ఏకధాటి వాన 
eenadu telugu news
Updated : 28/09/2021 05:38 IST

ఏకధాటి వాన 

లోతట్టు ప్రాంతాలు జలమయం

మెట్ట పంటలకు అపార నష్టమంటున్న రైతులు

మునుగోడు మండలం వెల్మకన్నెలో నీటమునిగిన పత్తి

ఈనాడు, నల్గొండ: గులాబ్‌ తుపాను ప్రభావంతో ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా సోమవారం ఉదయం నుంచి జోరువానలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఉదయం మొదలైన వర్షం ఏకధాటిగా రాత్రి వరకు కురుస్తూనే ఉంది. పలు చోట్ల వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నల్గొండ, సూర్యాపేట, భువనగిరి జిల్లా కేంద్రాలతో పాటు పలు పురపాలికల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మారుమూల ప్రాంతాల్లోని వాగులు, వంకలు పొంగుతున్నాయి. సోమవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 వరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రతి మండలంలోనూ సగటున 3 సెం.మీ.ల వర్షం కురిసినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. మునుగోడు, చండూరు మండలాల్లో వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. మాడ్గులపల్లి మండలంలోని దాచారం, నారాయణపురం మధ్య వాగు ప్రవాహం ఎక్కువగా ఉండటంతో రెండు గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఎగువన శ్రీశైలం నుంచి స్థిరంగా ఇన్‌ఫ్లో ఉండటంతో నాలుగు రోజులుగా నాగార్జునసాగర్‌ రెండు క్రస్ట్‌ గేట్లతో పాటు కుడికాలువ, ఎడమగట్టు ప్రధాన విద్యుత్తు కేంద్రం, ఏఎమ్మార్పీ ప్రాజెక్టు ద్వారా వచ్చిన నీటిని వచ్చినట్లు 58755 క్యూసెక్కుల నీటిని దిగువన పులిచింతలకు వదులుతున్నారు. పులిచింతల జలాశయానికి క్రమంగా ఇన్‌ఫ్లో పెరుగుతోంది. సోమవారం సాయంత్రానికి ప్రాజెక్టు నీటిమట్టం 45.77 టీఎంసీలకు గానూ 32.5 టీఎంసీలుగా ఉంది. హైదరాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు మూసీ ప్రాజెక్టులో నీటిమట్టం పెరగడంతో ఆరు క్రస్ట్‌ ద్వారా సుమారు 11500 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.

మెట్ట పంటలకు దెబ్బ

గత నెలలో కురిసిన వర్షాలకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 15 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అందులో అత్యధికంగా 8 వేల ఎకరాలకు పైగా పత్తి పంటకు నష్టం వాటిల్లిందని, తాజా వర్షాలతో నష్టం అమాంతం పెరగనుందని సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది. పత్తి పైరులో నీరు నిలిచి పంట ఎర్రబారుతోంది. పెసర, మినప పంటలు ఎటూ కాకుండా పోతాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మెట్ట పంటలు ఎక్కువగా సాగు చేసే దేవరకొండ, మునుగోడు, తుంగతుర్తి, ఆలేరు, భువనగిరి, నల్గొండ నియోజకవర్గాల్లోనే పంట నష్టం అత్యధికంగా ఉంది. ఉద్యాన పంటలైన కూరగాయలు, బత్తాయి, నిమ్మలకు ఈ వర్షం కీడు చేసేదేనని అధికారులు వెల్లడిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 4500 చెరువులుండగా, ఇందులో 4 వేల చెరువులు జలకళను సంతరించుకున్నాయని నీటిపారుదల శాఖ వర్గాలు వెల్లడించాయి. ఇందులో 2వేల చెరువుల వరకు అలుగు పారుతున్నాయి. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఉమ్మడి జిల్లాలో చెరువులు, కుంటలు ఈ స్థాయిలో నిండటం ఇదే ప్రథమమని అధికార వర్గాలు తెలిపాయి.

ఎడమ కాల్వకు నీటి విడుదల నిలిపివేత

నాగార్జునసాగర్‌, న్యూస్‌టుడే: నాగార్జునసాగర్‌ ఎడమ కాల్వకు నీటి విడుదలను ఎన్నెస్పీ అధికారులు సోమవారం నిలిపివేశారు. మొదట ఆగస్టు 2న నీటి విడుదల మొదలు కాగా అదే నెల 31 వరకు 14 టీఎంసీలను వదిలారు. సెప్టెంబర్‌ 5 నుంచి 25 వరకు 11 టీఎంసీలు విడుదల చేసినట్లు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.

జాగ్రత్తలు తీసుకోవాలి

త్రిపురారం, న్యూస్‌టుడే: తుపాన్‌కు ముందు రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని కంపసాగర్‌ కేవీకే ప్రోగ్రామ్‌ కోఆర్డినేటర్‌ శంకరయ్య తెలిపారు. సోమవారం విలేకరులతో మాట్లాడుతూ ఉద్యానవన పంటల విషయంలో మొక్కలు వంగిపోకుండా, పెకిలించికోకుండా మొక్కల మొదళ్ల దగ్గర బలంగా మట్టితో మద్దతును అందించాలన్నారు. క్రమం తప్పకుండా వరదలు, తేమ అధికంగా ఉండే ప్రాంతాల్లో వరి పంటను మినహా ప్రత్యామ్నాయ పంటలు వేయొద్దని సూంచించారు. పశువుల సంరక్షణకు తగిన షెడ్ల ఏర్పాటు తప్పనిసరి అని పేర్కొన్నారు.


తప్పిన ప్రమాదం

దాచారం వాగులో ద్విచక్రవాహనం కోసం వెతుకుతున్న ఈతగాళ్లు

మాడ్గులపల్లి: నారాయణపురం గ్రామానికి చెందిన మర్రి ఏడుకొండల్‌.. ఆదివారం సాయంత్రం తన ద్విచక్రవాహనంపై మాడ్గులపల్లికి వెళ్తుండగా దాచారం వాగును దాటే క్రమంలో ద్విచక్ర వాహనంతో సహా వాగులోకి జారిపోయాడు. అతడికి ఈత రావడంతో క్షేమంగా బయటకు వచ్చాడు. ద్విచక్ర వాహనాన్ని సోమవారం కొంతమంది ఈతగాళ్లు వెతికి బయటకు తీశారు. మరోవైపు చిరుమర్తి, ఆగామోత్కూర్‌, బొమ్మకల్‌, కల్వెలపాలెం గ్రామాల పరిధిలోని పాలేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.


నల్గొండలో నమోదైన వర్షపాతం


మూసీ ప్రాజెక్టు గేట్ల నుంచి దిగువకు విడుదలవుతున్న నీరు

నల్గొండ గ్రామీణం: జిల్లాలో సోమవారం 13.7 మి.మీ. వర్షపాతం నమోదైంది. చిట్యాలలో 50.5 మి.మీ., నార్కట్‌పల్లిలో 14.6, కట్టంగూర్‌లో 21.2, శాలిగౌరారంలో 23.3, నకిరేకల్‌లో 18.8, కేతేపల్లిలో 29.0, తిప్పర్తిలో 12.1, నల్గొండలో 26.4, కనగల్‌లో 25.0 మునుగోడులో 22.0, చండూరులో 19.3, అనుములలో 9.0, నిడమనూరులో 10.7, త్రిపురారంలో 10.9, మాడుగులపల్లిలో 30.0, వేములపల్లిలో 10.8, మిర్యాలగూడలో 13.5, దామరచర్లలో 9.3, మర్రిగూడలో 17.7, చింతపల్లిలో 8.9, నాంపల్లిలో 17.1, గుర్రంపోడులో 9.1, పీఏపల్లిలో 5.9, నేరెడుగొమ్ములో 2.5, కొండమల్లేపల్లిలో 3.5, దేవరకొండలో 3.5, గుండ్లపల్లిలో 0.9, చందంపేటలో 0.4 మి.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. పెద్దవూర, తిరుమలగిరి, అడవిదేవులపల్లి మండలాలో వర్షం కురవలేదు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని