ఆసరా రాక.. బతుకు గడవక
eenadu telugu news
Published : 28/09/2021 03:59 IST

ఆసరా రాక.. బతుకు గడవక

దివ్యాంగుల దీనావస్థలు

భువనగిరి, న్యూస్‌టుడే:

దివ్యాంగులు ఎటువంటి ‘ఆసరా’ లేక ఇబ్బంది పడుతుంటారు. ఏ పని చేసుకోవాలన్న మరొకరిపై ఆధారపడాల్సిందే. ఫలితంగా ఒంటరి దివ్యాంగులు పూట గడవక తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర క్షోభ అనుభవిస్తున్నారు. దీనికి తోడు ప్రభుత్వం అందించే ఆసరా సాయం మంజూరు రెండేళ్ల నుంచి నిలిచిపోయింది. కొత్త దరఖాస్తులదారులకు పింఛన్‌ మంజూరు కాకపోవడంతో వారి కష్టాలు రెట్టింపవుతున్నాయి. ఫలితంగా వారి పరిస్థితి మరింత దయనీయంగా తయారైంది. జిల్లాలో రెండేళ్ల నుంచి దరఖాస్తు చేసుకున్న పింఛన్‌ మంజూరు కాని దివ్యాంగుల దీనస్థితిపై కథనం.  ఆసరా పథకం ప్రభుత్వం వికలాంగులకు నెలకు రూ. 3016 మొత్తాన్ని ఇస్తుంది. నగదు తక్కువైనా..ఈ సాయం వారికి కొండంత అండగా ఉంటుంది.  జిల్లాలో 2019 జూన్‌ నుంచి కొత్త పింఛన్ల మంజూరు నిలిచిపోయింది. ఇప్పటి వరకు జిల్లాలోని 17 మండలాలు, 5 పురపాలిక పరిధిలోని 1481 మంది సాయం కోసం దరఖాస్తు చేసుకున్నారు. జిల్లా కేంద్రానికి దూరంగా ఉన్న మండలాలకు చెందిన దివ్యాంగులు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. వ్యయప్రయాసలతో అధికారులకు మొర పెట్టుకుంటున్నారు. ప్రభుత్వం నుంచి అనుమతి రాలేదనే సాకుతో దరఖాస్తులు పెండింగ్‌ పెట్టినట్లు గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు చెబుతున్నారు. మరి కొందరు సదరం శిబిరాలలో పరీక్షలు చేయించుకుని ధ్రువీకరణ పత్రాల కోసం ఎదురు చూస్తున్నారు. దీనిపై డీఆర్‌డీవో ఉపేందర్‌ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం జిల్లాలో 13,017 మంది దివ్యాంగ లబ్ధిదారులకు సాయం అందిస్తున్నామన్నారు. ప్రభుత్వం నుంచి అనుమతి వస్తే ఎంపీడీవోలకు ఉత్తర్వులు జారీ చేసి పెండింగ్‌ దరఖాస్తులను క్లియర్‌ చేస్తామని వివరించారు.

భారంగా కుటుంబ పోషణ..:

కూనూరు మల్లేశం, సిరిపురం, రామన్నపేట మండలం

రామన్నపేట: వికలాంగ పింఛను కోసం దరఖాస్తు చేసి నెలలు గడుస్తున్నాయి. ఎప్పుడు మంజూరవుతుందో తెలియక నిరీక్షణ తప్పడం లేదు. రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలతో అంగవైకల్యం ఏర్పడింది. సదరం సర్టిఫికేటుతో దివ్యాంగుల కోటాలో పింఛను కోసం దరఖాస్తు చేసుకొని 8 నెలలు గడిచాయి. ఇప్పటి వరకు పింఛను రాలేదు. కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా.  పింఛను వస్తుందని చెప్తున్నారు. కానీ రావడంలేదు. భార్యతో పాటు కూతురు, కుమారుడు నీపైనే ఆధారపడ్డారు. కూలి పనితో జీవనం సాగిస్తున్నాం. భార్య కూలికి వెళ్తుంది. నేను చేనేత రంగులు అద్దకం పనిచేస్తున్నాను. వికలాంగ పింఛను వస్తే కొంత మేర చేయూత ఉంటుంది. ప్రభుత్వం వెంటనే పింఛన్‌ ఇవ్వాలి.


పనిచేయలేనాయే.. పింఛన్‌ రాదాయే:

శిగ లక్ష్మయ్య, కల్లుగీత కార్మికుడు, అమ్మనబోలు, మోటకొండూరు మండలం

మోటకొండూరు: నేను గీత కార్మికుడ్ని.. అదే వృతితో జీవనం సాగించేవాడిని. ఏడాదిన్నర కిందట చెట్టుపై నుంచి ప్రమాదవశాత్తు జారిపడ్డా. కాలువిరిగింది. ఇప్పటికీ కాలుకు పట్టీ వేసుకోవాల్సి వస్తుంది. ఎటూ తిరగలేని పరిస్థితి. వృతి వదిలేయడంలో ఆదాయం లేక కుటుంబం గడవటం లేదు. రోజూవారి పనులు చేసుకోలేకపోతున్నాను. కొంతమేర కోలుకున్నాక, పింఛన్‌ కోసం సదరం శిబిరం ద్వారా ధ్రువీకరణ పత్రం తీసుకుని దరఖాస్తు చేశా. ఏడాదిన్నర అవుతున్నా ఇంతవరకు ఫించను మంజూరు కాలేదు. ఆస్తులు లేవు.  నా భార్య రోజూవారి కూలి చేసి నన్ను, నా కుమారున్ని పోషిస్తుంది. ప్రభుత్వం ఆదుకోవాలి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని