతుంటే మరోవైపు లక్షలమంది వినియోగదారులు నిలువు దోపిడీకి గురవుతున్నారు. రైతు నుంచి వ్యాపారులు కొనుగోలు చేసే రేటుకు, అదే బహిరంగ మార్కెట్లోకి వచ్చేటప్పటికి ధర కేజీకి ఏకంగా రూ.25 నుంచి రూ.35 వరకు వ్యత్యాసం కనిపిస్తోంది. నెల రోజులుగా రాజధాని బహిరంగ మార్కెట్‌లో ముఖ్యమైన కూరగాయల ధరలు రూ.50 నుంచి రూ.80 వరకు పలుకుతున్నాయి. దీంతో ఇదివరకు కిలోల లెక్కన కొనుగోలు చేసే వారు ఇప్పుడు అర, పావు కేజీ కొనుగోలు చేయాల్సిన పరిస్థితి. మార్కెటింగ్‌ అధికారులు నియంత్రణ చర్యలు తీసుకోకపోవడంపై వినియోగదారులు మండిపడుతున్నారు.

ఆదివారం వస్తే..

భారీ వర్షాల వల్ల ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే కూరగాయలు కూడా తగ్గిపోయాయి. దీంతో బడా వ్యాపారులు నేరుగా రైతుల దగ్గరకు వెళ్లి కొనుగోలు చేసి నగరానికి తీసుకువస్తున్నారు. ఆ తర్వాత ఇష్టారీతిన రేట్లు నిర్ణయించి విక్రయిస్తున్నారు. ప్రధానంగా లక్షలమంది నగర ప్రజలు ఆదివారం మార్కెట్లోకి వచ్చి కొనుగోలు చేస్తుంటారు. ఆ రోజు ధరలు విపరీతంగా పెరిగిపోయేలా ధరలను నిర్ణయిస్తున్నారు. ‘ఈనాడు’ ప్రతినిధి రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల పరిధిలోని కూరగాయల సాగు చేస్తున్న రైతులను ప్రశ్నించినప్పుడు బహిరంగ మార్కెట్‌లో కూరగాయల ధరలు చాలా అధికంగా ఉన్నా కూడా తమకు మాత్రం మద్దతు ధర లభించడం లేదని వాపోయారు.

చేతులు మారే క్రమంలో..

ఇంతగా ధరలు పెరగడానికి కారణం రైతుల నుంచి కొనుగోలు చేసిన కూరగాయలు రెండు మూడు చేతులు మారడమే. ఈ క్రమంలో ఒక్కో వ్యాపారి తమ లాభాలను అధికంగా వేసుకోవడంతో వినియోగదారుల దగ్గరకు వచ్చేటప్పటికి రేటు విపరీతంగా పెరుగుతోంది. బహిరంగ మార్కెట్‌తో పోలిస్తే రైతుబజార్లలో ధర కొంత తేడా కన్పించడం ఒక్కటే వినియోగదారులకు ఊరట. ఇటీవల భారీగా డీజిల్‌ ధరలు పెరగడంతో రవాణా భారం అధికమవడం వల్లే కూరగాయల రేట్లు కూడా పెరుగుతున్నాయని బడా వ్యాపారులు చెబుతున్నారు.

* ఉల్లిపాయల ధరలు కూడా రెండు నెలలుగా తగ్గడం లేదు. కర్నూలు హోల్‌సేల్‌ మార్కెట్‌లో రైతుకు కేజీ రూ.20 లభిస్తుంటే అదే హైదరాబాద్‌లో పూర్తిగా ఆరినవి కాస్త అటుఇటుగా కేజీ రూ.50 పలుకుతోంది.

సాగు తగ్గడంతో..

* రంగారెడ్డి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, మేడ్చల్‌, యాదాద్రి, మహబూబ్‌నగర్‌ జిల్లాల నుంచి రాజధానికి కూరగాయల సరఫరా జరుగుతోంది.

* రంగారెడ్డి జిల్లాలో గతేడాది 17,772 ఎకరాల్లో సాగవ్వగా.. ఈసారి 14,086 ఎకరాల్లోనే కూరగాయలు సాగయ్యాయి.

* మేడ్చల్‌ జిల్లాలో 3500 ఎకరాల్లో కూరగాయల పంటలు సాగవుతున్నాయి.

* సీజన్‌లో కురిసిన భారీ వర్షాలతో టమాటా, క్యారెట్‌, చిక్కుడు, క్యాబేజీ, బీన్స్‌ వంటివి పాడైపోయాయి.

* కూరగాయల దిగుమతి కొంతమేర తగ్గడంతో వ్యాపారులు దీన్ని అవకాశంగా మార్చుకుని నిలువు దోపిడీకి సిద్ధమయ్యారు.


డీజిల్‌ ధరలు పెరగడంతో ఒక్కో లోడ్‌కు రూ.500పైగా భారం పడుతోంది. అది కాయగూరల ధరల పెరుగుదలకు కారణమవుతోందని వ్యాపారులు చెబుతున్నారు.


బడ్జెట్‌ తలకిందులవుతోంది: ఎ.శిరీష, ప్రైవేటు ఉద్యోగిని, సోమిరెడ్డినగర్‌

గతంలో కూరగాయల నెలకు రూ.2000 ఖర్చు చేస్తే ఇప్పుడు రెట్టింపు వ్యయం చేయాల్సి వస్తోంది. రెండు రోజుల కిందట నాలుగు రకాల కూరగాయలు, ఉల్లిపాయలు కొనుగోలు చేస్తే రూ.500 ఖర్చైపోయింది. ఇలా ధరలు పెరుగుతూ పోతే రెక్కాడితే కాని డొక్కాడని సామాన్యులు ఎలా బతుకుతారు. మధ్యతరగతి కుటుంబాల బడ్జెట్‌ తారుమారవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకుంటేనే ఫలితం ఉంటుంది.


కొనలేని పరిస్థితి: జె.లక్ష్మీ స్రవంతి, గృహిణి, అత్తాపూర్‌

రెండు నెలలుగా కూరగాయల ధరలను చూసి ఆందోళన చెందాల్సిన పరిస్థితి వచ్చింది. మూడు రోజుల కిందట ఆదివారం మార్కెట్‌కు వెళ్తే చాలా కూరగాయల ధరలు కేజీకి రూ.60 నుంచి రూ.90 మధ్య ఉన్నాయి. ఇలా ధరలు ఎప్పుడూ చూడలేదు. ధరలు భారీగా పెరగడంతో కేజీ స్థానంలో అర, పావు కేజీ తీసుకున్నాం. అవీ నాలుగైదు రకాలే కొనాల్సి వచ్చింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని