నిబంధనల మెలిక..అద్దెకు ససేమిరా?
eenadu telugu news
Published : 28/09/2021 03:59 IST

నిబంధనల మెలిక..అద్దెకు ససేమిరా?

సీసీఐకి జిన్నింగ్‌ మిల్లులు ఇచ్చేందుకు ముందుకు రానివ్యాపారులు

పత్తి కొనుగోళ్లపై సందిగ్ధం

నల్గొండ గ్రామీణం, న్యూస్‌టుడే

నల్గొండ మండలంలో పత్తి పైర్లను పరిశీలిస్తున్న వ్యవసాయశాఖ జిల్లా అధికారి శ్రీధర్‌రెడ్డి

జిన్నింగ్‌ మిల్లులను అద్దెకు తీసుకుని సీసీఐ పత్తి కొనుగోలు చేస్తోంది. వచ్చే నెలలో కొనుగోళ్లు ప్రారంభం కావాలి. కానీ పత్తి జిన్నింగ్‌ చేసి ఇచ్చే నిబంధనల్లో సీసీఐ (కాటన్‌ కార్పొరేషన్‌ ఆప్‌ ఇండియా) మార్పులు చేసింది. వ్యాపారులకు అనుకూలంగా లేవని జిన్నింగ్‌ మిల్లులు అద్దెకు ఇవ్వొద్దని పత్తి పరిశ్రమ యజమానుల సంఘం నిర్ణయించింది. దీంతో కొనుగోళ్లపై సందిగ్ధం నెలకొంది.

జిల్లాలో వానాకాలం సీజన్‌లో నల్గొండ ఉమ్మడి జిల్లాలో 8.54 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. 85 లక్షల క్వింటాళ్లకు పైగా దిగుబడి వచ్చే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. పత్తి మద్దతు ధర క్వింటాలుకు రూ.6,025 ఉంది. ప్రస్తుతం మార్కెట్‌లో రూ. 6 నుంచి ఏడు వేల వరకు ధర పలుకుతోంది. గతేడాది ఉమ్మడి జిల్లాలో 26 కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఇప్పుడిప్పుడే పత్తి పంట చేతికి వస్తోంది. కొనుగోలు కేంద్రాల సమీపంలో పత్తిని బేళ్లు చేసేందుకు జిన్నింగ్‌లు అద్దెకు కావాలని సీసీఐ టెండర్లను ఆహ్వానించింది. ఇప్పటికి వరకు రెండు విడతలుగా సీసీఐ టెండర్లు ఆహ్వానించినా వ్యాపారులు దాఖలు చేయలేదు. గడువును ఈ నెల 17 నుంచి 21 వరకు పెంచినా ఒక్క టెండరు నమోదు కాలేదు. వ్యాపారులు జిన్నింగ్‌లు ఇచేందుకు నిరాకరిస్తే పత్తి క్రయవిక్రయాల్లో ఇబ్బందులు తలెత్తనుంది.

ట్రాష్‌ పేరుతో ఇబ్బందులు పెట్టవద్దు

- చల్లా శ్రీధర్‌రెడ్డి, రాష్ట్ర కోశాధికారి, జిన్నింగ్‌ మిల్లుల యాజమాన్యాల సంఘం, చిట్యాల

ప్రభుత్వం అందించే రాయితీలు, బకాయిలు చెల్లిస్తే టెండర్లు వేయడానికి ముందుకొస్తాం. సీసీఐ ట్రాష్‌ పేరుతో, దూది ఇచ్చే దానిలో పెట్టిన నిబంధనలు మార్చాలి.

నిబంధనలు ఇలా ఉన్నాయి

జిన్నింగ్‌ను అద్దెకు ఇచ్చిన వ్యాపారులు సీసీఐ కొనుగోలు చేసిన పత్తిని బేళ్లుగా మార్చి ఇవ్వాలి. ఒక్కో బేలుకు రూ.1,290 చొప్పున సీసీఐ చెల్లిస్తుంది. వీటి తయారీలో కొన్ని నిబంధనలు పెట్టింది. వంద కిలోల పత్తిలో ఏ నెల ఎంత దూది ఇవ్వాలనేది సూచించింది. దూది శాతం ప్రాంతాన్ని బట్టి ఉంటుందని.. సగటు ఉంచాలని వ్యాపారులు డిమాండ్‌ చేస్తున్నారు. బేలుకు ఇచ్చే ధరను పెంచాలని కోరుతున్నారు.

చెత్త(ట్రాష్‌) 2.50 శాతంలోపు ఉండటంతో పాటు కోత విషయంలో నెలనెలా మార్పులు చేశారు. మొద టి నెల 3.25 శాతం ఉండాలి. చివరిలో 2 శాతానికి తగ్గించారు. సీసీఐ పత్తిని కొనుగోలు చేస్తూ నాణ్యతను వ్యాపారులు పాటించేలా నిబంధనలు పెట్టడం ఎంత వరకు సమంజసమని వ్యాపారులు ప్రశ్నిస్తున్నారు. పత్తి ఒకే నాణ్యతతో ఉండదని, నెల నెలా దూది శాతం ఎక్కువ చేయడం ఇబ్బందికరమన్నారు.


టెండర్ల ప్రక్రియ పూర్తి కాలేదు

- శ్రీకాంత్‌, జిల్లా అధికారి, మార్కెటింగ్‌ శాఖ, నల్గొండ

సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలపైౖ ఇంకా స్పష్టత రాలేదు. టెండర్ల ప్రక్రియ పూర్తి కాలేదు. మార్కెటింగ్‌ శాఖా పరంగా కొనుగోళ్లు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం.

ఈ ఏడాది జిల్లాల వారీగా పత్తి సాగు వివరాలు (ఎకరాల్లో)


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని