సేవాకేంద్రం...అన్నదాతకు వరం
eenadu telugu news
Published : 27/10/2021 04:57 IST

సేవాకేంద్రం...అన్నదాతకు వరం

ఈనాడు డిజిటల్‌, వికారాబాద్‌: న్యూస్‌టుడే, మోమిన్‌పేట్‌


మోమిన్‌పేట్‌ రైతు సేవా కేంద్రంలో ఉన్న వాహనాలు, యంత్ర పరికరాలు

అన్నదాతలు ఆధునిక సాగు పద్ధతులను అనుసరించాలని అధికారులు పదేపదే చెబుతున్నారు. అయితే తగినన్ని యంత్ర పరికరాలు, సౌకర్యాలు అందుబాటులో ఉండటంలేదు. దీనివల్ల ఆసక్తి ఉన్నా రైతులు చేసేదేమీ లేక పాత పద్ధతులనే పాటించాల్సి వస్తోంది. ఈ విషయాన్ని గమనించిన ప్రభుత్వం సాగు సమయంలో రైతులకు అవసరమైన యంత్ర పరికరాలు చేరువ చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. దీన్లో భాగంగా రైతు సేవా కేంద్రాలను (కస్టమర్‌ హైరింగ్‌ సెంటర్‌) జిల్లాలో కొత్తగా మూడు చోట్ల ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే మోమిన్‌పేట్‌, కుల్కచర్ల మండలాల రైతులకు ఇవి సేవలు అందిస్తున్నాయి. వీటికి తోడు అదనంగా అందుబాటులోకి తెచ్చేందుకు రూ.కోటితో ప్రణాళికలు సిద్ధం చేశారు. రూర్బన్‌, బ్యాంకు లింకేజీ, స్త్రీనిధి రుణాల ద్వారా నిధులు సమకూర్చనున్నారు. ఫలితంగా వేలాది మంది రైతులకు మేలు జరుగుతుందని అధికారులు పేర్కొంటున్నారు. అంతేకాదు ఏటా అదుపు లేకుండా పెరుగుతున్న అద్దె భారం తగ్గుతుందని వివరిస్తున్నారు.

సెర్ప్‌ అధికారుల చొరవ

జిల్లాలో 2.39 లక్షల మంది రైతులున్నారు. 5.90 లక్షల ఎకరాల వరకు సాగు భూములున్నాయి. ఏటా సీజన్‌ వచ్చిందంటే దుక్కి దున్నేందుకు ట్రాక్టర్‌ నుంచి, విత్తనాలు వేయడానికి, కలుపు తీయడానికి, పండిన పంటను కోత కోయడానికి కూలీలు, యంత్రాల కొరత కనిపిస్తోంది. దీంతో కర్ణాటక నుంచి పత్తి తెంపడానికి కూలీలను తీసుకొస్తున్నారు. తమిళనాడు, ఆంధ్రా ప్రాంతాల నుంచి వరి కోత యంత్రాలను తెస్తున్నారు. ఈ పరిస్థితులను గమనించిన సెర్ప్‌ అధికారులు రైతు ఉత్పత్తిదారుల సంఘాల్లో రైతులకు అవసరమైన యంత్ర పరికరాలు, విత్తనాలు, ఎరువులను అందుబాటులో ఉంచితే ఎలా ఉంటుందని ఆలోచించారు. ఈ విషయమై ప్రయోగాత్మకంగా మోమిన్‌పేట్‌, కుల్కచర్ల మండలాల్లో పరిశీలించారు. ఏడాది కాలంలో మంచి ఫలితాలను సాధించారు. దీంతో జిల్లాలో మరో మూడు చోట్ల ఈ తరహా రైతు సేవా కేంద్రాలను ప్రారంభించడానికి సిద్ధమవుతున్నారు.

* తాండూరులో దాదాపు చివరి దశలో ఉండగా, బొంరాస్‌పేట్‌, దౌల్తాబాద్‌ మండలాల్లోనూ మరో రెండు నెలల్లోగా యంత్ర పరికరాలు అందుబాటులోకి రానున్నాయి. అనంతరం ధారూర్‌, కోట్‌పల్లి మండలాల్లోనూ ఈ తరహా కేంద్రాలను ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు తయారు చేస్తున్నారు. ఇప్పటికే తాండూరు మండలంలో రూర్బన్‌ నిధుల నుంచి రూ.30 లక్షలు కేటాయించగా, మరో రూ.17 లక్షలు స్త్రీ నిధి నుంచి రుణంగా తీసుకుని, యంత్ర పరికరాలు కొనుగోలు చేశారు. బొంరాస్‌పేట్‌ మండలంలో రూ.25 లక్షలు, దౌల్తాబాద్‌ మండలంలో రూ.28.50 లక్షలతో ప్రాజెక్టులను తయారు చేశారు. ఇందులో 25 శాతం ప్రభుత్వం గ్రాంటుగా ఇస్తుండగా, 65 శాతం స్త్రీ నిధి నుంచి రుణ సదుపాయాన్ని అందిస్తున్నారు. మరో పది శాతం మొత్తాన్ని రైతు సంఘాలు మూలధనం వాటా నుంచి నిధులను సమకూర్చనున్నాయి.


కుల్కచర్లలో వరి కోత యంత్రం

5 శాతం తక్కువ

సాధారణంగా బహిరంగ మార్కెట్‌లో యంత్రాల అద్దె కంటే రైతు సేవా కేంద్రాల్లో యంత్రాలకు అద్దె 5 శాతం తక్కువగా ఉంటుంది. ఫలితంగా మార్కెట్‌లో యంత్ర పరికరాల అడ్డగోలు అద్దె పెంపునకు కళ్లెం వేసినట్లు అవుతుందని రైతులు అభిప్రాయపడుతున్నారు. సభ్యులైన రైతుల అవసరాలకు ప్రాధాన్యతా క్రమంలో యంత్రాలను పంపిస్తామని సిబ్బంది పేర్కొంటున్నారు.

ఉత్పత్తిదారుల సంఘాలే కీలకం

కనీసం 15 నుంచి 20 మంది రైతులు కలసి రైతు ఉత్పత్తిదారుల సంఘాలుగా ఏర్పాటు కావాలని అధికారులు వివరిస్తున్నారు. ఇలా 30 సంఘాలు ఉంటే అక్కడ రైతు సేవా కేంద్రాల ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నారు. ఇక్కడ ఒక్కో రైతు సభ్యత్వం తీసుకోవడానికి రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. అదే సమయంలో సేవా కేంద్రంలో మూలధన వాటాకు రూ.500 వసూలు చేస్తారు. అనంతరం సభ్యులైన రైతులకు వ్యవసాయ యంత్ర పరికరాల కేటాయింపుల్లో ప్రాధాన్యం ఉంటుంది. రెండో ప్రాధాన్యంలో బయట వ్యక్తులకు యంత్రాలను అద్దెకు ఇస్తారు.

అనువైన చోట్ల ఏర్పాటు చేస్తాం : - కృష్ణన్‌, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి

రైతు సేవా కేంద్రాలతో రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. సేద్యం అవసరాలకు యంత్ర పరికరాలు అందుబాటులో ఉంచేందుకు కృషి చేస్తున్నాం. ఆసక్తి ఉన్న చోట్ల రైతు సేవా కేంద్రాలను ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాం. ప్రస్తుతానికి మూడు అందుబాటులోకి వస్తున్నాయి. మరో రెండు ప్రతిపాదనల్లో ఉన్నాయి. వాటిని త్వరలో అందుబాటులోకి తెస్తాం.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని