‘ఆలగడప సెజ్‌ ఏర్పాటు అన్యాయం’
eenadu telugu news
Published : 28/09/2021 03:59 IST

‘ఆలగడప సెజ్‌ ఏర్పాటు అన్యాయం’


అదనపు కలెక్టర్‌కు వినతి పత్రం అందజేస్తున్న నాయకులు, రైతులు

నల్గొండ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: ప్రజా ప్రయోజనం లేని ఆలగడప సెజ్‌ ఏర్పాటుకు సారవంతమైన భూములు సేకరించడం అన్యాయమని, తమ భూములను తీసుకోవద్దని కోరుతూ సోమవారం రైతులు అదనపు కలెక్టర్‌ రాహుల్‌శర్మకు వినతి పత్రం అందచేశారు. మిల్లర్ల సెజ్‌ కోసం ఆలగడప, అవంతిపురం, జాలుబాయితండ, రాయినిపాలెం గ్రామాల్లో సారవంతమైన, విలువైన భూములను సేకరించేందుకు యత్నించడం సమంజసం కాదని తెలిపారు. పేదలు ఏళ్ల తరబడి కష్టపడి సాగుచేసుకుంటూ సారవంతం చేసుకున్న మాగాణి, తరి భూములని వివరించారు. ఆలగడప సెజ్‌ను రద్దు చేయాలని వివరించారు. వినతి పత్రం అందచేసిన వారిలో కిసాన్‌ కాంగ్రెస్‌ కేంద్ర సభ్యుడు కోదండరెడ్డి, ఆదిరెడ్డి శ్రీకాంత్‌, డీసీసీ అధ్యక్షుడు శంకర్‌నాయక్‌, గోవిందరెడ్డి, మంగారెడ్డి, సైదులు, స్వామి, భిక్షానాయక్‌, బాలునాయక్‌, సందీప్‌, లక్ష్మణ్‌, మహేశ్‌, నాగయ్య తదితరులు పాల్గొన్నారు.

మా భూముల జోలికి రానివ్వం

మిర్యాలగూడ పట్టణం: ఎన్నో ఏళ్లుగా భూమినే నమ్ముకుని..వ్యవసాయమే ఆధారంగా జీవిస్తున్న తమ భూముల జోలికి ఎవరినీ రానివ్వబోమని మిర్యాలగూడ మండల పరిధిలోని ఆలగడప, జాలుబాయితండా, రాయినిపాలెం గ్రామాల రైతులు అన్నారు. సోమవారం భారత్‌బంద్‌లో భాగంగా మిర్యాలగూడలో ప్లకార్డులు ప్రదర్శించి, నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మట్టి మనుషుల ఫోరం కన్వీనర్‌ వేనేపల్లి పాండురంగారావు మాట్లాడుతూ.. సాగు తప్ప మరో పని రాని పేదల నుంచి భూములు లాక్కోవాలని చూడడం సరికాదన్నారు. తక్షణమే ఈ ప్రాంతలో సెజ్‌ను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం సెజ్‌ను రద్దు చేయాలని కోరుతూ వినతిపత్రం అందించేందుకు కలెక్టరేట్‌కు తరలివెళ్లారు. కార్యక్రమంలో లిటరరీ స్టడీసర్కిల్‌ కన్వీనర్‌ కస్తూరి ప్రభాకర్‌, న్యూడెమోక్రసీ నాయకుడు జ్వాలా వెంకటేశ్వర్లు, బీసీ సంఘం నాయకుడు కోల సైదులు, రైతుసంఘం నాయకుడు గోవిందరెడ్డి, సీపీఎం నాయకుడు మంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని