ఉరకలేస్తున్న గోదారి
eenadu telugu news
Updated : 24/07/2021 02:19 IST

ఉరకలేస్తున్న గోదారి

సమ్మక్కసాగరం బ్యారేజీలో..

కన్నాయిగూడెం, న్యూస్‌టుడే: తుపాకులగూడెంలోని సమ్మక్కసాగరం బ్యారేజీ వద్ద గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో ప్రవాహం పెరుగుతోంది. మొత్తం 59 గేట్లను ఎత్తి నీటిని కిందకు వదులుతున్నారు. ప్రాజెక్టు గరిష్ఠ సామర్థ్యం 6.94 టీఎంసీలు కాగా ప్రస్తుతం 5.56 టీఎంసీలు నమోదైంది. 11,74,480 క్యూసెక్కుల జలాలు కిందకు వెళ్తున్నాయి. గంగారంలోని దేవాదుల ఎత్తిపోతల పథకం ఇన్‌టేక్‌వెల్‌ వద్ద గోదావరి నీటిమట్టం 83.7 మీటర్లు నమోదైంది. ప్రస్తుతం పంపింగ్‌ నిలిపివేశారు.

ప్రమాద హెచ్చరికకు చేరువలో..

ఏటూరునాగారం, న్యూస్‌టుడే: రామన్నగూడెం పుష్కరఘాట్‌ వద్ద గోదావరి ప్రవాహం పెరుగుతోంది. శుక్రవారం రాత్రి 8 గంటలకు 8.350 మీటర్లకు చేరుకుంది. మొదటి ప్రమాద హెచ్చరిక సమీపానికి చేరుకుంది.

రామన్నగూడెంలో పుష్కరఘాట్‌ వద్ధ.

పేరూరులో 43 అడుగులు

వాజేడు, న్యూస్‌టుడే: మండలపరిధిలోని పేరూరులో శుక్రవారం సాయంత్రానికి గోదావరి వరద నీటిమట్టం 43 అడుగులకు చేరింది. కాళేశ్వరం నుంచి వస్తున్న వరదనీటితో నీటిమట్టం క్రమంగా పెరుగుతున్నట్లు కేంద్ర జలవనరుల సంఘం సిబ్బంది పేర్కొన్నారు. మండలకేంద్రంలో గోదావరి వరదతో కోతకు గురవుతున్న భూములను, వరద ప్రభావానికి గురయ్యే ప్రాంతాలను తహసీల్దారు రాజ్‌కుమార్‌, ఎస్సై తిరుపతిరావు పరిశీలించారు. ముంపునకు గురైన ఏడ్జర్లపల్లి-బొమ్మనపల్లి రహదారిని మండల ప్రత్యేకాధికారి విజయభాస్కరరెడ్డి, తహసీల్దారు, ఎంపీడీవో చంద్రశేఖర్‌, ఎంపీవో నరసింహారావు పరిశీలించారు. బొగత జలపాతం సందర్శనను తాత్కాలికంగా నిలిపివేయాలని అటవీ అధికారులకు సూచించారు.

మంగపేట, న్యూస్‌టుడే: కమలాపురం ఇన్‌టేక్‌వెల్‌ వద్ద గోదావరి నీటి మట్టం సుమారు 87 అడుగులకు చేరింది. మంగపేటలో పుష్కరఘాట్‌ పైభాగంలో రోడ్డు గోదావరిలో కలిసిపోవడంతో ఒడ్డు వద్దకు ఎవరూ పోకుండా పంచాయతీ కార్యదర్శి హీరూ ఆధ్వర్యంలో సిబ్బంది హెచ్చరిక బ్యానర్లు కట్టారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని