పాఠకులకు సౌకర్యం.. అవస్థలు దూరం
eenadu telugu news
Published : 27/10/2021 04:57 IST

పాఠకులకు సౌకర్యం.. అవస్థలు దూరం

న్యూస్‌టుడే, వికారాబాద్‌ కలెక్టరేట్‌


నిర్మాణంలో షెడ్డు

కరోనా అనంతరం వికారాబాద్‌ జిల్లా కేంద్ర గ్రంథాలయానికి వచ్చిపోయే వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. దీనికి తోడు పోటీ పరీక్షలు రాసే విద్యార్థుల సంఖ్య కూడా ఎక్కువవుతోంది. తమ ఇంట్లో చదువుకోవటానికి సరైన సదుపాయం లేని వారెందరో ఉన్నారు. ఇలాంటి వారికే కాదు, గ్రంథాలయానికి వచ్చే వారు ప్రశాంతంగా కూర్చుని చదువుకోవడానికి వీలుగా కొత్తగా మూడంతస్థుల భవనాన్ని నిర్మిస్తున్నారు. ఇదే సమయంలో పాత భవనం మరింత కాలం మన్నేందుకు దీనిపై షెడ్డును కూడా నిర్మిస్తున్నారు. దీనివల్ల పాఠకులకు, విద్యార్థులకు ఎంతో సౌలభ్యంగా ఉంటుందని నిర్వాహకులు పేర్కొంటున్నారు. ఇందుకు సంబంధించి ‘న్యూస్‌టుడే’ కథనం.

రూ.కోటి వ్యయం

వికారాబాద్‌ జిల్లా కేంద్ర గ్రంథాలయం పక్కనే మూడంతస్థుల భవనాన్ని రూ.కోటిన్నర వ్యయంతో నిర్మిస్తున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం ఉన్న భవనం మీద ఎల్‌ ఆకారంలో షెడ్డు కడుతున్నారు. భవనం పైన విశాలమైన స్థలంలో షెడ్డు ఏర్పాటు చేయటం వల్ల గాలి వెలుతురు బాగా సోకుతుందని షెడ్డు పక్కనే అందమైన పూల మొక్కలను పెంచనున్నారు. తద్వారా వాతావరణం ఆహ్లాదకరంగా మారుతుంది.

1959లో ప్రారంభం

వికారాబాద్‌ జిల్లా కేంద్ర గ్రంథాలయాన్ని 1959లో ప్రారంభించారు. అప్పటి నుంచి ఈ గ్రంథాలయం పెద్దగా అభివృద్ధికి నోచుకోలేదు. భవనం పైకప్పు శిథిలావస్థకు చేరింది. దీనికి అవసరమైన రక్షణ కోసం పైన షెడ్డును నిర్మిస్తున్నారు. దీనివల్ల రెండు రకాల ప్రయోజనాలుంటాయని నిర్వాహకులు వివరిస్తున్నారు. విద్యార్థులు తాము వెంట తెచ్చుకున్న పుస్తకాలను ఇక్కడ కూర్చుని చదువుకోవటం ఒకటి. మరొకటి భవనం జీవిత కాలం మరో 15 సంవత్సరాల పాటు పెరగడం. భవనానికి రంగులు వేసి అందంగా తీర్చిదిద్దుతున్నారు. కార్యాలయం గదిలో ఉన్న అవసరం లేని పుస్తకాలు, పత్రికలు తొలగిస్తున్నారు. పై అంతస్థులో ఉన్న పుస్తక పరిశీలిన గది పై కప్పు శిథిలం కావడంతో దీనిని మరో గదిలోకి మార్చి తొలగించాలన్న ఆలోచనలో అధికారులున్నారు.


విద్యార్థులకు, వచ్చే వారికి ప్రయోజనం

కామారెడ్డిలో నాలుగు సంవత్సరాల పాటు కార్యదర్శిగా పనిచేశాను. అక్కడ 500 విద్యార్థులకు సరిపడే విధంగా షెడ్డు నిర్మించాం. ఆ అనుభవంతోనే ఛైర్మన్‌ సహకారంతో ఇక్కడ షెడ్డు నిర్మిస్తున్నాం. గ్రంథాలయానికి వచ్చి చదువుకునే విద్యార్థులకు అవసరమైన పూర్తి సహకారాన్ని అందిస్తాం.

- పి సురేశ్‌బాబు, కార్యదర్శి, జిల్లా గ్రంథాలయం సంస్థ, వికారాబాద్‌


జనవరిలో ప్రారంభిస్తాం

గ్రంథాలయ అదనపు భవన నిర్మాణానికి కేటాయించిన రూ.కోటిన్నర నిధుల నుంచి కొంత నిధులను షెడ్డు నిర్మాణానికి వినియోగిస్తున్నాం. కొత్త భవనంతో పాటు షెడ్డును వచ్చే జనవరిలో ప్రారంభిస్తాం. షెడ్డు పూర్తి కాగానే ఇక్కడ సుమారుగా 300 ఎస్‌ మోడల్‌ కుర్చీలను ఏర్పాటు చేస్తాం. విద్యార్థులు ఇక్కడ కూర్చుని చదువుకునే విధంగా మారుస్తాం. వికారాబాద్‌లో తర్వాత తాండూరు, పరిగిలో షెడ్ల నిర్మాణాలను చేసే ఆలోచన ఉంది.

- మురళీకృష్ణ, ఛైర్మన్‌, జిల్లా గ్రంథాలయం, వికారాబాద్‌


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని