120 కిలోల గంజాయి స్వాధీనం
eenadu telugu news
Published : 28/09/2021 03:59 IST

120 కిలోల గంజాయి స్వాధీనం

ఆర్టీసీ బస్సు, కారు తనిఖీలో పట్టుబడిన ఐదుగురు నిందితులు

నల్గొండ నేరవిభాగం, న్యూస్‌టుడే: నిఘా పెరగడంతో పట్టుబడకుండా ఉండేందుకు గంజాయి అమ్మకందారులు రూటు మార్చారు. ప్రైవేటు వాహనాలు కాకుండా ఆర్టీసీ బస్సులు, మహిళలు ఉండే వాహనాలను ఆసరాగా చేసుకుని దందా కొనసాగిస్తున్నారు. ఇది గుర్తించిన పోలీసులు జాతీయ రహదారిపై సోమవారం వాహనాల తనిఖీ చేశారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న వారితో పాటు ఓ కారులో గంజాయి రవాణా చేస్తున్న ఐదుగురిని అదుపులోకి తీసుకోవడంతో పాటు 120 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు నల్గొండ ఎస్పీ ఏవీ రంగనాథ్‌ తెలిపారు. ఒడిశా ప్రాంతానికి చెందిన మహిళ సుమిత్రా సర్కార్‌తో పాటు సుజిత్‌ బిస్వాస్‌, అమల్‌ పొద్దార్‌ భద్రాచలం నుంచి 20 కిలోల గంజాయి తీసుకుని భద్రాచలం డిపో ఆర్టీసీ రాజధాని బస్సులో హైదరాబాద్‌ వెళ్తున్నట్లు తెలిపారు. దీంతో పాటు మహారాష్ట్ర లాతూర్‌ ప్రాంతానికి చెందిన సులేమాన్‌, మహబూబ్‌దంగ్దే కలిసి ఐ-20 కారులో వంద కిలోల గంజాయితో హైదరాబాద్‌కు వెళ్తుండగా కట్టంగూర్‌ వద్ద వాహన తనిఖీల్లో నిందితులు పట్టుబడినట్లు తెలిపారు. ఈ రెండు కేసుల్లో మరికొంత మందికి సంబంధం ఉన్నట్లు గుర్తించామన్నారు. వారిని త్వరలో అదుపులోకి తీసుకోవడానికి కృషిచేస్తున్నటు పేర్కొన్నారు. జాతీయ రహదారిపై నిర్వహిస్తున్న తనిఖీలు సీసీ కెమెరాల పర్యవేక్షణలోనే జరుగుతున్నాయని చెప్పారు. జిల్లాను గంజాయి రహితంగా మార్చేందుకు పోలీస్‌శాఖ పనిచేస్తుందన్నారు. గంజాయికి సంబంధించిన సమాచారాన్ని ప్రజలు సామాజిక బాధ్యతతో పోలీసులకు అందివ్వాలని కోరారు. డీఎస్పీ వెంకటేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో గంజాయి స్వాధీనంలో కీలక పాత్ర పోషించిన సీఐలు పీఎన్‌డీ ప్రసాద్‌, నాగరాజు, కట్టంగూరు ఎస్సై శివప్రసాద్‌ లను ఎస్పీ అభినందించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని