కొత్త వ్యవసాయ చట్టాల రద్దుపై పోరుబాట
eenadu telugu news
Published : 28/09/2021 03:59 IST

కొత్త వ్యవసాయ చట్టాల రద్దుపై పోరుబాట

ఉమ్మడి జిల్లాలో భారత్‌ బంద్‌ ప్రశాంతం

ఈనాడు, నల్గొండ

సూర్యాపేట ఆర్టీసీ డిపో ఎదుట అఖిల పక్ష నాయకుల నిరసన

 

ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా 40 రైతు సంఘాలతో కూడిన సంయుక్త కిసాన్‌ మోర్చా ఇచ్చిన భారత్‌ బంద్‌ పిలుపునకు ఉమ్మడి నల్గొండ జిల్లాలో తెరాస, భాజపాయేతర విపక్షాలు మద్దతు ప్రకటించడంతో సోమవారం బంద్‌ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం నుంచే ఉమ్మడి జిల్లాలోని నల్గొండ, మిర్యాలగూడ, దేవరకొండ, నార్కట్‌పల్లి, సూర్యాపేట, కోదాడ, యాదగిరిగుట్ట డిపోల వద్ద కాంగ్రెస్‌, సీపీఐ, సీపీఎం, తెదేపా ఇతర కార్మిక సంఘాలతో కూడిన అఖిలపక్ష నాయకులు ధర్నా నిర్వహించారు. దీంతో ఉదయం నుంచి బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో తుఫాన్‌ ప్రభావంతో వర్షం కురుస్తున్నా వర్షంలోనే అఖిలపక్ష నాయకులు ధర్నా నిర్వహించారు. నియోజకవర్గ కేంద్రాలతో పాటు మండల కేంద్రాల్లో అఖిలపక్ష నాయకులు రహదారులపై తిరుగుతూ వాణిజ్య, వ్యాపారాలను పూర్తిగా బంద్‌ చేయించారు. నల్గొండ జిల్లా కేంద్రంతో పాటు పురపాలికలు, మండలాల్లో 11 గంటల తర్వాతే వాణిజ్య, వ్యాపార కార్యకలాపాలు మొదలయ్యాయి. దీంతో డిపోల వద్ద ధర్నా చేసిన అఖిల పక్ష నాయకులు అరెస్టు చేసి స్థానిక పోలీసు స్టేషన్లకు తరలించారు. డిండి మండల కేంద్రంలో శ్రీశైలం - హైదరాబాద్‌ ప్రధాన రహదారిపై అఖిలపక్ష నేతలు రాస్తారోకో నిర్వహించడంతో కొద్ది సేపు ఈ రహదారిలో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

* సూర్యాపేట జిల్లా కేంద్రంలో బంద్‌లో పాల్గొన్న సీపీఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు, డీసీసీ అధ్యక్షుడు చెవిటి వెంకన్నతో పాటూ పలువురు అఖిలపక్షనాయకులను పోలీసులు అరెస్టు చేశారు.

* యాదాద్రి జిల్లాలో డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డితో పాటు అఖిలపక్ష నాయకులను అరెస్టు చేసి బీబీనగర్‌ పోలీసుస్టేషన్‌కు తరలించారు.

* మిర్యాలగూడలో నల్గొండ డీసీసీ అధ్యక్షుడు శంకర్‌నాయక్‌తో పాటు సీపీఎం నాయకులను అరెస్టు చేసి రెండో పట్టణ పోలీసు స్టేషన్‌కు తరలించారు. బంద్‌కు మద్దతుగా ఇటీవల పారిశ్రామికవాడ భూములు సేకరణకు నోటిఫికేషన్‌ జారీ చేసిన ఆలగడప, జాలిబాయి తండా, రాయనిపాలెం రైతులు ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని