close

బుధవారం, ఆగస్టు 12, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మరో 187 మందికి..

వైరస్‌తో ఇద్దరు మృత్యువాత

● పీడితుల్లో స్థానికులే అధికం..


కాకినాడ గ్రామీణం వేళంగిలో కొవిడ్‌-19 పరీక్షలకు

నమూనాలు సేకరిస్తున్న వైద్య సిబ్బంది

కరోనా వైరస్‌ నానాటికీ తీవ్రమవుతోంది.. పీడితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కొద్దిరోజులుగా వందకు పైనే కేసులు నమోదవుతుండడం.. అడపాదడపా మరణాలు చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. కొత్త కేసులు వెలుగుచూస్తున్న ప్రాంతాల్లో ఆంక్షలు అమలు చేస్తున్నా వైరస్‌ కట్టడి మాత్రం సాధ్యపడడం లేదు. ప్రజలతోపాటు, ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులు.. రోగులకు సేవలందిస్తున్న వైద్యులు సైతం వైరస్‌ బారిన పడుతుండడం కలకలం రేపుతోంది. గురువారం ఉదయం 9 గంటల నుంచి శుక్రవారం ఉదయం 9 గంటల వరకు నమోదైన కేసుల వివరాలతో జిల్లా యంత్రాంగం కొవిడ్‌- 19 బులెటిన్‌ను విడుదల చేసింది. తాజాగా జిల్లాలో 187 కేసులు వెలుగుచూసినట్లు అధికారులు వెల్లడించారు. వీటిలో జిల్లాలో ఉన్నవారు 172 మంది, ఇతర జిల్లాల నుంచి వచ్చినవారు 15 మంది వైరస్‌ బారినపడినట్లు గుర్తించారు. - ఈనాడు, కాకినాడ

జిల్లాలోని కాకినాడ, రాజమహేంద్రవరం నగరాలతోపాటు పలు మండలాల్లో కేసుల తీవ్రతతో ఆంక్షలు అలముకుంటున్నాయి. కొత్తగా ఏర్పాటైన కంటైన్మెంట్‌ క్లస్టర్లలో పారిశుద్ధ్య కార్యక్రమాలతోపాటు వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నారు. ఓవైపు అధికారులు మాస్కులు ధరించాలని, భౌతిక దూరంతోపాటు వ్యక్తిగత శుభ్రత పాటించాలని పదేపదే హెచ్చరిస్తున్నా ప్రజలు తేలిగ్గా తీసుకుని తిరుగుతుండడంతో వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట పడడంలేదు.

ఇద్దరి మృతి

కాకినాడ నగరంలోని సూర్యనారాయణపురం ప్రాంతానికి చెందిన 70 ఏళ్ల వృద్ధురాలు జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందారు. కరోనా పాజిటివ్‌గా గుర్తించిన ఈమెను ఈనెల 8న ఆసుపత్రిలో చేర్పించారు. మధుమేహం, రక్తపోటు, థైరాయిడ్‌ తదితర అనారోగ్య సమస్యలతో ఈమె బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారు. ఏలేశ్వరం పట్టణానికి చెందిన 72 ఏళ్ల వృద్ధురాలు కాకినాడలోని జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఈమెను ఈనెల 7న ఆసుపత్రిలో చేర్పించారు. మృతిచెందిన అనంతరం నిర్వహించిన పరీక్షల్లో పాజిటివ్‌గా తేలడంతో అప్రమత్తమయ్యారు.

కొత్త కేసులు ఇవే..

కొవిడ్‌- 19 తాజా బులెటిన్‌లో జిల్లాలో అత్యధికంగా కాకినాడ నగరంలో 61 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఉప్పాడ కొత్తపల్లి మండలంలో 25, రాజమహేంద్రవరం నగరంలో 24, మండపేట మండలంలో 14, పెద్దాపురం మండలంలో 13 కేసులు నమోదైనట్లు చూపారు. రాజమహేంద్రవరం గ్రామీణంలో 12, ఆలమూరు మండలంలో ఆరు, కాకినాడ గ్రామీణంలో అయిదు కేసులు గుర్తించినట్లు తెలిపారు. అమలాపురం, కొత్తపేట, రాజానగరం మండలాల్లో నాలుగేసి చొప్పున.. కడియం, రామచంద్రపురం మండలాల్లో మూడేసి చొప్పున కేసులు గుర్తించినట్లు పేర్కొన్నారు. పిఠాపురం మండలంలో రెండు, కోరుకొండ, కోటనందూరు, సామర్లకోట, తాళ్లరేవు, దేవీపట్నం మండలాల్లో ఒక్కొక్కటి చొప్పున కరోనా కేసులు నమోదైనట్లు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఇద్దరు వ్యక్తులు వైరస్‌ బారిన పడినట్లు అధికారులు వెల్లడించారు.

79.23 శాతం పీడితులు స్థానికులే..

జిల్లాలో మొదట్లో బయట నుంచి వచ్చిన వ్యక్తుల్లోనే ఎక్కువగా పాజిటివ్‌ కేసులు వెలుగుచూసేవి.. తర్వాత క్రమంలో పరిస్థితి తారుమారయింది. జిల్లాలో ఇప్పటివరకు 2,676 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీటిలో జిల్లాలో ఉంటున్నవారిలో 2,120 పాజిటివ్‌ కేసులు వెలుగుచూశాయి. ఇతర దేశాలు, రాష్ట్రాలు, జిల్లాల నుంచి వచ్చిన 556 మంది ఇప్పటివరకు వైరస్‌ బారిన పడినట్లు గుర్తించారు. మొత్తం కేసుల్లో 79.23 శాతం స్థానికులే కాగా.. మిగిలిన 20.77 శాతం పాజిటివ్‌లు ఇతర ప్రాంతాల నుంచి జిల్లాకు వచ్చినవారు కావడం గమనార్హం.

క్వారంటైన్‌లో 162 మంది..

జిల్లాలోని క్వారంటైన్‌ కేంద్రాల్లో 162 మంది ఉన్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి సీహెచ్‌ సత్తిబాబు తెలిపారు. అనుమానిత లక్షణాలతో రాజమహేంద్రవరం జిల్లా ఆసుపత్రిలో 63 మంది, కాకినాడ జీజీహెచ్‌లో 25 మంది చికిత్స పొందుతున్నారు. జిల్లాకు చెన్నై, హైదరాబాద్‌, బెంగళూరు నుంచి విమాన మార్గంలో 25 మంది వచ్చారు. రైళ్లు, బస్సు మార్గాల్లో ఇతర ప్రాంతాల నుంచి 66 మంది వచ్చారు.

జీజీహెచ్‌లో ముగ్గురుకి పాజిటివ్‌

కాకినాడ (మసీదు సెంటర్‌): కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న ఓ హౌస్‌సర్జన్‌, ఇద్దరు పీజీలకు కరోనా పాజిటివ్‌ వచ్చిందని జీజీహెచ్‌ కరోనా నోడల్‌ అధికారి డా.మాతంగి కిరణ్‌ శుక్రవారం తెలిపారు. 25 మంది వైద్యులు, ల్యాబ్‌ టెక్నీషియన్లు, నర్సులు, శానిటేషన్‌ సిబ్బందికి పరీక్షలు నిర్వహించామన్నారు. ఆసుపత్రిలోని కరోనా వార్డులో 106 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారని, శుక్రవారం 20 మంది డిశ్చార్జ్‌ అయ్యారని తెలిపారు.

కరోనా సోకిన వ్యక్తికి శస్త్రచికిత్స

కాకినాడ (మసీదు సెంటర్‌): కొవిడ్‌ వ్యాప్తి నేపథ్యంలో సాధారణ అనారోగ్య సమస్యలతో ఆసుపత్రులకు వెళ్తే కొన్ని చోట్ల చేర్చుకోని పరిస్థితుల్లో.. కరోనా పాజిటివ్‌ ఉన్న వ్యక్తికి కాకినాడలోని జీజీహెచ్‌ వైద్యులు గురువారం రాత్రి శస్త్రచికిత్స చేశారు. వివరాల్లోకి వెళ్తే.. 9వ తేదీన ధవళేశ్వరానికి చెందిన 55 ఏళ్ల వ్యక్తి తీవ్ర కడుపు నొప్పితో బాధపడుతుంటే అంబులెన్స్‌లో జీజీహెచ్‌కు తరలించారు. అతనికి పొట్ట వద్ద శస్త్రచికిత్స చేశామని కోలుకుంటున్నాడని సర్జరీ డిపార్ట్‌మెంట్‌ చీఫ్‌ డా.రవి కమల తెలిపారు.

స్వస్థలాలకు జిల్లావాసుల రాక

విశాఖపట్నం(ఎన్‌ఏడీకూడలి): దుబాయి, రస్‌ఆల్‌ ఖైమా ప్రాంతాల నుంచి ప్రత్యేక విమానాల్లో పలువురు భారతీయులు శుక్రవారం విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఉదయం 7 గంటలకు రస్‌ఆల్‌ఖైమా నుంచి 180 మంది ప్రయాణికులు వచ్చారు. వారిలో తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వారు 20 మంది ఉన్నారు. వారందరికీ పోర్టు కల్యాణ మండపంలో వైద్య పరీక్షలు జరిపారు.

●దుబాయి నుంచి మధ్యాహ్నం 12.20 గంటలకు వచ్చిన విమానంలో 171 మంది ప్రయాణికులు వచ్చారు. వారిలో తూర్పు గోదావరికి చెందిన వారు 48 మంది ఉన్నారు. వీరికి వైద్యపరీక్షలు నిర్వహించి క్వారంటైన్‌ కేంద్రాలకు తరలించారు.

 

కరోనా కర్కశత్వం

మృతదేహానికి పారిశుద్ధ్య సిబ్బంది అంత్యక్రియలు

గడియార స్తంభం(అమలాపురం): కరోనా కర్కశత్వాన్ని ప్రదర్శిస్తోంది. ఈ వ్యాధి సోకి ఎవరైనా మరణిస్తే కడసారి చూపునకు కూడా కుటుంబ సభ్యులు, బంధు మిత్రులకు అవకాశం దక్కడం లేదు. ఇలాంటి సంఘటనల్లో మృతి చెందిన వారు ధనికులైనా, బీదలైనా చివరకు పారిశుద్ధ్య కార్మికులే అంత్యక్రియలు నిర్వహించాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నారు. ఇటువంటి ఘటన శుక్రవారం అమలాపురంలో చోటుచేసుకుంది. ఇక్కడి దేవాంగుల వీధిలో 60 ఏళ్ల వ్యక్తి ఫ్యాన్సీ వస్తువుల టోకు వ్యాపారం చేసేవారు. ఆయనకు భార్య, కుమార్తె ఉన్నారు. ఆయన ఈ నెల 7న తీవ్రమైన జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడుతూ చికిత్స నిమిత్తం స్థానిక ప్రాంతీయ ఆసుపత్రికి వెళ్లారు. ఆదే రోజు ఆర్‌.టి.పి.సి.ఆర్‌. పరీక్షకు నమూనా సేకరించారు. వ్యాధి లక్షణాలు తీవ్రం కావడంతో ప్రాంతీయ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందారు. అనంతరం ఆ వ్యక్తి నుంచి నాజిల్‌ స్వాబ్‌ సేకరించి పరీక్ష నిర్వహించగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో భ్యార్య, కుమార్తె నుంచి నమూనాలు సేకరించి వారిని హోం క్వారంటైన్‌లో ఉంచారు. ఇతర కుటుంబ సభ్యులు, బంధువులు అంత్యక్రియల నిర్వహణకు ముందుకు రాకపోవడంతో ప్రభుత్వ నిబంధనల మేరకు పారిశుద్ధ్య సిబ్బంది ప్రాంతీయ ఆసుపత్రి మార్చురీ నుంచి మృతదేహాన్ని కైలాస రథంలో బైపాస్‌ రోడ్డులోని కంపోస్టు యార్డు పక్కనున్న శ్మశాన వాటికకు తరలించి ఖననం చేశారు. ఈ సంఘటన స్థానికులను తీవ్రంగా కలచివేసింది. గత నెల 20న ఉప్పలగుప్తానికి చెందిన 52 ఏళ్లు వ్యక్తి కరోనా కారణంగా అమలాపురం ప్రాంతీయ ఆసుపత్రిలో మృతి చెందగా కర్మకాండలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులెవరూ చొరవ చూపకపోవడంతో పారిశుద్ధ్య కార్మికులే అంత్యక్రియలు నిర్వహించారు.

కరోనాతో మృతి చెందిన వ్యక్తిని ఖననం చేస్తున్న పురపాలక పారిశుద్ధ్య సిబ్బంది

 

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.